హసీనా సాహసం
ABN , Publish Date - Aug 06 , 2026 | 03:02 AM
ఆరునూరైనా ఈ ఏడాది డిసెంబర్‌లో బంగ్లాదేశ్ వెళ్ళడం ఖాయమని ఆ దేశ మాజీ ప్రధాని షేక్‌హసీనా విస్పష్టంగా ప్రకటించారు. గతంలో కూడా ఇదేమాట అన్నప్పటికీ, విలేకరుల సమావేశంలో చేసిన ప్రకటన కనుక దీనికి...
ఆరునూరైనా ఈ ఏడాది డిసెంబర్‌లో బంగ్లాదేశ్ వెళ్ళడం ఖాయమని ఆ దేశ మాజీ ప్రధాని షేక్‌హసీనా విస్పష్టంగా ప్రకటించారు. గతంలో కూడా ఇదేమాట అన్నప్పటికీ, విలేకరుల సమావేశంలో చేసిన ప్రకటన కనుక దీనికి కచ్చితంగా ఎంతో విలువ ఉంది. స్వదేశం వదిలివచ్చి రెండేళ్ళు పూర్తవుతున్న సందర్భంగా బుధవారం ఢిల్లీలో ఆమె మీడియా సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్నారు. భారత్ పారిపోయివచ్చిన తరువాత, ఇక్కడనుంచి మీడియాను నేరుగా ఉద్దేశించి మాట్లాడటం ఇదే తొలిసారి. దీనిని జరగనివ్వకండని అనడం బాగుండదు కనుక, ఈ సమావేశంమీద భారత్ తన వైఖరిని స్పష్టంచేయాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేసింది. ‘ఫారిన్ కరెస్పాండెట్స్ క్లబ్ (ఎఫ్‌సీసీ) ఆఫ్ సౌత్ ఏసియా’ నిర్వహిస్తున్న ఈ సమావేశంలో తన ప్రమేయమేమీ లేదని, అది ఒక ప్రైవేటు వ్యవహారమని భారతదేశం తేల్చేసింది. అందులో ఆమె వ్యక్తపరచబోయే అభిప్రాయాలతో తనకు నిమిత్తం లేదని భారత్ స్పష్టంచేయడంతో బంగ్లాదేశ్ ప్రధాని నుంచి మంత్రులూ దిగువస్థాయి నాయకులవరకూ అంతా సత్సంబంధాలు దెబ్బతింటాయంటూ హెచ్చరికలు చేస్తున్నారు, నర్మగర్భంగా ఏవేవో మాట్లాడుతున్నారు. హసీనా వ్యాఖ్యలు, ప్రసంగాలు, ఇంటర్వ్యూలు, ఆడియో వీడియో సందేశాలను ప్రచురించడం లేదా ప్రసారం చేయడాన్ని నిషేధిస్తూ, ఈ కట్టుతప్పినవారు కఠినశిక్షలకు అర్హులని బంగ్లాదేశ్ ప్రభుత్వం తన మీడియాను హెచ్చరించింది కూడా.
అధికారంకోసం కాక, పతనమైపోతున్న బంగ్లాదేశ్‌ను తిరిగి నిలబెట్టేందుకే తాను స్వదేశానికి వెళ్ళదల్చుకున్నానని హసీనా ఈ సమావేశంలో చెప్పుకొచ్చారు. 2024 జులై–ఆగస్టు మధ్యకాలంలో జరిగిన విద్యార్థి ఉద్యమాన్ని కొందరు ఇతరత్రా లక్ష్యాలతో తప్పుదోవపట్టించి, హింసాత్మకంగా మార్చారని ఆరోపించారామె. తనను అధికారం నుంచి దించేయడానికి జరిగిన ఈ నిరసన వెనుక ఎవరి చేతులున్నాయో, ఏయే శక్తులున్నాయో చెప్పుకొచ్చారామె. ప్రస్తుత పాలకుల చేతిలో బంగ్లాదేశ్ ‘నయా పాకిస్థాన్’గా అవతరిస్తోందని, పాకిస్థాన్ ఇంటలిజెన్స్ సంస్థ చక్రం తిప్పుతోందని అంటూ భారత్‌కు ప్రమాదకరంగా పరిస్థితులు తయారవుతున్నాయని ఆమె కుమారుడు సజీద్ వాజేద్ కూడా హెచ్చరిస్తున్నారు.
రెండేళ్ళక్రితం హసీనా ఢిల్లీకి తరలివచ్చిన తరువాత బంగ్లాదేశ్‌లో సంభవించిన వరుస పరిణామాలతో ఉభయదేశాల సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తాత్కాలిక పాలకుడుగా ఉన్న యూనిస్ రహ్మాన్ తనదేశాన్ని చైనా పాకిస్థాన్‌లకు చేరువచేసే పని ఆరంభించారు. బంగ్లాదేశ్ విముక్తిపోరాటాన్ని, పితామహుడు షేక్‌ముజబూర్ రహ్మాన్ చిహ్నాలను చెరిపివేసే ప్రయత్నాలు ఉధృతంగా సాగాయి. బీఎన్పీ అధికారంలోకి వచ్చిన తరువాత పాకిస్థాన్‌తో అంటకాగడం మరింత హెచ్చింది.
వయసురీత్యా హసీనా గొంతు వణకవచ్చు, గతాన్ని గుర్తుచేసుకున్న పలు సందర్భాల్లో గద్గదస్వరంగా మారవచ్చు. అధికారకాంక్షతోనే ఆమె ఈ ప్రయాణం కట్టారని బంగ్లా ప్రస్తుత పాలకులు అంటున్నప్పటికీ, చావుకు సిద్ధపడి మరీ ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారన్నది నిజం. పొరుగుదేశంలో ఉంటూ కూడా ప్రభావం చూపగలుగుతున్న ఆమె, మళ్ళీ తిరిగివస్తే ఎలా వ్యవహరించాలో, పరిస్థితులు ఏ విధంగా మారతాయో వారికి అర్థంకాకుండా ఉంది. ఆమె తిరిగివచ్చి, జైల్లో ఉన్నా కూడా క్షేత్రస్థాయిలో దాని ప్రభావం విస్తృతంగా ఉంటుందనీ, సమర్థవంతమైన నాయకత్వాన్ని, చివరకు అధికారిక గుర్తింపునూ కోల్పోయిన ఆమె పార్టీకి జవజీవాలు వస్తాయని కొందరివాదన. జైలు నిర్బంధాలు బంగ్లాదేశ్‌కు కొత్త కాదు. ప్రస్తుత ప్రధాని తారీఖ్ రహ్మాన్ తల్లి, మాజీ ప్రధాని ఖలేదాజియా అవినీతి ఆరోపణలతో అనేక సంవత్సరాల పాటు ఢాకా జైల్లో ఉన్నారు. ఇప్పుడు హసీనా కూడా తాను స్వదేశంలో కాలూనగానే, తనను జైల్లో తోయవచ్చు, ప్రాణాలు తీయవచ్చునని అంటూనే, దేనికైనా సిద్ధపడే ఉన్నానని స్పష్టంచేస్తున్నారు. ఆమెను అప్పగించవలసిందిగా భారతదేశాన్ని ఎన్నిసార్లు కోరినా ఫలితం లేకపోయిందని, డిసెంబరులో తాము కోరినదే జరగబోతోందని బంగ్లాదేశ్ నాయకులు అంటున్నారు. తిరిగివస్తానంటున్న హసీనాను కోర్టులో లొంగిపోకముందే అరెస్టు చేస్తామని బంగ్లాదేశ్ న్యాయమంత్రి ఇప్పటికే తేల్చేశారు. మరణశిక్షపడిన ఆమెకు మళ్ళీ కోర్టులను ఆశ్రయించే అవకాశం దక్కనిచ్చేది లేదన్నది ఆయన వ్యాఖ్యల సారాంశం. భారతదేశానికి పలు సవాళ్ళు విసిరే డిసెంబరు పరిణామాలు ఊహకు అందనివి.
ఇవీ చదవండి:
'నేను ఎంకే స్టాలిన్ తనయుడిని'.. ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
తమిళనాడు బడ్జెట్: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. జెన్ జీకి రూ.2 వేల కోట్లు