Share News

ఆరని హింస...!

ABN , Publish Date - Jun 17 , 2026 | 12:48 AM

జాతుల మధ్యవైరంతో మూడేళ్ళుగా మండుతున్న మణిపూర్‌లో సమీపకాలంలో శాంతి సాధ్యమేనా అన్న అనుమానం కలుగుతోంది. రోజూ రాష్ట్రంలో ఏదో ఒకచోట హింస జరుగుతూనే ఉంది, దాడులు, గృహదహనాలు...

ఆరని హింస...!

జాతుల మధ్యవైరంతో మూడేళ్ళుగా మండుతున్న మణిపూర్‌లో సమీపకాలంలో శాంతి సాధ్యమేనా అన్న అనుమానం కలుగుతోంది. రోజూ రాష్ట్రంలో ఏదో ఒకచోట హింస జరుగుతూనే ఉంది, దాడులు, గృహదహనాలు సాగుతూనే ఉన్నాయి. హింసను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్న భద్రతాబలగాలను కొన్ని గ్రామాలవారు బెదిరిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మణిపూర్‌ పోలీసులు, అసోం రైఫిల్స్‌, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ వంటి బలగాలమీద అవిశ్వాసంతో వాటి ప్రవేశంమీద ఆంక్షలు విధిస్తున్నట్టుగా చెబుతున్నారు. మణిపూర్‌ కొండప్రాంతాల గ్రామ అధికార చట్టం ప్రకారం శాంతిభద్రతల పరిరక్షణ, గ్రామాల రక్షణ ఆయా గ్రామాలదే కనుక, వాటి అధికార యంత్రాంగం అనుమతిలేనిదే భద్రతాదళాలు గ్రామాల్లోకి ప్రవేశించకూడదన్నది సారాంశం. కుకీలను కేంద్రప్రభుత్వం తమపై ప్రచ్ఛన్నయుద్ధానికి వాడుకుంటోందనీ, భద్రతాదళాలు తమపట్ల వివక్షతో వ్యవహరిస్తున్నాయనీ నాగాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

కుకీ, నాగా గ్రూపుల మధ్య సోమవారం ఉదయం జరిగిన కాల్పుల ఘటనకంటే, ఆ తరువాత ఇంఫాల్‌ ఆస్పత్రిలో రేగిన ఉద్రిక్తతలు మణిపూర్‌లో జాతుల మధ్యవైరం ఏ స్థాయిలో ఉన్నదో తెలియచెబుతుంది. తీవ్రంగా గాయపడిన ముగ్గురు కుకీలకు ప్రాథమిక చికిత్స అందించి, ఆ తరువాత ‘రిమ్స్‌’ ఆస్పత్రికి తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తుండగా నాగాలు అడ్డుపడ్డారు. ఆ తరువాత కేంద్రబలగాల రక్షణ మధ్య వారిని ఆస్పత్రికి తరలించినప్పటికీ, వందలాదిమంది అక్కడకు చేరుకొని నిరసనలకు దిగారు. వారిని చెదరగొట్టేందుకు భద్రతాదళాలు పొగబాంబులు, టియర్‌ గ్యాస్‌ ప్రయోగించవలసి వచ్చింది. ఆస్పత్రి ప్రాంగణంలోకి బలగాలు ప్రవేశించి దానిని ఒక యుద్ధభూమిలాగా మార్చివేశారని, అనేక గంటలపాటు రోగులు, వైద్యసిబ్బంది ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని గడపాల్సి వచ్చిందని అక్కడి వైద్య సంఘం మంగళవారం విమర్శించింది.


మణిపూర్‌లో కుకీ నాగా వైరం కొత్త సమస్యలు సృష్టిస్తోంది. కుకీ మిలిటెంట్‌ గ్రూపులతో ఇప్పటివరకూ కుదిరిన ఒప్పందాలన్నింటినీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రద్దుపరచి మిలిటెంట్లను ఏరివేయాలని నాగా సంస్థలు డిమాండ్‌ చేస్తున్నాయి. అతి భయానకమైన స్థితిలో ఆరుగురు నాగాల భౌతికకాయాలు లభించినప్పటినుంచీ ఈ రెండు జాతుల మధ్యా ఘర్షణ మరింత తీవ్రమైంది. కుకీలను నాగాలు ఏ మాత్రం సహించలేకపోతున్నారు, ఆత్మరక్షణ పేరిట దాడులకు దిగుతున్నారు. కుకీ–జో తెగలు అధికంగా ఉన్న ప్రాంతాలకు నిత్యావసరాలు చేరకుండా చేస్తున్నారు. తమకు ఆహార సరఫరాలు చేరనందుకు నిరసనగా కుకీలు కొన్ని ప్రాంతాల్లో ఆర్థిక దిగ్బంధనం అమలు చేశారు కూడా. నాలుగురోజుల క్రితం నాగా మిలిటెంట్‌ గ్రూప్‌ ఒకటి కుకీల మీద దాడులు జరిపి ముగ్గురిని చంపివేయడమే కాక, చర్చి సహా ఏడు ఆవాసాలకు నిప్పుపెట్టింది.

మూడేళ్ళపాటు మీతీ, కుకీల మధ్య తీవ్రహింస చూసిన రాష్ట్రం ఇప్పుడు నాగా, కుకీ హింసతో రగులుతోంది. రాష్ట్రంలో మళ్ళీ గృహదహనాలు, దోపిడీలు మొదలైనాయి. పరస్పరం అపహరణలు, హత్యలతో వైరం చల్లారడానికి అవకాశం లేకపోతోంది. కుకీలను నాగాలు పొరుగుదేశం నుంచి చొరబడిన మిలిటెంట్లుగా చూస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నార్సీ అమలు చేసి, చొరబాటుదారులను ఏరివేసి, సరిహద్దుల ఆవలకు తరిమికొట్టాలని నాగా సంఘాలన్నీ ఇటీవల ఒక్కమాటగా డిమాండ్‌ చేశాయి. తమ డిమాండ్లకు మద్దతుగా సభలు, ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. లోయప్రాంత మీతీలతో మూడేళ్ళు పోరాడిన కొండప్రాంత కుకీలు స్వయం పాలనకు డిమాండ్‌ చేస్తూండటం నాగాల్లో అభద్రతను పెంచింది. కుకీలు బలపడితే తమ భూములను లాక్కుంటారని నాగాల భయం. మీతీలతో ఘర్షణల సందర్భంగా కొండప్రాంతాలకు తరలిన కుకీలు, నాగాలున్న ప్రాంతాల్లో స్థిరపడి అక్కడి వనరులను పంచుకోవడమే కాక, వాటిపై పెత్తనం కోసం ప్రయత్నిస్తున్నట్టుగా ఓ ప్రచారం సాగుతోంది. మూడేళ్ళపాటు మీతీ–కుకీ వైరాన్ని పెంచిపోషించిన బీరేన్‌సింగ్‌ను ఎట్టకేలకు తప్పించి, నాలుగు నెలల క్రితం మళ్ళీ తమ ముఖ్యమంత్రినే బీజేపీ ప్రతిష్ఠించుకున్నప్పటికీ, మణిపూర్‌ పరిస్థితుల్లో పెద్దగా మార్పురాలేదు. మీతీల స్థానంలోకి నాగాలు రావడం వెనుక ఏ రాజకీయ ఎత్తుగడలున్నాయో తెలియదు కానీ, ఈ సరిహద్దు రాష్ట్రం రగులుతూనే ఉంది. కుకీ–నాగా వైరానికి బలమైన చారిత్రక మూలాలున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే, మణిపూర్‌ మళ్ళీ రాష్ట్రపతి పాలనవైపు అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు కసరత్తు.. జూన్ 23 నుంచి సంప్రదింపులు

జులై మూడో వారంలో తల్లికి వందనం!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 17 , 2026 | 12:48 AM