Saving the Aravalli:: ఆరావళి..ఆశ
ABN , Publish Date - Jan 01 , 2026 | 05:47 AM
ఆరావళిని రక్షించుకోవడమంటే, ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశరాజధాని వాసులకు కాస్తంత ఆక్సిజన్ అందించడం. ఢిల్లీ ఇరుగుపొరుగు రాష్ట్రాలను పర్యావరణ విధ్వంసంనుంచి...
ఆరావళిని రక్షించుకోవడమంటే, ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశరాజధాని వాసులకు కాస్తంత ఆక్సిజన్ అందించడం. ఢిల్లీ ఇరుగుపొరుగు రాష్ట్రాలను పర్యావరణ విధ్వంసంనుంచి రక్షించడం. 250కోట్ల సంవత్సరాల నాటి ఆరావళిని అవలీలగా మింగేయడానికి మైనింగ్ మాఫియా చుట్టూ కాచుకుకూర్చున్నదని తెలుసుగనుకనే, నిర్వచనం విషయంలో సుప్రీంకోర్టు అంతపట్టుదలగా ఉంది. మాటలో ఏమాత్రం తేడావచ్చినా, పర్వతాలు ఫలహారం చేయడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుందని దాని భయం. వందమీటర్లకంటే ఎక్కువ ఎత్తున్న కొండలనే పర్వతాలుగా పరిగణించాలంటూ కేంద్రం ఇచ్చిన నిర్వచనాన్ని గతంలో తెలిసోతెలియకో ఆమోదించిన సర్వోన్నత న్యాయస్థానం ఇంతవెంటనే తప్పు సరిదిద్దుకొని, అప్పటి ఉత్తర్వులను ఉపసంహరించుకున్నందుకు సంతోషించాలి.
ఇంత ఎత్తుదాటితేనే అనడంతోనే 95శాతం ఆరావళి అతివేగంగా అంతరించిపోతుందని పర్యావరణవేత్తల భయం. పర్యావరణ మంత్రిత్వశాఖ నిర్వచనాన్ని గతనెలలో మాజీ చీఫ్‌జస్టిస్ గవాయ్ ఆమోదించగానే వారంతా భయపడ్డారు. ఆరావళిలో అక్రమమైనింగ్‌కు వ్యతిరేకంగా పోరాడి, కష్టపడి సాధించిన రక్షణలన్నీ గాలికికొట్టుకుపోవడం బాధకలిగించింది. మరోపక్క దేశరాజధాని కాలుష్యంలో కొట్టుమిట్టాడుతూ ఊపిరాడని స్థితిలో ఉండటం కూడా ప్రజల్లో ఈ నిర్వచనం మీద అవగాహనకు దోహదం చేసింది. ఇటువంటి అంశాల్లో పెద్దగా చొరవచూపని సామాన్యులు సైతం ఆరావళి పరిరక్షణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం, ప్రధాన మీడియాలోనే కాక, సామాజిక మాధ్యమాల్లో సైతం ‘సేవ్ ఆరావళి’ అంటూ ప్రచారాలు, చర్చలు జరగడం బాగుంది. ప్రస్తుత సీజేఐ సూర్యకాంత్ ఆధ్వర్యంలోని త్రిసభ్యధర్మాసనం ఈ అంశాన్ని త్వరితంగా స్వీకరించి, నిపుణుల కమిటీ సూచనలను అహేతుకమైనవిగా భావించి, మరింత సమగ్రమైన అధ్యయనాన్ని కోరుతూ అమలు నిలిపివేయడం సముచితం.
2010లో రాజస్థాన్ ముందుకు తెచ్చిన వందమీటర్ల ఎత్తునిర్వచనం చాలా రాష్ట్రాలకు నచ్చింది. అధికారికంగానో, అనధికారికంగానో అమలు చేసి అస్మదీయులకు ఎన్నోమేళ్ళు చేసుకున్నాయి. మరో ఎనిమిదేళ్ళకు రాజస్థాన్‌లో ఎఫ్‌ఎస్‌ఐ చేపట్టిన సర్వేలో అనేక కొండలు ఈ నిర్వచనంలో భాగంగా మాయమైపోయినట్టు తేలింది. ఆరావళిని ఇంతవరకూ ఎవరూ తాకలేదని, తవ్విపోయలేదనీ, ఇప్పుడే దానికి ప్రమాదం ముంచుకొస్తున్నదన్న భ్రమ ఎవరికీ లేదు. కొండలను దోచేస్తున్న కార్పొరేట్ల ధనదాహానికి ఇటువంటి నర్మగర్భమైన, కుట్రపూరిత నిర్వచనాలు మరింత తోడవుతాయన్నది సత్యం. ఆరావళికి దూరంగా కూడా మైనింగ్ పూర్తిగా నిలిపివేస్తున్నట్టుగా, కొత్తగా అనుమతులు ఇవ్వనట్టుగా ప్రభుత్వాలు ఈ మధ్యలో చేసిన విన్యాసాలు సైతం ప్రజలు గమనించారు. వాయువ్యభారతానికి వందలాది కిలోమీటర్ల రక్షణకవచంగా ఉన్న ఆరావళిలో ఇప్పటికే పోయింది ఎంతో తెలుసు కనుక, ఉన్నదానినైనా నిలబెట్టుకోవాలని తాపత్రయపడ్డారు. పర్వతాలను, నదులను యథాస్థితిలో రక్షించుకోవడం కాక, వాటి ఎత్తులు, లోతులు కొలిచి, కొత్తనిర్వచనాలు సృష్టించి అంతిమంగా మాయం చేయడానికి జరుగుతున్న కుట్రను జనం గ్రహించారు.
అభివృద్ధి పేరిట పారిశ్రామికవేత్తలకు వ్యవసాయభూములనుంచి అడవులవరకూ అన్నీ అప్పనంగా అప్పగించేస్తున్న కాలమిది. అడవులు అంతరించిపోయి, పర్యావరణం నాశనమై, ప్రకృతి ప్రకోపానికీ, కాలుష్యానికీ సామాన్యుడు బలైపోతున్నాడు. కాలుష్యం కమ్మేస్తున్న తొలిపదినగరాల్లో మనదేశంలోనివి అరడజనున్నాయి. ఢిల్లీకాలుష్యాన్ని చక్కదిద్దలేక చేతులెత్తేసిన పాలకులు కాలుష్యం నిర్వచనాలను మార్చడానికీ, గ్రేడ్లు తారుమారుచేయడానికీ ప్రయత్నిస్తున్నారు. కాలుష్యంతో కొత్త రోగాలు రావని పార్లమెంటులోనే సమర్థించుకుంటున్నారు. క్విడ్‌ప్రోకో పద్ధతిలో మనుగడసాగిస్తున్న రాజకీయవ్యవస్థకు కఠిన పర్యావరణ పరిరక్షణచట్టాలతో ప్రజలను రక్షించే ఉద్దేశం ఏమాత్రం లేదు. అధికారపక్షానికి అధికారికంగానే భూరి విరాళాలు అందుతూ, ప్రతిగా ఆయా సంస్థలకు ఎన్నెన్నిమేళ్ళు జరుగుతున్నాయో చూస్తూన్నాం. ఎప్పటికప్పుడు పాలకులను ప్రశ్నిస్తూ, న్యాయస్థానాలను నమ్ముకుంటూ, భవిష్యత్ తరాలకోసం ఆరావళి తరహాలో ప్రతీ కొండనీ గుట్టనీ జనమే కాపాడుకోక తప్పదు. ఆరావళి ఒక్కటేనా, హిమాలయాలు, వింధ్య, పశ్చిమకనుమలతో సహా ప్రతీ పర్వతమూ, నదీ ఎన్నడూలేనంత ప్రమాదంలో మునిగి, మనుగడకోసం అల్లాడుతున్నాయి.
ఇవి కూడా చదవండి
ప్రజలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి న్యూ ఇయర్ విషెస్..
వధువుతో పాటు స్నేహితులు కూడా ఏడడుగులు.. ఫన్నీ వీడియో వైరల్..