Share News

హక్కుల హరణం

ABN , Publish Date - Mar 27 , 2026 | 01:15 AM

ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తుల హక్కులు, రక్షణలకు సంబంధించిన చట్టంలో మార్పుచేర్పులకు ఉద్దేశించిన సవరణ బిల్లును పార్లమెంట్‌ ఆమోదించడంతో, అది కొత్త సమస్యలు తెచ్చి...

హక్కుల హరణం

ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తుల హక్కులు, రక్షణలకు సంబంధించిన చట్టంలో మార్పుచేర్పులకు ఉద్దేశించిన సవరణ బిల్లును పార్లమెంట్‌ ఆమోదించడంతో, అది కొత్త సమస్యలు తెచ్చిపెడుతుందన్న భయం మరింత పెరిగింది. ఈ సవరణలతో ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తులకు మరింత నిర్దిష్టమైన గుర్తింపు, రక్షణలు దక్కుతాయని వాదిస్తూ, విపక్షాలు లేవనెత్తిన అభ్యంతరాలను ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ సవరణల ద్వారా, సదరు వ్యక్తులపై జరిగే దాడులు, వేధింపుల తీవ్రత ఆధారంగా నేరస్తులకు వివిధ స్థాయిల్లో శిక్షలను విధించేలా చట్టాన్ని కఠినతరం చేశారు. అయితే, అనేకానేక లోపాలను సరిదిద్దడానికి వీలుగా బిల్లును సెలక్ట్‌ కమిటీకి నివేదించాలన్న విపక్షాల అభ్యర్థనను ప్రభుత్వం మన్నించివుంటే, మరింత విస్తృత చర్చకు సమయం, అవకాశం కూడా కల్పించివుంటే విమర్శలకు తావుండేది కాదు. సవరణ లక్ష్యానికి కూడా అర్థం, పరమార్థం దక్కేవి.

అసలు సిసలు ట్రాన్స్‌జెండర్లకు దక్కాల్సిన ప్రయోజనాలు, హక్కులు, తామూ అదే కోవకు చెందినవారమని చెప్పుకొనే కొందరు దుర్వినియోగం చేస్తున్నారని, చట్టంలో ఉన్న కొన్ని నిర్వచనాలు సైతం అందుకు వీలు కల్పిస్తున్న తరుణంలో, వాటికి ఇప్పుడు నిర్దిష్టత తీసుకువచ్చామని ప్రభుత్వం చెబుతోంది. ట్రాన్స్‌జెండర్‌గా ఎవరిని పేర్కొనాలో వివరించడంతోపాటు, ఆ నిర్వచనం పరిధిలోకి వచ్చే వ్యక్తులకు గుర్తింపు కార్డులు సహా అనేక అదనపు వెసులుబాట్లు ఈ సవరణల్లో ఉన్నాయి. హక్కులు దక్కడంతోపాటు, ప్రభుత్వం అందించే ప్రయోజనాలు సులువుగా అందుకొనేందుకు ఇది ఉపకరిస్తుందని వాదన. ట్రాన్స్‌జెండర్లను దూషించడం, బహిరంగస్థలాల్లోకి అనుమతించకపోవడం, బెదిరించి, భయపెట్టి వెళ్ళగొట్టడం వంటి చర్యలకు పాల్పడినవారికి గట్టి శిక్షలు వేయాలన్న నిర్ణయం మంచిదే. ఇది వారికి మరింత భద్రతను ఇస్తుంది. అయితే, ఈ సవరణ బిల్లు ట్రాన్స్‌జెండర్‌కు సంకుచితమైన, పరిమితమైన నిర్వచనం ఇవ్వడం ద్వారా అనేక లైంగిక ధోరణులు, గుర్తింపులున్నవారిని దాని పరిధినుంచి దూరం చేసి అన్యాయం చేసిందన్న వాదన బలంగా ఉంది. సంప్రదాయంగా, దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో మనుగడ సాగిస్తున్న ట్రాన్స్‌జెండర్లలో కొన్ని సాంస్కృతిక గుర్తింపులున్నవారు మాత్రమే ఈ పరిధిలోకి వచ్చి, లక్షలాదిమంది ఈ చట్టం కల్పించే రక్షణలకు దూరం అవుతున్నారన్నది విమర్శ. దేశంలోని ప్రతీ రాష్ట్రంలోనూ అనూచానంగా సమాజం ఆమోదించిన, వివిధ పేర్లతో చెలామణీ అవుతున్న ట్రాన్స్‌జెండర్లకు ఈ చట్టం గుర్తింపు ఇవ్వకపోవడం వల్ల వారు ప్రాథమిక హక్కులకు సైతం నోచుకోకపోయే ప్రమాదం ఉన్నదని ఈ రంగంలో పనిచేస్తున్నవారి భయం.


పౌరులకు మరిన్ని హక్కులు కల్పించడానికి కొత్త చట్టాలు చేయడం మన దేశంలో అరుదు. ఉన్నవాటిని బలహీనపరచడమే ఎక్కువగా జరుగుతోంది. 2019నాటి ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తుల (హక్కుల పరిరక్షణ) చట్టాన్ని మరింత మెరుగుపరచడమే లక్ష్యమని అంటున్నప్పుడు, విస్తృతచర్చలతో, దాని పరిధి మరింత విస్తరించాలి. ఇంతకాలమూ ఆవల మిగిలి, అన్యాయానికి గురవుతున్న అధికులకు మేలు జరగాలి. 2014 నాటి చారిత్రాత్మక ‘నల్సా’ తీర్పుద్వారా సుప్రీంకోర్టు ట్రాన్స్‌జెండర్లను గుర్తించి, వారికి హక్కులు కల్పించింది. అందులో భాగంగానే, స్వీయ గుర్తింపునకు అవకాశం ఇచ్చింది. తదనుగుణంగా, ఆ తరువాత వచ్చిన చట్టం కింద, ఒకవ్యక్తి తాను ట్రాన్స్‌జెండర్‌నని దరఖాస్తు చేసుకుంటే, జిల్లా కలెక్టర్‌ నుంచి ధ్రువీకరణపత్రం దక్కేది. ఇకపై అలా కుదరదని, ప్రధాన వైద్యాధికారి ఆధ్వర్యంలో ఏర్పడిన మెడికల్‌ బోర్డు సిఫార్సు ఆధారంగానే ధ్రువీకరణ జరగాలని కొత్తసవరణ చెబుతోంది. ముప్పైరోజుల్లో కలెక్టర్‌నుంచి పత్రం దక్కుతుందని పాతచట్టం హామీ ఇస్తున్నా కూడా ఏటా సగం దరఖాస్తులు మిగిలిపోయేవట. ఇప్పుడు మెడికల్‌ బోర్డు కూడా వచ్చిచేరడం వల్ల ఆ ప్రక్రియ మరింత జటిలమవుతుంది. ఒక వైద్యాధికారి లింగపరీక్ష చేసి ధ్రువీకరించాలని అనడం ద్వారా ‘ట్రాన్స్‌జెండర్‌’ అన్నది ఒక వైద్యసంబంధిత అంశంగా ప్రభుత్వం భావిస్తున్నదని అనుకోవాలి. ఒక వ్యక్తి తన లైంగికస్థితిని తనకుతానుగా చెప్పుకోవడం కాక, గోప్యతనూ ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి వైద్యపరీక్షలకు గురైనపక్షంలో వేరొకరు నిర్ణయిస్తారు. ఇది అమానవీయమే కాక, గత తీర్పును కూడా ఉల్లంఘిస్తున్నందునే, సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఒకటి ఈ సవరణ చట్టాన్ని నిలిపివేయమని సూచించింది. కానీ, అంతిమంగా పాతకాలపు భావజాలానిదే పైచేయి అయింది.

ఇవి కూడా చదవండి

ఇరాన్‌కు ఎదురుదెబ్బ.. దాడిలో నేవీ చీఫ్ మృతి..

IPL 2026 : రెండో ద‌శ‌ షెడ్యూల్ వ‌చ్చేసింది..

Updated Date - Mar 27 , 2026 | 01:15 AM