డీఎంకేలో ‘అమ్మ’ విధేయుడు
ABN , Publish Date - Mar 03 , 2026 | 02:01 AM
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితుడైన పన్నీరుసెల్వం కరుణానిధి పార్టీలో చేరి, ముఖ్యమంత్రి స్టాలిన్ చేతులమీదుగా పుష్పగుచ్ఛం అందుకుంటున్న ఆ దృశ్యం...
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితుడైన పన్నీరుసెల్వం కరుణానిధి పార్టీలో చేరి, ముఖ్యమంత్రి స్టాలిన్ చేతులమీదుగా పుష్పగుచ్ఛం అందుకుంటున్న ఆ దృశ్యం అనేకులను ఆశ్చర్యపరిచింది. పన్నీరుసెల్వం ఏఐఏడీఎంకే సీనియర్ నాయకుడు మాత్రమే కాదు, జయలలిత స్థానంలో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న వ్యక్తి. ఒకసారి కాదు, 2001లోనూ, 2014లోనూ రెండు పర్యాయాలు ఆమె ఎంతగానో నమ్మి బాధ్యతలు అప్పగించిన నాయకుడు. ఎన్నడూ కన్నెత్తిచూడని, పన్నెత్తిమాటాడని ఈ వీరవిధేయ దేవర్ నాయకుడిని మించిన నమ్మినబంటు మరెవ్వరూ లేరని అమ్మ అనుకుంది కనుకనే, రెండుమార్లు ఆయన సీఎం కాగలిగాడు. అంతటివాడు ఇప్పుడు తమపక్షం వచ్చినప్పుడు ఓటర్లమీద కచ్చితంగా ప్రభావం ఉంటుందని డీఎంకే నాయకుల నమ్మకం. రేపటి ఎన్నికల్లో ఓట్లరీత్యా ఇది ఎంతలాభాస్తుందో తెలియదు కానీ, ప్రస్తుతానికి పన్నీరుసెల్వం రాకతో స్టాలిన్ పార్టీది పైచేయిగా కనిపిస్తోంది.
ఆయన ఓ విఫలనాయకుడు, అక్కడ ఉండటమే మాకు క్షేమం, రాజకీయంగానూ ప్రయోజనకరం అంటున్నారు అన్నాడీఎంకే నేతలు. అమ్మ ఉన్నప్పుడు కాదు, ఆ తరువాత కూడా పార్టీ ఆయనకు సీఎం కుర్చీ అప్పగించినా, ఎళప్పాడి పళనిస్వామి (ఈపీఎస్)తో సాగిన సుదీర్ఘ పోరాటంలో నిలిచిగెలవలేకపోయాడు కనుక, పన్నీరు సెల్వం (ఓపీఎస్)ను ఆ మచ్చ వెంటాడుతూనే ఉంటుంది. ఎత్తుగడలు, అడుగులు సరిగావేయలేని కారణంగా మూడోపర్యాయం ఆయన రెండునెలలు కూడా నిలబడలేకపోయాడు. జయలలితస్థానాన్ని శశికళ ఆక్రమించకుండా బీజేపీ ఆడిన నాటకంలో పావుగా ఉపకరించి, జయలలిత సమాధిముందు అమ్మచెప్పింది అంటూ కన్నీరు కార్చి, శశికళమీద తిరుగుబాటు చేసి నాలుగేళ్ళూ పరిపాలించుకోగలిగే అవకాశాన్ని వేగంగా కోల్పోయాడు. చిన్నమ్మమాటే వినివుంటే పదిరోజుల్లోనే ఆమె జైలుకు పోయి, ఆ కుర్చీలో తాను కొనసాగేవాడు. బీజేపీ పెద్దల అండ చూసుకొని, బిహార్‌లో మాంఝీ అనే తాత్కాలిక ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ మీద తిరుగుబాటు చేసి చివరకు ఎటూ కాకుండా పోయిన ఘటన గుర్తుండే ఉంటుంది.
శశికళ ప్రతిష్ఠించిన పళనిస్వామితో ఆ తరువాత రాజీపడి, పార్టీ సమన్వయకర్త పదవి ఉన్నందున కాస్తంతైనా నిలదొక్కుకున్నా, ఐదేళ్ళకాలంలో పళనిస్వామి అమితవేగంతో బలపడి చివరకు పన్నీరును పార్టీ నుంచి గెంటివేయగలిగాడు. అంగబలం, అర్థబలంతో పాటు, సమర్థనాయకత్వ లక్షణాలు ఉన్న పళనిస్వామి పన్నీరులాగా బీజేపీతో రాజీపడినట్టుగా కనిపించకుండా పార్టీని మొత్తం తన వశం చేసుకున్నాడు. ఏక నాయకత్వం అంటూ ఆ తరువాత పార్టీ సభల్లో సాగిన రసాభాస, పన్నీరు గెంటివేత, న్యాయస్థానాల్లో పోరాటాలు తెలిసినవే. మళ్ళీ పార్టీలోకి రానివ్వండి అని పళనిస్వామిని మొన్న జనవరిలో అభ్యర్థించి, కాదుపొమ్మని అనిపించుకున్నారు పన్నీరు. డెబ్బయ్‌ఐదేళ్ళ వయసులో తిరిగి స్వతంత్రంగా రాజకీయాల్లో రాణించే అవకాశం లేదని నిర్ణయించుకున్న ఆయనకు డీఎంకే దిక్కయింది.
దశాబ్దాలుగా డీఎంకే, అన్నాడీఎంకే కూటముల పోరు మాత్రమే సాగిన తమిళనాడులో ఇప్పుడు సినీనటుడు విజయ్‌కు చెందిన టీవీకే ప్రవేశంతో రాజకీయం వేడెక్కింది. ఒకప్పుడు ఈపీఎస్, ఓపీఎస్ చేయీచేయీ కలిపి పార్టీ నుంచి గెంటివేసిన శశికళ సైతం ఇప్పుడు కొత్తపార్టీ ప్రకటించారు. జయలలిత అభిమానుల్లో ఎందరు ఆమె పక్షాన నిలుస్తారో తెలియదు కానీ, ఇది కూడా అన్నాడిఎంకేకు నష్టం చేకూర్చే పరిణామమేనని విశ్లేషకుల అంచనా. గతంలో జయలలిత పార్టీతో కలిసివున్న విజయకాంత్ పార్టీ డీఎండీకె కూడా ఈ ఎన్నికలవేళ స్టాలిన్ గూటికి చేరింది. కాంగ్రెస్, వీసీకే, కమలహాసన్‌కు చెందిన మక్కల్ నీది మయ్యం, వామపక్షాలు డీఎంకేతో ఉన్నాయి. విజయ్ పార్టీ ప్రభావంతోనూ, బీజేపీతో చేయికలిపినందునా అన్నాడీఎంకే మరింత బలహీనపడి తాను గట్టెక్కేస్తానని స్టాలిన్ నమ్మకం. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ తమిళనాట రాజకీయపరిణామాలు త్వరితగతిన మారిపోతున్నాయి. హోరాహోరీపోరులో అంతిమ విజేతలెవరో చెప్పలేం. తన చేరికతో డీఎంకే బలపడుతుందని నమ్ముతున్న పన్నీరుసెల్వం మాత్రం చిట్టచివరకు మాతృసంస్థలోకి వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. మరి, ఈ మాటకు ఆ లోకాన ఉన్న అమ్మ సంతోషిస్తుందా? ఆమెను ఇప్పటికీ అమితంగా అభిమానిస్తున్న ఓటర్లు పన్నీరును చూసి స్టాలిన్‌కు ఓటుచేస్తారా? కరుణానిధి పార్టీ సంప్రదాయ ఓటర్లు పన్నీరు రాకకు పరవశించిపోతారా?
ఇవి కూడా చదవండి
పొరపాటున అమెరికా ఫైటర్ జెట్స్‌ను కూల్చిన కువైత్: పెంటగాన్
ఆయిల్ ట్యాంకర్‌పై దాడి.. భారతీయుడి మృతి