కొనసాగుతున్న ‘కల్లోలం’
ABN , Publish Date - Sep 29 , 2026 | 03:22 AM
సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం (ఎఎఫ్‌ఎస్‌పిఏ) అమలును మరో ఆర్నెల్లపాటు మణిపూర్‌లో పొడిగించి, కల్లోలిత ప్రాంతంగా దాని గుర్తింపును కొనసాగించాలని...
సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం (ఎఎఫ్‌ఎస్‌పిఏ) అమలును మరో ఆర్నెల్లపాటు మణిపూర్‌లో పొడిగించి, కల్లోలిత ప్రాంతంగా దాని గుర్తింపును కొనసాగించాలని రెండురోజులు క్రితం కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం క్షేత్రస్థాయి పరిస్థితులకు అద్దం పడుతోంది. మరో విధంగా చెప్పాలంటే, మణిపూర్‌ను దారికి తీసుకురావడంలో తాము విఫలం చెందామని పాలకులు అంగీకరించినట్టు. రాష్ట్రంలో పరిస్థితులు గాడినపడుతున్నాయని, శాంతి స్థాపన దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయన్న వాదన ఈ చర్యతో వీగిపోయింది. అక్టోబర్ 1 నుంచి అమలులోకి రాబోతున్న ఈ నిర్ణయం ఓ ఐదు జిల్లాల్లోని 13 పోలీస్‌స్టేషన్ల పరిధికి మాత్రమే వర్తించదు. అంటే, మిగతా రాష్ట్రమంతా అశాంతిలో కొట్టుమిట్టాడుతున్నదని కేంద్రప్రభుత్వమే అంగీకరించింది. మరో ఆర్నెల్లవరకూ పరిస్థితులు దారికి రావనీ, తేవడం కష్టమని కూడా పాలకులు అనుకున్నట్టుంది.
కుకీలకు ఆహారసరఫరాలు సాగకుండా నాగాలు అమలుచేసిన జాతీయ రహదారుల నిర్బంధాన్ని వమ్ముచేశామని మణిపూర్ ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. కుకీ మహిళా సంస్థ ఒకటి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ వివరణ ఇచ్చుకుంది. కుకీ గ్రామాలకు సరఫరాలు యథావిధిగా సాగేట్టుగా చేశామన్న ఆ వాదనలో నిజమెంతో తెలియదు కానీ, ముగ్గురు నాగాలను కుకీలు హత్యచేసినందుకు నిరసనగా కొన్ని జిల్లాల్లో అక్కడ బంద్ జరుగుతోంది. అసలే, నాగా కుకీల మధ్య ఉద్రిక్తత తీవ్రంగా ఉన్న స్థితిలో, మూడురోజుల క్రితం నాగా తెగకు చెందిన నలుగురు తుపాకీగాయాలతో చనిపోయి కనిపించారు. మయన్మార్‌నుంచి సరిహద్దుదాటివచ్చిన కుకీ మిలిటెంట్లే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని, మరణించినవారంతా నిరాయుధులు, నిరుపేదలేనని నాగాలు అంటున్నారు. కుకీ నేషనల్ ఆర్మీ సభ్యులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని నాగా సంఘాల ఆరోపణ. దీనికి కొద్దిరోజుల ముందు, కుకీలమీద నాగాలు జరిపిన దాడిలో ఒక మహిళ సహా నలుగురు మరణించారు. 1992–97మధ్య నాగా–కుకీ ఘర్షణల్లో కన్నుమూసినవారి స్మారకార్థం కుకీలు బ్లాక్‌డే పాటించినందుకు నాగాలకు ఈ ఆగ్రహం కలిగింది. కుకీలు బలంగా ఉన్న గ్రామాల్లో నాగాలు, నాగాలు మెజారిటీగా ఉన్న చోట కుకీలు హత్యలకు గురికావడం ఒక విషవలయంగా కొనసాగుతోంది.
శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం ఏమీచేయలేదనో, ఏర్పాట్లు సరిగా లేవనో ఎవరూ అనడం లేదు. కానీ, ఈ విషపూరిత వాతావరణాన్ని ఛేదించే విషయంలో పాలకులు విఫలమైనారు. వివిధ పేర్లతో పెద్దసంఖ్యలో సైనికబలగాలు ఉండికూడా హింస నిరంతరాయంగా సాగిపోతోంది. 2023మేనెలలో ఆరంభమై, బీరన్‌సింగ్ ఏలుబడిలో మీతీ–కుకీల మధ్య రెండున్నరేళ్ళకు పైగా కొనసాగిన హింస రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. బీరేన్ ప్రోద్బలంతో, మీతీల పక్షాన కుకీలమీద పోలీసు బలగాలు, మీతీ తీవ్రవాద సంస్థలు భయానకమైన దాడులకు పాల్పడ్డాయి. ఆ ఘర్షణల్లో మూడువందలమందికి పైగా మరణించారు, 70వేల మంది నిరాశ్రయులైనారు. బీరేన్ పెంచిపోషించిన ఈ హింస, ఇప్పుడు తదనంతర ముఖ్యమంత్రి ఖేమ్‌చంద్ నాయకత్వంలో నాగా–కుకీ వైపు మళ్ళింది. మీతీలకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించే బీరేన్ ప్రయత్నం ఒకటి అప్పటి అగ్గిరాజేస్తే, ఇప్పుడు వైరాలు వైషమ్యాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయి. బీరేన్ నిష్క్రమణతో రాష్ట్రం గాడినపడుతుందన్న నమ్మకం ఖేమ్‌చంద్ అధికారంలోకి వచ్చిన రెండునెలల్లోనే కొట్టుకుపోయింది. ప్రస్తుత నాగా–కుకీ వైరం వెనుక కూడా ఏవో రాజకీయ కుట్రలు ఉన్నాయన్న విమర్శలను అటుంచితే, అప్పట్లో మాదిరిగా గ్రామాలకు గ్రామాలు తగలబడిపోవడం, మహిళలపై సామూహిక అఘాయిత్యాలు జరగడం వంటివి లేవంతే. కానీ, అడపాదడపా జరుగుతున్న ఈ దాడులు కుకీ–నాగా మధ్య విద్వేషాలు ఏ మాత్రం చల్లారకుండా సజీవంగా ఉంచుతున్నాయి. మూడుదశాబ్దాల క్రితం ఈ రెండు తెగల మధ్యా సుదీర్ఘకాలం హింస కొనసాగిన సంగతి తెలిసిందే. మరికొంతకాలం వాతావరణం ఇలాగే ఉంటే, ఈ మాత్రం నియంత్రణ కూడా సాధ్యం కాకుండాపోయి రాష్ట్రం మళ్ళీ గతంలోకి జారుకోవడం ఖాయమన్న భయం అందుకే. ఆర్నెల్ల తరువాత కూడా క్షేత్రస్థాయి పరిస్థితుల్లో ఏ మార్పూరాకపోతే, మణిపూర్‌ను దారికితేవడానికే సాయుధదళాల చట్టాన్ని పొడిగించామన్న ప్రభుత్వం వాదన వీగిపోతుంది, అది కల్లోలిత ప్రాంతంగానే మిగిలిపోతుంది.
Also Read:
హెల్త్‌కేర్ సెక్యూరిటీ.. కొత్త తరం ఆర్థిక ప్రణాళిక
ఎలుగుబంటిని నిద్ర లేపినందుకు రూ.5లక్షల ఫైన్