నిగూఢ అంటువ్యాధి
ABN , Publish Date - Feb 26 , 2026 | 02:57 AM
ఎనభై ఏళ్ల క్రితం రూపుదిద్దుకున్న ప్రస్తుత ప్రపంచ వ్యవస్థను పూర్తిగా విచ్ఛిన్నం చేసేందుకు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతగా ఆరాటపడుతున్నారో వందేళ్ల క్రితం ఆయన స్థానంలో ఉన్న వ్యక్తి ప్రపంచ శాంతికి...
ఎనభై ఏళ్ల క్రితం రూపుదిద్దుకున్న ప్రస్తుత ప్రపంచ వ్యవస్థను పూర్తిగా విచ్ఛిన్నం చేసేందుకు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతగా ఆరాటపడుతున్నారో వందేళ్ల క్రితం ఆయన స్థానంలో ఉన్న వ్యక్తి ప్రపంచ శాంతికి ఒక అంతర్జాతీయ సంస్థను నిర్మించేందుకు అంతగా పట్్టుదల చూపారు. ఆ మంచిమనిషి ఉడ్రో విల్సన్. తన ఆలోచన అయిన నానాజాతి సమితి ఏర్పాటుకు అమెరికా అత్యున్నత చట్టసభ సహకరించకపోవడంతో ప్రజల మద్దతుకై 1919 ఆగస్టులో ఆయన దేశవ్యాప్తంగా పర్యటించారు. రోజుకు కనీసం మూడు ఉపన్యాసాలు వెలువరిస్తూ 22 రోజుల్లో 8,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఊపిరిసలపని ఈ కార్యక్రమాల ఒత్తిడితో విల్సన్ స్ట్రోక్‌కు గురై మరణించారు. ఒక సమున్నత లక్ష్యసాధనకు పూనుకున్న సజ్జనుల జీవితాలు స్ట్రోక్ మూలంగా అర్ధాంతరంగా ముగిసి చరిత్ర చిన్నబోయిన సందర్భాలు ఇరవయో శతాబ్దిలో చాలా ఉన్నాయి.
మెదడుకు రక్త ప్రసరణ నిరోధించబడినప్పుడు లేదా మెదడులో రక్తనాళం పగిలిపోయిప్పుడు స్ట్రోక్ సంభవిస్తుంది. ఈ స్ట్రోక్‌లను రెండు తరగతులుగా వర్గీకరిస్తారు. ఒకటి– ఇస్కీమీక్ , రెండు– హెమరేజిక్. పంటక్షేత్రాలకు నీటిని సరఫరా చేసే మార్గాలకు అవరోధాలు ఏర్పడితే పంటచేలు ఎండిపోయినట్టు మెదడుకు రక్తాన్ని తీసుకువచ్చే ధమనుల్లో రక్తం గడ్డకట్టడం వల్ల ఇస్కీమిక్ స్ట్రోక్ సంభవిస్తుంది. హెమరేజిక్ స్ట్రోక్ సునామీ సదృశమైనది. పగిలిన రక్తనాళం మెదడుకు, కీలకమైన నాడీ కేంద్రాలు, మార్గాల మధ్య సంబంధాలను విచ్ఛిన్నం చేస్తుంది. దీని పర్యవసానాలు తీవ్రమైనవి.
ప్రపంచవ్యాప్తంగా అన్ని సమాజాలలోను స్ట్రోక్ అంతకంతకూ ప్రజారోగ్యానికి పెనుసవాల్‌గా పరిణమిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనాల ప్రకారం మరణాలకు మూడో ప్రధాన కారణంగా ఈ వ్యాధి ఉన్నది. 2021లో 11.9 మిలియన్ స్ట్రోక్ కేసులు నమోదయ్యాయి. 1990లో నమోదైన వాటి కంటే ఇది 70శాతం అధికం. అదే సంవత్సరం మన దేశంలో 1.25 మిలియన్ కొత్త స్ట్రోక్ కేసులు నమోదయ్యాయి. 1990లో నమోదైన వాటి కంటే ఇది 51శాతం అధికం. భారత్‌లో ఈ కేసుల ప్రస్తుత పరిస్థితి మరింత భయం గొలిపేదిగా ఉన్నది. ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ స్ట్రోక్’లో ప్రచురితమైన ‘నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్స్ అండ్ రీసెర్చ్’ తాజా అధ్యయన నివేదిక ప్రకారం మన దేశంలోని ప్రతి ఏడుగురు స్ట్రోక్ బాధితులలో ఒకరు 45 సంవత్సరాల వయసులోపు వారు కాగా ఈ వ్యాధి లక్షణాలు కన్పించిన ప్రతి ఐదుగురులో ఇద్దరు మాత్రమే ఆస్పత్రికి సకాలంలో రాగలుగుతున్నారు. మెదడుకు రక్తప్రసరణ నిలిచిపోయినప్పుడు ప్రతి నిమిషానికి 1.9 మిలియన్ న్యూరాన్లు దెబ్బతిని స్ట్రోక్ తీవ్రమవుతుంది. మూడు గంటలలోగా తగు చికిత్స జరగని పక్షంలో స్ట్రోక్ బాధితుడు మరణించడమో లేక శాశ్వతంగా శారీరక అశక్తుడు కావడమో జరిగి తీరుతుంది. ‘టైమ్ ఈజ్ బ్రెయిన్’ అనేది స్ట్రోక్ విషయంలో ఒక కీలక చికిత్సా సూత్రం.
విచారకరమైన విషయమేమిటంటే స్ట్రోక్ భారిన పడుతున్న యువజనుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వృద్ధులు మాత్రమే స్ట్రోక్‌కు గురవుతారనే సంప్రదాయ విశ్వాసం సడలిపోతోంది. ఆధునిక జీవనశైలి, వృత్తి, ఉద్యోగ జీవితాలలో ఒత్తిడి ఫలితంగా యువజనులు స్ట్రోక్ భారినపడుతున్నారు. యువ జనాభాకు ఈ వ్యాధితో వాటిల్లుతున్న నష్టం సంబంధిత యువతీ యువకులది మాత్రమే కాదు. అది మొత్తం సమాజ శ్రేయస్సుకు సంభవిస్తోన్న విఘాతమనేది ఎవరూ నిరాకరించలేని వాస్తవం. మరింత స్పష్టంగా చెప్పాలంటే స్ట్రోక్ ఇప్పుడు ఒక నిశ్శబ్ద సంక్షోభం. ‘నిగూఢ అంటువ్యాధి’గా దానిని నిపుణులు పరిగణిస్తున్నారు.
స్ట్రోక్‌ను అపోప్లెక్సీ (ఆకస్మిక హింసాత్మక దెబ్బ)గా గుర్తించిన వైద్యశాస్త్ర పితామహుడు హిప్పోక్రేట్స్ ‘తీవ్రస్థాయి అపోప్లెక్సీని నివారించడం అసాధ్యం, తేలికపాటి అపోప్లెక్సీని ఎదుర్కోవడమూ తేలిక కాదు’ అని వ్యాఖ్యానించాడు. అయితే నవ నవీన సాంకేతికత కృత్రిమ మేధ (ఏఐ)ని ఉపయోగించి స్ట్రోక్‌కు చికిత్స చేయడంలోనే కాకుండా ముందస్తుగా దాని సంభావ్యతను గుర్తించి నివారించడంలో కూడా భారతీయ శాస్త్రవేత్తలు, డాక్టర్లు అగ్రగాములుగా ఉన్నారు. ఈ విషయంలో హెల్త్ టెక్ స్టార్టప్‌లు ప్రశస్త కృషి చేస్తున్నాయి. ఒక వ్యాధి గురించి వివేచిస్తున్నప్పుడు దానికొక మందును కనుగొనడం గురించి నేను ఆలోచించను, నివారించేందుకు దోహదం చేసే మార్గం గురించి మాత్రమే శ్రద్ధ వహిస్తాను అన్న లూయీ పాశ్చర్ మాటల స్ఫూర్తితో మెడికల్ ఏఐ నిపుణులు కృషి చేస్తున్నారు. స్ట్రోక్, ఆ మాటకొస్తే ఇతర ప్రాణాంతక వ్యాధుల భారిన పడినవారికి సంపూర్ణ ఉపశమనం కలిగించేందుకు వైద్య విజ్ఞానం చేసే దోహదంతో పాటు రోగులు తమ స్వంత ఆలోచనల బలం మీద ఆధారడి ఉండేలా చేయడం చాలా ముఖ్యమని ఏపీజే అబ్దుల్ కలాం సూచించారు. ఇందుకు డాక్టర్ల శిక్షణలో వైద్య మానవీయ శాస్త్రాలను నిర్మాణాత్మకంగా భాగం చేయవలసిన అవసరమున్నది.
ఇవి కూడా చదవండి
మచిలీపట్నంలో భారీ చోరీ.. ఉపాధ్యాయురాలి ఇంట్లో 50 తులాల బంగారం దొంగతనం
మీ పరిశీలనా శక్తికి టెస్ట్.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 45 సెకెన్లలో కనిపెట్టండి..