Share News

పాక్‌కు బలూచ్‌ భయం

ABN , Publish Date - Feb 06 , 2026 | 01:31 AM

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ ప్రావిన్సులో ఏకకాలంలో దాదాపు పన్నెండు జిల్లాల్లో బలూచ్‌ ఆర్మీ జరిపిన భీకరదాడుల్లో వందలాది ప్రాణాలు పోయాయి. 36మంది పౌరులు, 22మంది పాక్‌ భద్రతాసిబ్బంది...

పాక్‌కు బలూచ్‌ భయం

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ ప్రావిన్సులో ఏకకాలంలో దాదాపు పన్నెండు జిల్లాల్లో బలూచ్‌ ఆర్మీ జరిపిన భీకరదాడుల్లో వందలాది ప్రాణాలు పోయాయి. 36మంది పౌరులు, 22మంది పాక్‌ భద్రతాసిబ్బంది ఈ దాడుల్లో మరణించారని, 19౨మంది బలూచ్‌ ఉగ్రవాదులను తాము మట్టుబెట్టామని పాక్‌ ప్రభుత్వం అధికారికంగా చెబుతున్నప్పటికీ, దాడుల తీవ్రత దృష్ట్యా సైనికుల మరణాలు అనేక రెట్లు ఉండవచ్చునని అంచనా. ఇప్పటికీ అక్కడక్కడ పరస్పరదాడులు జరుగుతున్నట్టుగా, ఇతర ప్రావిన్సులనుంచి వచ్చిన పాకిస్థానీలమీద స్థానికులు విరుచుకుపడుతున్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ)ను ఉగ్రవాద సంస్థగా గుర్తించిన నేపథ్యంలో, మంగళవారం ఐక్యరాజ్యసమితి కొన్ని పడిగట్టుపదాలతో ఈ ఘటనను ఖండించడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ, బలూచ్‌ తిరుగుబాటు దారులను ఎదుర్కోవడం తమవల్ల కావడం లేదని పాకిస్థాన్‌ రక్షణమంత్రి ఖ్వాజా ఆసిఫ్‌ జాతీయ అసెంబ్లీలో వ్యాఖ్యానించడం ద్వారా తమ పరువు తామే తీసుకున్నట్టు అయింది.

విదేశీశక్తుల సాయంతోనే బలూచ్‌ ఆర్మీ రెచ్చిపోతోందని చెప్పుకోవడం పాక్‌ పాలకులకు క్షేమకరం. ఎవరో ఆర్థికసాయం చేస్తున్నారని, అత్యాధునిక ఆయుధాలు అందిస్తున్నారని అనడం ద్వారా తమ వైఫల్యాన్ని, నష్టాన్ని చక్కగా సమర్థించుకోవచ్చు. పాకిస్థాన్‌లోని అతిపెద్ద ప్రాంతంలో స్వల్పసంఖ్యలో ఉన్న ఈ టెర్రరిస్టుల దగ్గర ఒక్కొక్కటీ రెండుకోట్లు విలువచేసే అధునాతన రైఫిళ్ళు, మెషీన్‌గన్లు, నైట్‌విజన్‌ పరికరాలు, థర్మల్‌ వెపన్స్‌ వంటివి ఉన్నాయని, పాకిస్థాన్‌ సైన్యం దగ్గర ఆ స్థాయివి లేనేలేవని, అందువల్ల ఢీకొట్టడం కష్టమవుతోందని ఆయన వ్యాఖ్యల సారాంశం. బీఎల్‌ఏ నాయకత్వం అఫ్ఘానిస్థాన్‌లో ఉన్నదని, ఆయుధాలు అమెరికావని ఆయన మాట్లాడారు. రెబెల్స్‌ విరుచుకుపడుతూంటే పాక్‌ ఆర్మీ పరుగులు తీస్తోందని సామాజిక మాధ్యమాల్లో సాగుతున్న ప్రచారం ఆయనను ఇబ్బంది పెట్టడం సహజం. తిరుగుబాటుదారుల దెబ్బకు పాక్‌సైనికులు మిలటరీ క్యాంపులు వదిలేసి పారిపోతున్నారంటూ ఖాళీగా ఉన్న ఆ స్థావరాలు, సైనికదుస్తులు, వివిధ పరికరాలు సోషల్‌ మీడియాలో ప్రచారమవుతున్నాయి. సరైన సమన్వయంతో, ఏకకాలంలో, అనేక ప్రాంతాల్లో భయానక దాడులు జరిపి వందమందికి పైగా శత్రువులను మట్టుబెట్టామని బలూచ్‌ ఆర్మీ చెప్పుకుంటూంటే, పాక్‌ ఆర్మీ ‘ఫిజికల్లీ హ్యాండీకాప్డ్‌’ అయిపోయిందని స్వయంగా రక్షణమంత్రి చట్టసభలో అనడం విచిత్రం. బలూచ్‌ తిరుగుబాటుదారులకు భారత్‌ సహకరిస్తున్నదంటూ పాక్‌ పాలకులు విమర్శించడం, మనం ఖండించడం ఇప్పుడూ జరిగింది.


ఇటీవలి కాలంలో బీఎల్‌ఏ ప్రతిఘటన స్థాయిలోనూ, తీవ్రతలో మార్పు వచ్చింది. పాక్‌ భద్రతాబలగాలను లక్ష్యంగా చేసుకొని రెబెల్స్‌ వివిధరకాల దాడులు చేస్తున్నారు. ఆత్మాహుతిదాడులు గతంలోనూ ఉన్నవే కానీ, మహిళలను అధికంగా వినియోగించడం పెరిగిందని అంటున్నారు. గతవారం జరిగిన దాడుల్లో ఇద్దరు మహిళలు ప్రధానపాత్ర పోషించారంటూ బలూచ్‌ ఆర్మీ వారి ఫోటోలను, వివరాలను, వీడియోలను సైతం విడుదల చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. వనరులదోపిడీ, అణచివేతను ఎదుర్కోవడానికి తమవారు నవ్వుతూ ప్రాణాలు వదిలేస్తున్నారంటూ ఆ సంస్థ చెప్పుకుంటోంది.

మొత్తం పాకిస్థాన్‌లో నలభైశాతం భూభాగం ఉన్న ఈ ప్రావిన్సుని ఎందుకు అదుపుచేయలేపోతున్నామో పాకిస్థాన్‌ పాలకులు ఆలోచించాలి. అత్యంత విలువైన ఖనిజ సంపదతోపాటు, చమురు, సహజవాయువు, బంగారం ఇత్యాది భారీ నిల్వలున్న ఈ ప్రాంతాన్ని దోచుకోవడమే లక్ష్యంగా పాక్‌ పాలకులు ఆదినుంచీ వ్యవహరిస్తున్నారు. గనుల నిర్వహణతో పాటు, గ్వాదర్‌ నౌకాశ్రయాన్ని కూడా చైనా చేతుల్లో పెట్టి, అక్కడివరకూ చైనా–పాకిస్థాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌ను నిర్మించుకొనేందుకు అనుమతించి బలూచ్‌లను మరింత రెచ్చగొట్టారు. బలూచిస్థాన్‌ను బలవంతంగా విలీనం చేసుకున్న పాకిస్థాన్‌ దానిని ఎన్నడూ తనది అనుకోలేదు. పాక్షిక స్వయంపాలనకు సైతం అనుమతించకుండా, ప్రజలు ఎన్నుకున్నవారిని కూలదోసి, తమ అనుకూలురని ప్రతిష్ఠించి, సైన్యంతో దానిని ఏలేందుకు ప్రయత్నించడమే ఈ పరిస్థితికి కారణం. పదేళ్ళకాలంలో పదివేలమంది బలూచ్‌లను మాయం చేసిన ఘనత పాక్‌ పాలకులది. గత ఏడాది మార్చిలో ఏకంగా ఒక రైలునే హైజాక్‌ చేసిన బలూచ్‌ ఆర్మీ, ఇటీవలి దాడితో తన శక్తిసామర్థ్యాలు మరింత హెచ్చినట్టుగా ప్రపంచానికి చాటగలిగింది.

ఈ వార్తలు కూడా చదవండి..

తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏక సభ్య కమిషన్ ఏర్పాటు: సీఎం

హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం.. ఉమెన్స్ హాస్టల్లో చెలరేగిన మంటలు

Updated Date - Feb 06 , 2026 | 01:31 AM