వలస వెల్లువ!
ABN , Publish Date - Aug 01 , 2026 | 01:03 AM
మొరాకో నుంచి వేలాదిగా తరలివస్తున్న వలసదారులతో స్పెయిన్ ఏలుబడిలో ఉన్న సియోటా వొణికిపోతోంది. లక్షలోపు జనాభా ఉన్న ఈ చిన్ననగరంలోకి రెండురోజుల్లోనే అరవైవేలమంది ప్రవేశించారు...
మొరాకో నుంచి వేలాదిగా తరలివస్తున్న వలసదారులతో స్పెయిన్ ఏలుబడిలో ఉన్న సియోటా వొణికిపోతోంది. లక్షలోపు జనాభా ఉన్న ఈ చిన్ననగరంలోకి రెండురోజుల్లోనే అరవైవేలమంది ప్రవేశించారు. కారు చీకట్లో, చిన్నచిన్న రబ్బరు ట్యూబుల సాయంతో గంటల తరబడి సముద్రాన్ని ఈదివచ్చిన క్రమంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. సముద్రజలాల్లో అనేక మృతదేహాలు తేలుతూ కనిపిస్తున్నాయి. వేలాదిగా వచ్చిన వీరితో ఆ నగరంలోని పార్కులు, బహిరంగస్థలాలు, బీచ్‌లు క్రిక్కిరిసిపోతున్నాయి. చరిత్రలో ఎన్నడూ చూడనంత పెద్దసంఖ్యలో చొరబడినవారితో వ్యవహరించడం స్పెయిన్ అధికారులకు సాధ్యం కావడం లేదు.
స్పెయిన్ భూభాగంలో కాలూనగానే వారంతా సంతోషంతో చిందులు వేస్తున్న, ఆ భూమిని ముద్దాడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. ప్రాణాలకు తెగించి ఎందుకు వచ్చారన్న ప్రశ్నకు ‘పని..పని.. అమ్మా వద్దు, నాన్నా వద్దు’ అంటూ కొందరు యువకులు జవాబు ఇస్తున్నారు. ఒడ్డుకుచేరిన తరువాత, తాము ఆ సాహసానికి ఒడిగట్టిన విషయాన్ని ఫోన్ ద్వారా ఇంట్లోవారికి తెలియచేస్తున్న పదహారేళ్ళలోపువారు కూడా ఎంతోమంది. ఇరవై నాలుగుగంటల్లో నలభైవేలమంది ఒక్కసారిగా తరలివచ్చిన ఈ హఠాత్పరిణామానికి సియోటా నగరవాసులు బెంబేలెత్తిపోకుండా, వలసదారులకు తిండీనీరు అందిస్తున్నారు. తమను వెనక్కుపంపేయవద్దంటూ ప్రాధేయపడుతున్న వలసదారులను అరబిక్ తెలిసిన వాలంటీర్లు అనునయిస్తున్నారు. మొరాకోనుంచి ఈ నగరానికి అక్రమవలసలు గతంలోనూ ఉన్నవే కానీ, ఈ భారీ సంఖ్యకు కారణాలేమిటో స్పష్టంగా తెలియదు. రెండురోజుల క్రితం మొరాకో రాజు తన పట్టాభిషేక వార్షికోత్సవం సందర్భంగా, చిన్నచిన్న నేరాల్లో జైలుశిక్ష అనుభవిస్తున్న వందలాది ఖైదీలకు క్షమాబిక్ష ప్రకటించడంతో, అలా విడుదలైనవారే ఇప్పుడు సరిహద్దులు దాటి స్పెయిన్‌లోకి ప్రవేశించారని ఓ ప్రచారం జరుగుతోంది. మొరాకో అధికారులే వారిని వాహనాల్లో తెచ్చి సరిహద్దుల్లో వదిలేశారనీ అంటున్నారు. స్పెయిన్ సుప్రీంకోర్టు జూలై మొదటివారంలో ఇచ్చిన తీర్పులో, సముద్రాన్ని ఈదివచ్చిన వలసదారులను వెంటనే వెనక్కునెట్టేయవద్దంటూ అధికారులకు ఇచ్చిన ఆదేశాలు కూడా ఈ భారీ వలసకు దోహదం చేసిందని మరోవాదన. ఇంతకాలమూ స్వల్పసంఖ్యలో కంచెలు దాటి స్పెయిన్‌లోకి ప్రవేశిస్తున్న మొరాకో వలసదారుల్లో అత్యధికులు ఇప్పుడు సముద్రాన్ని ఈదడానికి కారణం ఇదేనని అంటారు. అక్రమంగా సరిహద్దులు దాటివచ్చేవారికోసం స్పెయిన్ తన వలస విధానాలను సరళతరం చేసిందంటూ కొన్ని లక్ష్యాలకోసం క్రిమినల్ గ్యాంగులు పనిగట్టుకొని దుష్ప్రచారం చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆ దేశ ప్రధాని పెడ్రో సాంచేజ్ ఆరోపిస్తున్నారు. అయితే, ఇప్పుడు వచ్చినవారెవ్వరికీ సుప్రీంకోర్టు తీర్పు గురించి తెలియదని, వారు ఆకలి, దారిద్ర్యం, ఉపాధి గురించి మాత్రమే మాట్లాడుతున్నారని స్వచ్ఛందసంస్థలు స్పష్టంచేస్తున్నాయి.
ఆఫ్రికాతో ఐరోపా సమాఖ్యకు ఉన్న రెండు భూ సరిహద్దుల్లో సియోటా ఒకటి. ఐదువందలేళ్ళుగా ఇది స్పెయిన్ నియంత్రణలో ఉన్నప్పటికీ, మొరాకో మాత్రం గుర్తించడం లేదు. ఐదేళ్ళక్రితం ఒకేసారి పదివేలమంది వలసదారులు ఈ నగరాన్ని ముంచెత్తడం వెనుక మొరాకో కక్షసాధింపు చర్య ఉన్నదని అప్పట్లో వార్తలు వచ్చాయి. పశ్చిమ సహారాలో స్వయంప్రతిపత్తికోసం పోరాడుతున్న ఒక తిరుగుబాటు నాయకుడికి స్పెయిన్ ఆశ్రయం ఇచ్చి వైద్యచికిత్స అందించడం మొరాకో రాజుకు ఆగ్రహం కలిగించిందట. వారంక్రితం అల్జీరియాలో స్పెయిన్ ప్రధాని పర్యటించి, సత్సంబంధాలు నెలకొల్పుకోవడం, ఆర్థిక, వాణిజ్య ఒప్పందాలు కుదర్చుకోవడం మొరాకోకు కోపం తెప్పించి ఉండవచ్చు. యూరప్ దేశాధినేతలను ఈ భారీ వలస భయపెడుతోంది. ముందుగా వలసదారులను స్పెయిన్ ప్రధాన భూభాగంలోకి ప్రవేశించకుండా ఆపాలని, యూరప్ ఖండంలోకి రానివ్వకూడదని జర్మనీ చాన్సలర్ హెచ్చరిస్తున్నారు. ఫ్రాన్స్ మేక్రాన్ జాగ్రత్తగా మాట్లాడారు కానీ, ఇటలీ ప్రధాని మెలోనీ మాత్రం తనదేశ పౌరుల క్షేమంకోసం స్పెయిన్‌తో ఉన్న సరిహద్దుని కూడా మూసేస్తానని ఓ హెచ్చరిక చేశారు. మితవాదుల ప్రాబల్యం హెచ్చుతూ, పలురకాల విద్వేషాలతో బాధపడుతున్న యూరప్ ఈ సంక్షోభకాలంలో స్పెయిన్‌కు అండగా ఉంటూ, వలసదారులతో సున్నితంగా వ్యవహరించేందుకు సహకరించాలి.
ఈ వార్తలనూ చదవండి:
పీఓకేలో దాడులపై తీవ్రంగా స్పందించిన భారత్
కరాచీలో ‘ధురంధర్’ సీన్ రిపీట్.. ఉజైర్ బలోచ్ సోదరుడిపై కాల్పులు