ట్రంప్ తగ్గినట్టేనా..?
ABN , Publish Date - Mar 25 , 2026 | 04:47 AM
నిన్నగాక మొన్న ఇరాన్‌ను పూర్తిగా తుడిచిపెట్టేస్తానంటూ భీకరగర్జనలు చేసిన అమెరికా అధ్యక్షుడు ఇంతలోనే చర్చల గురించి మాట్లాడటం, ఓ ఐదురోజులు దాడులు ఆపాలని నిర్ణయించడం...
నిన్నగాక మొన్న ఇరాన్‌ను పూర్తిగా తుడిచిపెట్టేస్తానంటూ భీకరగర్జనలు చేసిన అమెరికా అధ్యక్షుడు ఇంతలోనే చర్చల గురించి మాట్లాడటం, ఓ ఐదురోజులు దాడులు ఆపాలని నిర్ణయించడం ఆశ్చర్యం. ఎదుటిపక్షాన్ని దుంపనాశనం చేస్తున్న ఈ దశలో ఎవరూ ఆగరు, కాల్పుల విరమణకు తావేలేదు అన్నాడాయన ఎంతో అహంభావంతో వైట్‌హౌస్‌లో. కానీ, ఇంతలోనే ఆయన మాటతీరు మారిపోయింది. ఈ ఐదురోజుల విరామం వెనుక వ్యూహం ఉన్నదని, మరింత గట్టిగా కాటువేయడానికే కాలువెనక్కుతీసుకుంటున్నట్టు కనిపిస్తున్నాడని కొందరంటారు. గత ఏడాది జూన్‌లో ఇరాన్ అణుస్థావరాలమీద అమెరికా యుద్ధవిమానాలు దాడిచేసినప్పుడు అది అంతగా ప్రతిఘటించలేదు. దీనితో, ఇరాన్‌ను సులభంగా కబళించవచ్చునని ట్రంప్ భ్రమపడి ఉండవచ్చు. ఇప్పుడది చుక్కలు చూపిస్తూండటంతో, ఇరాన్‌మీద యుద్ధం స్వల్పకాలిక విహారయాత్ర కాదని అర్థమై, బయటపడే దారులకోసం వెతుకుతున్నాడని కొందరి వాదన. ఈ ఐదురోజుల విరామం నిజమేనా, నిలుస్తుందా అన్న అనుమానాలను అటుంచితే, మళ్ళీ అమెరికా దాడులంటూ మొదలైతే యుద్ధం ప్రభావంతో యావత్ ప్రపంచం సమీప భవిష్యత్తులో కోలుకోలేదన్న మాట వాస్తవం.
ట్రంప్ ఎందుకు తగ్గారు? ఎవరికీ అంతుచిక్కడం లేదు. దాడిచేయమని చెప్పింది నువ్వేగా అంటూ పక్కనే ఉన్న తన రక్షణమంత్రి పీట్ హెగ్సెత్‌ను ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్య ఆయన మానసికస్థితికి అద్దం పడుతోందని విశ్లేషకులు అంటున్నారు. ఇరాన్ ప్రతిఘటన ట్రంప్ లెక్కకు అందలేదన్నది వాస్తవం. గల్ఫ్‌దేశాలను దాడులతో ఉక్కిరిబిక్కిరిచేస్తూ, జలసంధిని గుప్పిట్లో పెట్టుకొని యావత్ ప్రపంచాన్ని ఇరాన్ ఒత్తిడికి గురిచేస్తోంది. 48గంటల్లో హార్ముజ్‌ని పూర్తిగా వదిలిపెట్టకపోతే విద్యుత్ కేంద్రాలను పేల్చేస్తామన్న ట్రంప్ హెచ్చరికను సైతం ఇరాన్ తేలికగా తీసిపారేసింది. పశ్చిమాసియాలోని ప్రతీ కీలక సదుపాయం, చమురు క్షేత్రం సర్వనాశనమైపోతాయని తిరిగి హెచ్చరించింది. జలసంధిని విముక్తిచేయండని నాటో దేశాలను బతిమాలినా, బెదిరించినా, అవమానించినా ఫలితం లేకపోయింది. ఇరాన్ క్షిపణిసామర్థ్యాన్ని కూడా అమెరికా సరిగా అంచనావేయలేకపోయింది. నాలుగువేల కిలోమీటర్ల దూరంలో ఉన్న డీగో గార్సియాను కూడా అది ఢీకొట్టగలుగుతోంది, మరోపక్క ఇజ్రాయెల్ అణుకేంద్రం పక్కనే క్షిపణిని ప్రయోగించి దానికి నిద్రపట్టకుండా చేసింది.
ఈ కొద్దిరోజుల యుద్ధానికే గల్ఫ్‌దేశాల్లో అన్ని రంగాలు దెబ్బతిని, భారీ నష్టాలను మూటగట్టుకొని, ట్రంప్‌మీద ఒత్తిడి పెంచడంతో ఆయన మళ్ళీ చర్చల గురించి మాట్లాడుతున్నారని కొందరి వాదన. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ అమెరికాతో తాము చర్చలు జరపడం లేదని, ఎన్నిరోజులైనా యుద్ధం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఇరాన్ ప్రకటించింది. నిజంగానే ఏదోదారిలో మంతనాలు ఒకవేళ మొదలైనా, కాల్పుల విరమణ కొనసాగిన పక్షంలో, చర్చలు సైతం మరికొంత కాలం జరగడం వినా, ఈ ఐదురోజుల్లోనే అవి ఫలప్రదమైపోతాయని ఎవరూ నమ్మరు. ఈ విరామాన్ని వాడుకొని చమురు మంటలను కాస్తంత చల్లార్చడం, ఇరాన్‌మీద ముప్పేటదాడికి సమస్త సైన్యాన్నీ మోహరించి, మారణాస్త్రాలను సంసిద్ధం చేసుకోవడం ఆయన లక్ష్యం కావచ్చు. చర్చల ముసుగులో యుద్ధం చేయడం ఆయనకు అలవాటు. గత ఏడాది చర్చలు పూర్తిగా ఫలప్రదమైనా కూడా ఆయన ఇరాన్‌మీద విరుచుకుపడ్డాడు. మొన్న ఫిబ్రవరిలో ఒకపక్క జెనీవాలో మాటలు సాగుతూంటే, మరోపక్క ఈయన యుద్ధసన్నాహాలు చేసుకున్నాడు, అవి ముగిసిన రెండోరోజునే ఖమేనీ సహా సీనియర్ నాయకులను హతమార్చాడు. కాస్తంత విరామాన్ని ప్రకటించినంత మాత్రాన యుద్ధం కొలిక్కివచ్చేస్తుందని నమ్మడం కష్టం. ఇరాన్ యుద్ధం కోసం రెండువందల బిలియన్ డాలర్లు కావాలని అమెరికన్ కాంగ్రెస్‌ను ఆయన ఇప్పటికే అడిగాడు. దాదాపు రెండులక్షలమంది అమెరికన్ సైనికులు ఇరాక్‌లో ఉంటూ, యుద్ధం పతాకస్థాయికి చేరిన దశలో కూడా అప్పటి అధ్యక్షుడికి ఇందులో సగం కూడా అవసరపడలేదు. ఇరాన్ మీద సుదీర్ఘయుద్ధానికి ట్రంప్ సిద్ధపడుతున్నాడు. అణ్వాయుధాలను వదులుకోవడానికి ఇరాన్ ప్రస్తుత నాయకత్వం కూడా అంగీకరించనందున ఆ దేశాన్ని దుంపనాశనం చేయవలసి వచ్చిందని చెప్పడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. గాజాను మించిన ఘోరాలను, మరో మారణకాండను మిగతా ప్రపంచం కళ్ళప్పగించి చూడబోతోంది.
ఇవి కూడా చదవండి..
5 రోజుల పాటు దాడులు నిలిపివేస్తున్నాం.. ట్రంప్ కీలక ప్రకటన
అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదు: ఇరాన్