Share News

‘సిద్ద’ సన్యాసం..!

ABN , Publish Date - Jul 29 , 2026 | 02:13 AM

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు సిద్దరామయ్య ఆదివారం నాడు ఎక్స్‌ వేదికగా ఓ సంచలన ప్రకటన చేశారు. మరో రెండేళ్ళ తరువాత జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోనంటూ...

‘సిద్ద’ సన్యాసం..!

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు సిద్దరామయ్య ఆదివారం నాడు ఎక్స్‌ వేదికగా ఓ సంచలన ప్రకటన చేశారు. మరో రెండేళ్ళ తరువాత జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోనంటూ, ‍వయసు మీద పడటం, ఆరోగ్యం బలహీనపడటం, రాజకీయాల్లో అవినీతి పెచ్చరిల్లడం తనను ఈ నిర్ణయానికి పురిగొల్పిన కారణాలుగా వివరించారు. వరుణ నియోజకవర్గ ప్రజలు తనను మళ్ళీ పోటీచేయవలసిందిగా ఒత్తిడితెస్తున్నారని, కానీ, ప్రస్తుత పదవీకాలం ముగిసేటప్పటికి తన వయసు ఎనభైఒకటికి చేరుతుంది కనుక, ముందులాగా ఉత్సాహంగా పనిచేయలేనని అన్నారాయన. 1978లో తాలూకా బోర్డుసభ్యుడిగా ప్రజాజీవితంలోకి అడుగుపెట్టిన తన రాజకీయ ప్రస్థానానికి 2028నాటికి యాభైయేళ్ళు నిండుతాయంటూ, తాను ఎన్నడూ నమ్మిన సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరించలేదని, మనస్సాక్షిని చంపుకోలేదని చెప్పుకొచ్చారు. ఆ వ్యాఖ్యలతో పాటుగానే, ఎన్నికల రాజకీయాల తీరుమారిందని, అవి అవినీతిమయమైనాయని, నిజాయితీకి చోటు లేకుండాపోయిందని, ఎన్నికల్లో పోటీచేయాలంటే ప్రజలకు డబ్బు పంచాల్సి వస్తున్నదని, అందువల్లే తాను ఇక ఎన్నికల్లో పోటీచేయకూడదని నిర్ణయించుకున్నానని ముక్తాయించారు. ఈ ఏడాది జనవరిలో దేవరాజ్‌ అర్స్‌ పదవీకాలాన్ని అధిగమించి కర్ణాటకను అత్యధికకాలం ఏలిన ముఖ్యమంత్రిగా రికార్డు నెలకొల్పిన సిద్దరామయ్యకు, ముఖ్యమంత్రి పదవి వదులుకున్న రెండునెలల్లోనే అవినీతి రాజకీయాలమీద ఏవగింపు కలిగిందన్నమాట.

ఎన్నికల రాజకీయాలకు వీడ్కోలు పలికినా, యాభైయేళ్ళుగా రాష్ట్రప్రజలు తనమీద చూపిన ప్రేమాభిమానాలతో వారి రుణం ఇంకా తీరలేదని, మిగిలిన జీవితాన్ని కూడా ప్రజాసేవలోనే గడుపుతానని అంటున్నారు ఆయన. రాజకీయాల్లో డబ్బు, నల్లధనం ప్రభావం పెరిగిపోవడంతో నిరాశచెందే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు కూడా సమర్థిస్తున్నారు. మరి, ఆ దుర్లక్షణాలేవో రాజకీయాల్లోకి కొత్తగా ప్రవేశించినట్టుగా వాటిపై సిద్ధరామయ్యకు ఇప్పుడే ఎందుకు విరక్తి కలిగిందో తెలియదు కానీ, ప్రస్తుత రాష్ట్ర నాయకత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నాలేవీ ఈ వ్యాఖ్యల్లో లేవనే అనుకోవాలి. ఎన్నికల్లో పోటీచేయనంతమాత్రాన సిద్దరామయ్య రాజకీయాలకు దూరమైనట్టు కాదని, క్రియాశీలకంగానే ఉంటారని ఆయన కుమారుడు కూడా చెబుతున్నారు. మేనెలలో ముఖ్యమంత్రి పదవినుంచి వైదొలిగినప్పటినుంచీ సిద్దరామయ్య పెద్దగా వార్తల్లోకి రాకపోయినా, శివకుమార్‌ నేతృత్వంలోని కొత్త కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కీలకపాత్రే పోషిస్తున్నారు.


బీజేపీ–ఆరెస్సెస్‌లకు వ్యతిరేకంగా, సాంఘిక న్యాయానికి కట్టుబడిన వ్యక్తిగా ఈ కురుబ నాయకుడి క్షేత్రస్థాయి బలం చెప్పుకోదగ్గది. మైనారిటీలు, వెనుకబడిన తరగతులు, దళితులను తనపక్షాన నిలుపుకొని ఇరవైయేళ్ళుగా కాంగ్రెస్‌కు బలాన్నిచ్చారు. బీజేపీలో యెడియూరప్పనూ, కాంగ్రెస్‌లో ఈయననూ విశ్లేషకులు సరిపోల్చుతూ ఉంటారు. విధిలేక యెడియూరప్పను సీఎం పదవినుంచి బీజేపీ తప్పించినప్పటికీ, ఆ బలమైన లింగాయత్‌ నాయకుడికి సంబంధించిన ప్రతీ వేడుకనూ ఘనంగా నిర్వహిస్తూ ఆ ఓటుబ్యాంకును నిలబెట్టుకొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తూనే ఉంది. అలాగే, చాలా నియోజకవర్గాల్లో గణనీయమైన సంఖ్యలో ఉన్న కురుబ జనాభా హోరాహోరీ ఎన్నికల పోరులో ఫలితాన్ని నిర్ణయిస్తున్నందున సిద్దరామయ్యకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌లో ఎవరూ లేరు.

సిద్దరామయ్యను తప్పించి, 13మంది మంత్రులతో డికె శివకుమార్‌ బాధ్యతలు స్వీకరించి దాదాపు రెండునెలలు అవుతున్నప్పటికీ, వర్గాల వైరం కారణంగా మంత్రివర్గ విస్తరణ వ్యవహారం ఇప్పటికీ తేలకుండా ఉంది. శివకుమార్‌ ఢిల్లీలో ఉన్న చాలా సందర్భాల్లో సిద్దరామయ్యను కూడా పిలిపించుకొని ఈ సిడబ్ల్యుసి సభ్యుడి గౌరవానికి ఏ లోటూ రాకుండా కాంగ్రెస్‌ అధిష్ఠానం జాగ్రత్తపడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సమీపంలో ఉన్నందున ఆ ఫలితాలు శివకుమార్‌ ప్రభుత్వం పనితీరుమీద తొలి తీర్పు అవుతుంది. ఎన్నికల రాజకీయాలనుంచి నిష్క్రమిస్తున్నానన్న సిద్దరామయ్య ప్రకటనతో శివకుమార్‌కు పార్టీమీదా, ప్రభుత్వం మీదా పట్టు పెరుగుతుందని కొందరు విశ్లేషిస్తున్నప్పటికీ, రెండేళ్ళ క్రితం ఎన్నికల్లో కాంగ్రెస్‌ను విజయపథాన నడిపించిన ఆ నాయకుడిని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలవరకూ గౌరవంగా చూసుకోవడం కాంగ్రెస్‌కు అవసరం. సిద్దరామయ్య ప్రకటన వెనుక ఎవరెవరి ఒత్తిళ్ళో పనిచేశాయన్న ప్రచారాన్ని అతివేగంగా వమ్ముచేయడం మరీ ముఖ్యం.

ఇవి కూడా చదవండి..

విదేశీయులే లక్ష్యంగా కోట్ల రూపాయల సైబర్ మోసం.. ప్రధాన నిందితుడి అరెస్ట్

నేనెక్కడికీ పారిపోలేదు: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌ కృష్ణారెడ్డి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 29 , 2026 | 02:17 AM