పీకే... ఓకే!
ABN , Publish Date - Aug 04 , 2026 | 02:17 AM
బిహార్‌లోని బాంకీపూర్ శాసనసభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో జన్ సురాజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ విజయం రాష్ట్ర, దేశ రాజకీయాల్లో విస్తృత చర్చకు దారితీసింది...
బిహార్‌లోని బాంకీపూర్ శాసనసభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో జన్ సురాజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ విజయం రాష్ట్ర, దేశ రాజకీయాల్లో విస్తృత చర్చకు దారితీసింది. ఎన్నికల కమిషన్ పత్రాల మీద ఆయన నీరజ్‌కుమార్ సిన్హా అనే బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించినట్టు ఉంటుంది కానీ, నిజానికి ఆయన ఓడించింది బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్‌నే అని విపక్షాలు, విశ్లేషకులు కుండబద్దలు కొడుతున్నారు. పదిహేనేళ్ళక్రితం వరకూ పాట్నావెస్ట్‌గా ఉన్న ఈ అర్బన్ అసెంబ్లీ స్థానాన్ని వరుసగా ఐదుసార్లు ఘనంగా నెగ్గుకొచ్చిన నితిన్ నబీన్ రాజ్యసభకు తరలడంతో ఈ ఉపఎన్నిక అవసరపడింది. దీనికితోడు, బీజేపీ అధ్యక్షుడి కంటే ముందు ఆయన తండ్రి కిశోర్ ప్రసాద్‌సిన్హా సైతం ఏకబిగిన పలుమార్లు గెలుచుకున్నస్థానం కావడంతో ఈ శాసనసభ ఉపఎన్నిక ఫలితం యావత్ దేశాన్ని ఆకర్షించింది.
బిహార్‌లో సామ్రాట్ చౌదరి నేతృత్వంలోని తొలి బీజేపీ ప్రభుత్వానికి ఎదురైన తొలి ఎన్నికల పరీక్ష ఇది. కాయస్థ, భూమిహార్, రాజ్‌పుట్ ఇత్యాది అగ్రకులాల సంఖ్యాబలం గణనీయంగా ఉన్న ఈ స్థానం చేజారిపోవడం కచ్చితంగా ఆ పార్టీ పెద్దలకు ఆందోళన కలిగించే అంశం. గత ఏడాది ఎన్నికల్లో ఆర్జేడీ అభ్యర్థిపై నితిన్ నబీన్ యాభైవేల మెజారిటీతో గెలిచారన్నది దృష్టిలో ఉంచుకుంటే ఇప్పటి పరాజయం తీవ్రత అర్థమవుతుంది. నీట్ పరీక్షలో అవకతవకలు, పిల్లల ఆత్మహత్యలు, ఉధృతంగా సాగిన జెన్‌జీ ఉద్యమం, ఉద్యోగ ఉపాధి అవకాశాల లేమి వంటివి ఈ ఫలితాలను ప్రభావితం చేశాయని మీడియా విశ్లేషిస్తోంది. బీజేపీకి గుణపాఠం నేర్పాలన్న లక్ష్యంతో యువతతో పాటు, వారి మనోభావాలకు అనుగుణంగా మధ్యవయసువారు, వృద్ధులు కూడా ఓట్లేశారని, అన్ని కులాలవారు, రంగాలవారు ఏకరీతిన నడిచారని అంటోంది. దేశంలో ప్రతిపక్షపార్టీలు బలహీనంగా ఉండవచ్చు, కానీ, ప్రతిపక్ష స్థానం మాత్రం బలంగానే ఉంది అంటూ పీకే చేసిన వ్యాఖ్యను పలువురు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. లాలూ యాదవ్ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) తక్కువ ఓట్లతో దూరంగా నిలిచిపోవడం మరో ఆశ్చర్యకరమైన పరిణామం. ఎన్నికల ప్రచారం వేళ తేజస్వి యాదవ్ విదేశాలకు వెళ్ళిపోవడం రాజకీయ ఎత్తుగడో, అస్త్రసన్యాసమో తెలియదు.
అభిషేక్ బంటీ అనే అభ్యర్థిని నామినేట్ చేసి, ఇరవైనాలుగుగంటల్లోనే అతడిని కాదని, ఈ సిన్హాని బరిలోకి దింపింది బీజేపీ. బాంకీపూర్‌ను నిలబెట్టుకోవడం కోసం బీజేపీ అన్ని అడ్డదారులూ తొక్కిందని, పోలీసు ఉన్నతాధికారులు దానికి ఏజెంట్లుగా పనిచేశారని, తన పార్టీ కార్యకర్తలను జైళ్ళలో కుక్కారని పీకే విమర్శ. ఐదేళ్ళక్రితం ఎన్నికల వ్యూహకర్త పాత్రకు స్వస్తిచెప్పి, రెండేళ్ళపాటు బిహార్ అంతా కాలినడకన కలయదిరిగి, ఒక ఆదర్శవంతమైన మేనిఫెస్టోతో ఆయన రాజకీయ రంగప్రవేశం చేశాడు. తాను ఎన్నికల్లో నిలబడకుండా, ఓ ఐదు అసెంబ్లీ స్థానాలు మినహా అన్నింటిలోనూ తన పార్టీ అభ్యర్థులను నిలబెట్టాడు. ఓ మూడున్నరశాతం ఓటువాటా దక్కింది కానీ, ఒక్కరంటే ఒక్కరు కూడా గెలవలేదు. ఆ ఘోర పరాజయం నుంచి ఏడాది తిరిగేసరికి ఇప్పుడు దక్కిన విజయం ఆయనకు పెద్ద ఉపశమనం. తాను ఇప్పుడు ఓడినా పోయేదేమీ లేదని, ఒకవేళ నెగ్గితే, ఏకంగా బీజేపీ అధ్యక్షుడి కుటుంబాన్ని ఢీకొని, కంచుకోటను స్వాధీనం చేసుకున్న ఘనత దక్కుతుందని పీకే అనుకొనివుంటారు. ఒక ఎమ్మెల్యే సీటు కంటే, దేశంలో కొద్దినెలలుగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రభావం ఓటర్లమీద ఏ స్థాయిలో ఉన్నదో, బిహార్ ఓటర్లు ప్రత్యామ్నాయం గురించి చూస్తున్నదీ లేనిదీ తేల్చుకోవాలనుకొని ఉంటారు. అగ్రకులాలతో పాటు, యాదవులు, ముస్లింలు, దళితులు, ఎంబీసీ, ఈబీసీ ఓటర్లు సైతం ప్రశాంత్‌కిశోర్‌కు ఓటుచేయడం వల్లనే 20వేల మెజారిటీ సాధ్యపడిందని విశ్లేషకుల అభిప్రాయం. సర్వసాధారణంగా ఉపఎన్నికల్లో అధికారపార్టీయే విజయాలు సాధిస్తుంది. కానీ, బిహార్ పరిస్థితి వేరు. శాసనసభ ఎన్నికల పోరుకు సారథ్యం వహించి, కూటమిని గెలిపించి, అనేక నాటకీయపరిణామాల మధ్య అనతికాలంలోనే నితీశ్‌కుమార్ తప్పుకున్నారు. అనూహ్యంగా తెరమీదకు వచ్చిన తొలి బీజేపీ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి మీద రాష్ట్ర ప్రజల తొలి తీర్పు ఇది అని పీకే పార్టీ అంటోంది. బిహార్‌తో పాటు, తనఏలుబడిలో ఉన్న మధ్యప్రదేశ్‌లోనూ మరో స్థానాన్ని కోల్పోయిన బీజేపీకి, మోదీ స్వరాష్ట్రం గుజరాత్ ఒక్కటే ఉపశమనాన్ని ఇచ్చింది.
ఇవి కూడా చదవండి..
విద్యార్థులపై కేసులు ఉండవు.. హామీపై కట్టుబడి ఉన్నాం: సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ
బరువు తగ్గడం కోసం ప్రమాదకర ప్రయత్నం.. టీలో ఆ ద్రవాన్ని కలిపి తాగితే..