Share News

మళ్ళీ అదే కథ!

ABN , Publish Date - May 14 , 2026 | 12:49 AM

నీట్‌ రద్దయింది. ఎంబీబీఎస్‌ సహా మరో పదికోర్సుల్లో చేరాలనుకొనే విద్యార్థుల ప్రతిభను తూచి, వారి ప్రవేశార్హతను నిర్ణయించే జాతీయ స్థాయి సంస్థ అసమర్థత కారణంగా 23లక్షల మంది పిల్లల కష్టం...

మళ్ళీ అదే కథ!

నీట్‌ రద్దయింది. ఎంబీబీఎస్‌ సహా మరో పదికోర్సుల్లో చేరాలనుకొనే విద్యార్థుల ప్రతిభను తూచి, వారి ప్రవేశార్హతను నిర్ణయించే జాతీయ స్థాయి సంస్థ అసమర్థత కారణంగా 23లక్షల మంది పిల్లల కష్టం గాలికి కొట్టుకుపోయింది. రెండున్నర లక్షలసీట్లకోసం పోటీపడిన ఒక పరీక్ష ఇంతలోనే పనికిరాకుండాపోవడం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఒక భయంకరమైన మానసిక వేదన. పరీక్ష నిర్వహణలో విఫలమైన సంస్థలే వాటిని మళ్ళీ నిర్వహిస్తాయి, మళ్ళీ ఫీజు కట్టనక్కరలేదని కూడా అంటాయి. కానీ, కచ్చితంగా నెగ్గుకురాగలమని నమ్మకంగా ఉన్న పిల్లలకు ఈ పరిణామం అశనిపాతం. దేశవ్యాప్త సగటుకు ఆరురెట్ల సక్సెస్‌ రేట్‌ సాధిస్తున్న రాజస్థాన్‌లోని సికార్‌ ఈ పేపర్‌ లీక్‌ కుట్రకు కేంద్రం కావడంలో ఆశ్చర్యమేమీ లేదు.

సీబీఐ రంగంలోకి దిగి ఇద్దరు బీజేపీ నేతలతో సహా ఐదుగురిని అరెస్టు చేసింది. అనుమానితులు అనేకులున్నారు. పరీక్షను సమర్థంగా నిర్వహించలేని నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఎప్పటిలాగానే పారదర్శకత, విశ్వసనీయత ఇత్యాది పదాలు దట్టించిన ప్రకటనలో తాను ఎందుకు పరీక్ష సక్రమంగా నిర్వహించలేకపోయానన్నది కాక, ఈ పరీక్ష రద్దు ఎందుకు అవసరమో చెప్పుకొచ్చింది. ఇవేమాటలు రెండేళ్ళక్రితం కూడా దేశం విన్నది. అదే భాష, అవే హామీలూ ప్రమాణాలూ. పదేపదే జరిగే తప్పును అసమర్థత అని వదిలేయడం కూడా సరికాదు. పరీక్షను సక్రమంగా, నూరుశాతం కచ్చితత్వంతో నిర్వహించలేని విధానాలను సరిదిద్దుకోకుండా పిల్లల జీవితాలతోనూ, వారి తల్లిదండ్రుల ఆర్థికస్థితిగతులతోనూ ముడిపడిన అంశంలో తిరిగి అదే తప్పిదానికి తావివ్వడం మహాపాపం. దేశంలో అత్యధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొనే ఒక పెద్దపరీక్షను లోపరహితంగా నిర్వహించగల వ్యవస్థను సృష్టించలేకపోవడం విషాదం. ఈ ఒక్కరోజు పరీక్ష లక్షలాది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. విపరీతమైన పోటీ ఉన్న కోర్సులు కనుక, పసివయసు నుంచే విద్యార్థులమీద ఒత్తిడి మొదలవుతుంది. వైద్యవిద్య చుట్టూ ఉన్న ఆశలూ, ఆకాంక్షలూ బలహీనతలను సొమ్ముచేసుకొనేందుకు పుట్టుకొచ్చిన కోచింగ్‌ సెంటర్లు తల్లిదండ్రులను ఆర్థికంగా పీల్చిపిప్పిచేస్తాయి, ప్రత్యేక శిక్షణల పేరిట పిల్లలను పగలూ రాత్రీ నలిపివేస్తాయి. నిద్రాహారాలు మాని ర్యాంకు, సీటు సాధించడమే పరమార్థంగా సర్వమూ త్యాగం చేసిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఇంతటి అన్యాయం చేయడం క్షమార్హం కాని నేరం.


రెండేళ్ళ క్రితం బిహార్‌ కేంద్రంగా ఇదే తరహా నేరం జరిగినా, పరీక్షను పాక్షికంగా రద్దుచేసి, వ్యవస్థాగత లోపాలను కప్పిపెట్టిన ఫలితం ఇది. మొదట్లో కాస్తంత దబాయించిన ఎన్‌టీఏ ఆ తరువాత, ప్రజలనుంచి, రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఒత్తిళ్ళకు తలొగ్గక తప్పలేదు. వెలుగుచూసిన వాస్తవాలు దేశాన్ని నిర్ఘాంతపరిచాయి. 67మంది విద్యార్థులు నూరుశాతం స్కోర్‌ సాధించడమే కాదు, మరో నలభైమంది తప్పుడు సమాధానానికి గ్రేస్‌ మార్కులు పొంది తొలిస్థానాలు ఆక్రమించుకున్నారు. కొంతకాలానికి ఎన్‌టీఎ డైరక్టర్‌ జనరల్‌ను సస్పెండ్‌ చేసి, కేసు సీబీఐకి అప్పగించడంతో, స్ర్టాంగ్‌రూమ్‌ అనుకున్న హజారీబాగ్‌ స్కూలు గది నుంచే పేపరు బయటకు వచ్చి, నూటయాభైఐదు మంది విద్యార్థులు ప్రత్యక్షంగా లబ్ధిపొందారని తేలింది. హ్యాకింగులు, ట్రాకింగులు, ఎన్‌స్క్రిప్షన్లతో నిమిత్తంలేని లీకు అది. సీబీఐ దేశవ్యాప్త గాలింపులు జరిపింది, లింకులు ఛేదించి, ముపై ఆరుమందిని అరెస్టు చేసింది. ఇంతలోగా, పబ్లిక్‌ పరీక్షల్లో అక్రమాలను నిరోధించే పేరిట 2024 ఫిబ్రవరిలో పార్లమెంట్‌ ఆమోదించిన చట్టాన్ని ప్రభుత్వం ఈ పరిణామం అనంతరం ఆఘమేఘాల మీద అమలులోకి కూడా తెచ్చింది. ఆ ఘోరవైఫల్యం తరువాత ఎన్‌టిఎ సగర్వంగా ప్రవేశపెట్టిన జీపీఎస్‌ ట్రాక్డ్‌ వ్యాన్లు, ఏఐ అధారిత సీసీటీవీలు, సిగ్నల్‌ జామర్లు, బయోమెట్రిక్‌ వెరిఫికేషన్లు ఇత్యాదివి సైతం ప్రస్తుత పేపర్‌ లీక్‌ను ఆపలేకపోయాయి. ఆ కేసు అతీగతీ తేలకముందే ఇప్పుడు మరో కుట్ర జరిగింది. గత ఏడాది కూడా ఒక చిన్నస్థాయి నీట్‌ కుంభకోణం వెలుగులోకి రావడం వైద్య మాఫియా వ్యవస్థీకృత సామర్థ్యాన్ని తెలియచెబుతోంది. తక్కువ సీట్లకోసం లక్షలమంది పోటీపడుతున్నప్పుడు, ఒక్క మార్కు తేడా కూడా విద్యార్థి భవిష్యత్తును దెబ్బతీస్తుంది. అక్రమార్కుల కుట్రలు మరోపక్క సాగుతూనే ఉంటాయి. అందుకే, ఇతర జాతీయస్థాయి పరీక్షల మాదిరిగా కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) విధానంలో దీనినీ నిర్వహించడం మంచిదని, పరీక్ష ఆరంభమైనప్పుడు తెరుచుకొనే స్మార్ట్‌ కీలు, డైనమిక్‌ క్వశ్చన్‌ విధానాలతో నీట్‌ యూజీని సమర్థవంతంగా తీర్చిదిద్దాలని నిపుణుల సూచన. పాతికలక్షలమంది విద్యార్థుల జీవితాలతో ముడిపడిన ఒక ప్రశ్నాపత్రాన్ని కొద్దిగంటలపాటు భద్రంగా కాపాడలేని మనకు, భావి పౌరులుగా వారి బాధ్యతలు, కర్తవ్యాల గురించి హితవులు చెప్పే అధికారం ఉన్నదా అన్నది ప్రశ్న.

ఇవి కూడా చదవండి..

ఉషను పెళ్లి చేసుకోకుంటే జీవితాంతం బ్యాచిలర్‌గానే.. : అమెరికా ఉపాధ్యక్షుడు

ఐఆర్‌జీసీకి నిధులు ఎలా వస్తున్నాయి.. చెబితే రూ.145 కోట్లు ఇస్తామంటున్న అమెరికా..

Updated Date - May 14 , 2026 | 12:49 AM