Share News

‘గుర్తింపు’ బాధలు!

ABN , Publish Date - Jun 27 , 2026 | 01:12 AM

భారత ప్రభుత్వం జారీచేసిన పాస్‌పోర్టు ఉన్నంతమాత్రాన భారతీయ పౌరులు కాబోరని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన పెద్ద దుమారం రేపింది. మాధ్యమాల్లో తీవ్రచర్చోపచర్చలకు తోడుగా సోషల్‌ మీడియాలో జోకుల వర్షం...

‘గుర్తింపు’ బాధలు!

భారత ప్రభుత్వం జారీచేసిన పాస్‌పోర్టు ఉన్నంతమాత్రాన భారతీయ పౌరులు కాబోరని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన పెద్ద దుమారం రేపింది. మాధ్యమాల్లో తీవ్రచర్చోపచర్చలకు తోడుగా సోషల్‌ మీడియాలో జోకుల వర్షం కురుస్తోంది. ఇంతోటిదానికీ, పాస్‌పోర్టు జారీకి సంక్లిష్టమైన ప్రక్రియలూ పోలీసు వెరిఫికేషన్లతో ప్రజలను వేధించడం ఎందుకని కొందరు ఎగతాళి చేస్తున్నారు. పైగా, పాస్‌పోర్టు సేవాదివస్‌ సందర్భంగా కేంద్ర విదేశాంగశాఖ ఈ వ్యాఖ్యలు చేస్తూ, అది కేవలం విదేశీప్రయాణాలకు వీలుకల్పించే అనుమతిపత్రమే తప్ప, అది ఉన్నంతమాత్రాన ఈ దేశ పౌరసత్వం వచ్చేసినట్టు కాదని వ్యాఖ్యానించి మరీ వివాదం రేపింది. భారతీయ పౌరసత్వానికి ఇప్పుడు ఏకైక రుజువు హిందువు కావడమా అని ఒకరు ప్రశ్నిస్తే, బీజేపీ ఓటరైతే పౌరుడేనని మరొకరన్నారు. ఇంతకాలమూ నా దగ్గర ఆధార్‌ ఉన్నా, ఓటరు కార్డున్నా నేను పౌరుడిని కాదు పొమ్మన్నారు, ఇప్పుడు పాస్‌పోర్టును కూడా ఆ జాబితాలో చేర్చారు, పుట్టుకనుంచి చావు వరకూ ప్రభుత్వం మంజూరు చేస్తున్న అన్నేసి పత్రాల్లో ఏ ఒక్కటైనా నన్ను ఈ దేశపౌరుడుగా గుర్తిస్తుందా? అని ఒక జర్నలిస్టు సోషల్‌ మీడియాలో వాపోయారు.

ఈ దేశపౌరులు గుర్తింపు సంక్షోభంలో ఉన్నారన్న వ్యాఖ్య ఈ పరిస్థితికి చక్కగా అతుకుతుంది. ఓటరు కార్డు మంజూరు చేసిన ఎన్నికల సంఘం అది గుర్తింపు కార్డు మాత్రమేనని తీసిపారేసింది. ప్రభుత్వం అన్నింటికీ ఆధార్‌నే ఆధారం చేసినప్పటికీ, అది కూడా పౌరసత్వానికి రుజువు కాదన్నది. జననం, శాశ్వత నివాసం అనే రెండు మూలాధార పత్రాలతో సహా సవాలక్ష రుజువులు చూపితే కానీ మంజూరు కాని పాస్‌పోర్టు సైతం ఇప్పుడు ఆ జాబితాలో చేరడం పౌరసమాజానికి ఆగ్రహం కలిగిస్తోంది. పాస్‌పోర్టు కేవలం విదేశీ ప్రయాణపత్రం అయితే, అక్కడి పౌరసత్వం తీసుకున్నవారు ఇక్కడ దానిని తిరిగి వెనక్కు ఇచ్చేయాలన్న నిబంధన ఎందుకు ఉన్నట్టు? ఒకరి పాస్‌పోర్టు రద్దయినా, నిషేధించినా, దానిని ఉపసంహరించుకున్నా అది ప్రభుత్వానిది అయిపోయినట్లేనని నిబంధనల్లో అంత ప్రత్యేకించి ఎందుకు రాసినట్టు? ఇత్యాది ప్రశ్నలు అనేకం వింటున్నాం.


స్వాతంత్ర్యం వచ్చి దాదాపు ఎనిమిది దశాబ్దాలవుతున్నా, ఎవరు భారత పౌరుడు అన్న ఆ మౌలిక ప్రశ్న ఇంకా మిగిలేవుందని దీని అర్థం. పౌరసత్వాన్ని నిర్ధారించే సార్వత్రక, సర్వామోదిత పత్రం ఒక్కటీ ఇప్పటికీ లేకపోవడం ప్రభుత్వ వైఫల్యమే. ఒకపక్క ఉగ్రవాదం, తీవ్రవాదం, పొరుగు దేశాల నుంచి అక్రమవలసలు, చొరబాట్ల గురించి తీవ్రమైన వాగ్యుద్ధాలు చేస్తూ, ఎన్నికల్లో అత్యధికంగా లబ్ధిపొందుతూ, మరోపక్క పౌరులు కాదన్న పేరిట లక్షలాదిమందిని ఓటరు జాబితానుంచి తొలగిస్తూ ఎవరు పౌరులన్న ఈ ప్రశ్నను మాత్రం సమాధానం లేకుండా వదిలేయడం విచిత్రం. అఫ్ఘానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ల నుంచి 2014 డిసెంబరు 31కి ముందు ఈ దేశంలోకి వచ్చిపడినవారికి కూడా పౌరసత్వాన్ని కట్టబెడుతూ, ఇక్కడ పాస్‌పోర్టులు ఉన్నంతమాత్రాన పౌరులు కానక్కరలేదని అనడం ఆశ్చర్యమే. పౌరసత్వానికి అంతిమంగా ఇదీ రుజువంటూ ఏదీ లేకుండా చేసి, దానిని నిరూపించుకోవాల్సిన బరువు మాత్రం జనం మీదకు నెట్టేయడం విషాదం. రేషన్‌కార్డు, ఓటరుకార్డు, పాన్‌కార్డు, డైవింగ్‌ లైసెన్స్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వాలు మంజూరు చేసేవి సంఖ్యానేకం. ఇవన్నీ ఒకదాని ఆధారంగా మరొకటి మంజూరు అవుతూ పరస్పరం ముడిపడివున్నవే. అయినప్పటికీ, ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఆ జాబితాలో ఏ ఒక్కటీ మనలను పౌరుడిగా గుర్తించదు, మరేది నిశ్చయంగా నిర్థారిస్తుందో తెలియదు. ఆధార్‌ ప్రాజెక్టు ఆరంభిస్తున్నప్పుడూ, దానిని బలవంతంగా ప్రభుత్వ సేవలతో అనుసంధానిస్తున్నప్పుడూ పాలకులు చాలా మాటలు చెప్పారు. ఇటీవలివరకూ పాస్‌పోర్టుకు కూడా మూలధారం ఆధార్‌ నెంబరే కానీ, ఇప్పుడు అదీ పనికిరాకుండా పోయింది. సహజంగా అధికారులు ఆయా సందర్భాలను బట్టి ఏవో పత్రాల మీద ఆధారపడతారు. కానీ, రాజకీయ అవసరాలు, రేపటి ఎత్తులూ జిత్తులు ముందుకువచ్చి ప్రధానమైపోయినప్పుడు ప్రజలకు ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. తమ గుర్తింపును నిరూపించుకోవడం వారికి అతిపెద్ద సవాలుగా పరిణమిస్తుంది. పౌరసత్వ రాజకీయాలు కొనసాగుతున్నంతకాలం ఈ అగ్నిపరీక్షలు తప్పవేమో.

ఈ వార్తలనూ చదవండి:

అపరేషన్ అమిస్తాడ్.. వెనెజువెలాకు భారత్ ఆపన్న హస్తం

ఉక్రెయిన్ భీకర డ్రోన్ దాడి.. రష్యాలోని 12 ప్రాంతాలపై..

Updated Date - Jun 27 , 2026 | 01:12 AM