Share News

సభాపతి సమరం

ABN , Publish Date - Feb 11 , 2026 | 01:22 AM

లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాను పదవినుంచి దించేయాలన్న తమ కోరిక నెరవేరదని విపక్షాలకు తెలుసు. ఎన్డీయే సంఖ్యాబలం రీత్యా అది జరిగేపనికాదని అధికారపక్షానికీ, స్పీకర్‌కూ...

సభాపతి సమరం

లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాను పదవినుంచి దించేయాలన్న తమ కోరిక నెరవేరదని విపక్షాలకు తెలుసు. ఎన్డీయే సంఖ్యాబలం రీత్యా అది జరిగేపనికాదని అధికారపక్షానికీ, స్పీకర్‌కూ కూడా తెలుసు. అయినా, ఓ సందేశాత్మక పోరాటం సాగుతోంది. 120మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేసిన నోటీసును లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు కాంగ్రెస్‌పార్టీ అందించగానే, స్పీకర్‌ ఓంబిర్లా ఎంతో ఉదాత్తంగా అదేదో త్వరగా ముందుకు కదిలేట్టు చూడండని ఆదేశించారట. ఈ ఘట్టం ముగిసేవరకూ సభకు దూరంగా ఉండాలని కూడా ఆయన నిర్ణయించుకున్నారు. తృణమూల్‌ వినా పలు విపక్షపార్టీలు ఇచ్చిన ఈ నోటీసులో స్పీకర్‌మీద చాలా ఆరోపణలు, పలు ఆక్షేపణలు ఉన్నాయి. ప్రతిపక్ష ఎంపీలు పలు ప్రజాప్రయోజన అంశాలను లేవనెత్తకుండా స్పీకర్‌ అడ్డుకున్నారని, మాట్లాడనివ్వకుండా వారి ప్రాథమిక హక్కును కాలరాశారని, ఎనిమిదిమందిని ఏకపక్షంగా సస్పెండ్‌ చేశారని చాలా అంశాలు ఏకరువు పెట్టారు అందులో. నిజానికి ఇందులో చెప్పనివి కూడా అనేకం వారి మనసులో ఉండివుంటాయి. నాలుగుదశాబ్దాల తరువాత జరుగుతున్న ఇటువంటి ప్రయత్నం అధికారపక్షానికి పరోక్షంగా ప్రయోజనం చేకూరుస్తుందో, విపక్షానికి రాజకీయంగా నష్టం చేస్తుందో తెలియదు కానీ, చట్టసభల గౌరవాన్ని మరింత దిగజార్చుతుంది.

స్పీకర్‌ వ్యవస్థను కించపరిచేలా విపక్షం వ్యవహరిస్తోందని అధికారపక్షం ఆరోపిస్తోంది. సభలో ప్రధాని భద్రతమీద స్పీకర్‌ ఆందోళన చెందడానికి తగిన కారణాలు ఉన్నాయని, వ్యవస్థ పవిత్రతను కాపాడేందుకే ఆయన పలు నిర్ణయాలు తీసుకున్నారని లోక్‌సభ సచివాలయం ఓ ప్రకటన చేసింది. ప్రజాస్వామ్యం అన్నాక అధికార, విపక్షాల మధ్య పోరు సహజం. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిపక్షాలకు కనీస గౌరవంలేకుండాపోవడం, వాటిని అవమానించడం పెరిగినందున అవి కూడా అతిగా వ్యవహరిస్తున్నమాట నిజం. ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తింటున్నకొద్దీ ఇతరత్రా విధానాల్లో తమ ఉనికిని కాపాడుకొనే ప్రయత్నాలు కూడా ఎక్కువవుతాయి. సభ వెలుపల సంగతి అంటుంచితే, లోపల ఇరుపక్షాలను సమంగా చూడటం, వాటితో సమానంగా వ్యవహరించడం, సమన్యాయం చేయడం సభాపతి బాధ్యత. కనీసం అటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపించినా, ప్రజలకు అలా అనిపించినా బాగుండేది. కానీ, స్వయంగా స్పీకరే తన వ్యాఖ్యలతో, చర్యలూ చేష్టలతో పరిస్థితులు ఉద్రిక్తం చేయడం సరికాదు. స్పీకర్‌ ఎంతో జాగ్రత్తగా అని వుండవచ్చును కానీ, ప్రధానిమీద సభలో భౌతిక దాడి చేయడానికి కొందరు కాంగ్రెస్‌ ఎంపీలు కుట్రచేస్తున్నారన్నది ఆ వ్యాఖ్యల సారాంశం. ఆయనను తానే సభకు రావద్దని చెప్పానని సభాముఖంగా ప్రకటించి, విపక్షాలను స్వయంగా అవమానించారు. దేశ ప్రజల దృష్టిలో విపక్ష సభ్యులను విలన్లుగా చిత్రీకరించారు. అంతర్జాతీయంగానూ అప్రదిష్టపాల్జేశారు. మీ వద్ద తగిన ఆధారాలు వుంటే దాడికి కుట్రపన్నుతున్నవారిమీద ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయండని రాహూల్‌ గాంధీ బహిరంగం సవాలు చేసింది అందుకే.


సభలో ఇంతకుమించిన వేడినీ, రచ్చనూ దేశం అనేకసార్లు చూసింది. అనేక వివాదాస్పదమైన అంశాల్లో ఉభయపక్షాలూ ఘర్షణపడ్డాయి. కానీ, ప్రధానమంత్రిని సభకు రావద్దని స్పీకర్‌ స్వయంగా చెప్పడం చరిత్రలో ఎన్నడూ లేదు. ఒకవేళ ఆయన ఊహించినట్టుగానే సభ్యులు ఎవరైనా అతిగా ప్రవర్తించివుంటే దేశప్రజలు విపక్షాలను ఎన్నటికీ క్షమించేవి కాదు. కానీ, ప్రధాని సభకు రాకపోవడంతో ఆయన భయపడి పారిపోయారని అప్రదిష్ట వచ్చింది. ప్రధాని ప్రసంగం లేకుండానే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఆమోదం పొందిన ఘట్టం కూడా చరిత్రలో నిలిచిపోతుంది. విపక్షనాయకుడిని మాట్లాడనీయకపోవడం, ప్రధానిని సభకు రావద్దని చెప్పడం రెండూ పార్లమెంటరీ విలువల ఉల్లంఘనే. నరవణే పుస్తకంలో ఏదో ఉన్నదనీ, దానిని రాహుల్‌ సభలో విప్పుతారన్న భయంతోనే అధికారపక్షం ఇన్ని ఎత్తుగడలు వేసిందన్న అనుమానం అనవసరంగా ప్రజలకు కలిగింది. స్పీకర్‌ అంటే ఎంతో గౌరవమని అంటూనే అధికార విపక్షాలు ఆడుతున్న రాజకీయ నాటకంలో ఆ పదవీ మర్యాదలకు భంగం వాటిల్లుతున్నది. లోక్‌సభస్పీకర్‌ను తొలగించే ప్రయత్నాలేవీ భారత పార్లమెంటరీ చరిత్రలో విజయవంతం కాలేదని తెలిసినా ఈ నాటకం సాగుతూనే ఉంది.

ఇవి కూడా చదవండి..

సవరణతో తిరిగి అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన విపక్షాలు

బాబ్రీ పునర్నిర్మాణం అసాధ్యం: యోగి ఆదిత్యనాథ్

Updated Date - Feb 11 , 2026 | 01:22 AM