ఎడతెగని యుద్ధం
ABN , Publish Date - Feb 25 , 2026 | 12:40 AM
నాలుగురోజుల్లో ఉక్రెయిన్‌ను జయించగలనని పుతిన్ అనుకున్నారు. నాలుగురోజుల్లో రష్యాను దారికి తేగలనని ట్రంప్ భ్రమపడ్డారు. నాలుగేళ్ళు పూర్తిచేసుకున్న యుద్ధం మరో నాలుగేళ్ళకయినా ముగుస్తుందా? అన్నది అనుమానం....
నాలుగురోజుల్లో ఉక్రెయిన్‌ను జయించగలనని పుతిన్ అనుకున్నారు. నాలుగురోజుల్లో రష్యాను దారికి తేగలనని ట్రంప్ భ్రమపడ్డారు. నాలుగేళ్ళు పూర్తిచేసుకున్న యుద్ధం మరో నాలుగేళ్ళకయినా ముగుస్తుందా? అన్నది అనుమానం. ఇప్పటికిప్పుడు యుద్ధం ఆగితే కూడా ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి ౫88 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందట. రష్యాకు జరిగిన నష్టం అంతకంటే అధికం, లెక్కకు అందనిది. అప్పటివరకూ తనకున్న విస్తృత సహజవాయువు మార్కెట్‌ను ఈ యుద్ధం కారణంగా అది కోల్పోయింది. ఒక్క యూరప్‌ను తీసుకున్నా ఏటా నలభైబిలియన్ డాలర్లు నష్టపోతోంది. విదేశాల్లో 335 బిలియన్ డాలర్ల నిధులు ఇరుక్కుపోవడం రష్యాకు మరో దెబ్బ. అమెరికా అధ్యక్షుడు ఏవో హామీలు ఇస్తున్నారు కానీ, యుద్ధం ఆగినా కూడా అందులో అధికభాగం రష్యాకు దక్కవు. పశ్చిమదేశాల ఆర్థిక, ఆయుధ అండదండలు దండిగా ఉన్న ఉక్రెయిన్ సరే, రష్యా మాత్రం ఇంకెంతకాలమని యుద్ధం చేయగలదు?
స్పెషల్ మిలటరీ ఆపరేషన్ అని ఓ చిన్న పేరు పెట్టి 2022లో యుద్ధరంగంలోకి దిగినప్పుడు రష్యాతో పాటు పశ్చిమదేశాలు కూడా ఉక్రెయిన్ దురాక్రమణ కొద్దిరోజుల్లోనే ముగిసిపోతుందని అనుకున్నాయి. కానీ, రెండో ప్రపంచయుద్ధం అనంతరం యూరప్‌లో సాగిన అతిపెద్ద యుద్ధంగా ఈ సైనిక చర్య పరిణమించింది. నాజీ జర్మనీకి వ్యతిరేకంగా సోవియట్ సైన్యం సాగించిన పోరాటం కంటే ఇదే సుదీర్ఘంగా సాగుతోంది. తాను అధికారంలో లేకపోవడంతోపాటు అసమర్థ బైడెన్ అమెరికా అధ్యక్షుడుగా ఉండటం వల్లనే పుతిన్ తలెగరేశారని, తాను తిరిగి అధికారంలోకి వచ్చిన మర్నాడే యుద్ధాన్ని ఆపేస్తానని డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల సభల్లో చెప్పుకున్నారు, పుతిన్‌ను లొంగదీయగల సమర్థత తనకు ఉన్నదని బలంగా నమ్మారు. అధ్యక్షుడైన తరువాత ఓవల్ ఆఫీసుకు ఉక్రెయిన్ అధినేతను పిలిచి, తన ఉపాధ్యక్షుడితో కలిసి అవమానించడానికి కూడా ట్రంప్ వెనుకాడలేదు. జెలెన్‌స్కీ కారణంగానే యుద్ధం వచ్చిందంటూ పుతిన్ పక్షాన, పుతిన్ భాషలో, పుతిన్ వాదనే ట్రంప్ చేశారు. రాజీకి రాకపోతే సహాయం నిలిపివేస్తానని హెచ్చరించి, నెలలపాటు అస్త్రాలు అందకుండా చేశారు. ఆ దెబ్బతో, ఉక్రెయిన్ తనవద్ద ఉన్న అరుదైన ఖనిజాలు తవ్వుకుపోవడానికీ, పునర్నిర్మాణంలో అధిక వాటా ఇవ్వడానికి అమెరికాతో బేరం కుదర్చుకుంది. ఆ తరువాత ట్రంప్ గాలి రష్యామీదకు మళ్ళింది. చమురు కంపెనీలపై నిషేధాలతో, ఎగుమతులపై ఆంక్షలతోనూ, దాని మిత్రదేశాల మీద అదనపు సుంకాలతోనూ ఒత్తిడిపెంచే ప్రయత్నాలు అనేకం జరిగాయి. నిజానికి, యూరప్ సైతం సుదీర్ఘకాలం రష్యా చమురు, సహజవాయువుల దిగుమతులను నిలిపివేయలేకపోయింది. పాశ్చాత్యదేశాలు హెచ్చరించినప్పుడల్లా భారత్ తన ఏడాది దిగుమతులను వాటి ఒకరోజు దిగుమతితో పోల్చిచూపేది. లూకాయిల్, రోస్నెఫ్ట్ వంటి రష్యన్ చమురు కంపెనీలమీద అమెరికా అధ్యక్షుడు ఆంక్షలు విధించడం, దిగుమతులకు భారత్ దూరం కావడం వంటి పరిణామాలు రష్యాను కొంత దెబ్బతీసినమాట నిజం. అయితే, ఆంక్షలు రష్యాను బలహీనపరిచాయే తప్ప, సాగిలబడేట్టు చేయలేకపోయాయి. ఏడాదిపాటు తీవ్రంగా శ్రమించిన తరువాత, ఉక్రెయిన్, రష్యాలను ట్రంప్ చర్చలకు కూచోబెట్టగలిగారు కానీ, భూభాగాలు, నష్టపరిహారాలు, భద్రత హామీలు ఇత్యాది విషయాల్లో తగవు తీరకపోవడంతో వ్యవహారం ముందుకు సాగడం లేదు.
యుద్ధంలోకి అడుగుపెట్టిన కొత్తల్లో రష్యా మంచి జోరుగా ఉక్రెయిన్ భూభాగాల్లోకి చొరబడగలిగిందని, ఆ తరువాత ఎక్కువ వదులుకొని, కొంత నిలబెట్టుకోగలిగిందని అంటారు. యుద్ధంలో అసత్యాలు అర్థసత్యాలే తప్ప నిజం వెలుగుచూడదు. విజయాలు, మరణాల లెక్కలనూ అనుమానించాల్సిందే. రెండుదేశాలు అపార ఆస్తి, ప్రాణనష్టాలు చవిచూశాయి. గత ఏడాది డిసెంబరు నాటికి మూడులక్షల పాతికవేలమంది రష్యన్ సైనికులు, లక్షా నలభైవేలమంది ఉక్రెయిన్ సైనికులు కన్నుమూశారని ఒక అమెరికన్ సంస్థ అంచనా. తన అధీనంలో ఉన్న ఉక్రెయిన్ భూభాగాలను వదులుకోకపోవడంతో పాటు, వ్యూహాత్మకంగా అవసరమైన ప్రాంతాల నిస్సైనికీకరణను కూడా రష్యా కోరుతున్నదువల్లనే చర్చలు ముందుకు సాగడం లేదని అంటారు. ఉక్రెయిన్‌కు ఇకపై మారణాయుధాలు అందవన్న హామీతో పాటు, ఈ యుద్ధానికి మూలకారణమైన నాటో విస్తరణ విషయంలోనూ నిర్దిష్టమైన హామీ పాశ్చాత్యదేశాల నుంచి దక్కేవరకూ రష్యా వెనక్కుతగ్గదు. 2030లో కూడా మీడియా ఇదే యుద్ధాన్ని, అవే సమస్యలను, ఇవే అంశాలను చర్చించుకోవాల్సి ఉందని ఒక విశ్లేషకుడు చేసిన వ్యాఖ్య అతిశయోక్తి కాకపోవచ్చు.
ఇవి కూడా చదవండి..
మాజీ మంత్రి మల్లారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..
కొత్త పార్టీని ప్రకటించిన శశికళ