విఫల రాష్ట్రం
ABN , Publish Date - Oct 22 , 2026 | 04:21 AM
ఒక రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లకాలంలో ఒక సంక్షోభాన్ని పరిష్కరించలేకపోవడం ఎక్కడా లేదేమో. మణిపూర్‌లో పరిస్థితులు మెరుగుపడటానికి ముందే అవి మరింత దిగజారిపోతూంటాయి. చల్లారిందని అనుకుంటున్న...
ఒక రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లకాలంలో ఒక సంక్షోభాన్ని పరిష్కరించలేకపోవడం ఎక్కడా లేదేమో. మణిపూర్‌లో పరిస్థితులు మెరుగుపడటానికి ముందే అవి మరింత దిగజారిపోతూంటాయి. చల్లారిందని అనుకుంటున్న మీతీ–కుకీ ఘర్షణలకు ఇప్పుడు అక్కడ మళ్ళీ తెరలేచింది. మీతీలు లక్ష్యంగా కుకీలు జరిపిన ఒక భీకరదాడిలో ముగ్గురు మరణించారు, అనేకులు గాయపడ్డారు. ఈ దాడి అనంతరం లోయలో నిరసనలు వెల్లువెత్తాయి, నలభై ఎనిమిదిగంటల బంద్ జరిగింది. కొన్నిచోట్ల ఘర్షణలు, పేలుళ్ళు సంభవించాయి, మీతీ సంఘాల హెచ్చరికలతో ప్రజల్లో అభద్రతాభావం పెరిగింది.
మూడేళ్లక్రితం మొదలైన హింసలో మూడువందలకుపైగా ప్రాణాలు పోయాయి, 70,000 మంది నిరాశ్రయులైనారు. తీవ్రతలో కాస్తంత తేడావున్నా, అది ఇంకా కొనసాగుతూ, మణిపూర్‌లోని ప్రతి తెగనూ జాతినీ చుట్టుముట్టింది. తాత్కాలిక సరిహద్దులతో రాష్ట్రం జాతులు, మతాల ప్రాతిపదికన ప్రాంతాలుగా విడిపోయింది. శాంతిభద్రతలపై పట్టు సాధించడానికి ఖేమ్‌చంద్ ప్రభుత్వం నానాకష్టాలూ పడుతూంటే, రాష్ట్రంలో ఈ హింసకు మూలకారణమైన మీతీ కుకీల మధ్య ఇప్పుడు మళ్ళీ ఘర్షణ రేగింది. హత్యకు గురైనవారి మృతదేహాలతో మీతీలు ముఖ్యమంత్రి నివాసం ముందు నిరసనలు నిర్వహించి, పాలకుల సమర్థత మీద తమకు నమ్మకం లేదని ప్రకటించారు. మణిపూర్‌లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, గవర్నర్ పాలన రెండూ హింసను అరికట్టడంలో విఫలం కావడం విచిత్రం, విషాదం. మాజీ ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ ఏలుబడిలో రెండున్నరేళ్ళపాటు రాష్ట్రం మీతీ–కుకీ ఘర్షణలతో మండిపోయింది. ఆయన ప్రోద్బలం మేరకు భద్రతాబలగాలు, మీతీ తీవ్రవాద సంస్థలు కుకీలను ఊచకోత కోశాయి. మీతీల పక్షాన వ్యవహరిస్తూ ఆయన తెగలమధ్య వైరం పెంచుతున్నాడన్న వాస్తవం పలుమార్లు నిరూపణ అయింది. ఈ హింసావలయాన్ని ఛేదించాలంటే నాయకత్వాన్ని మార్చవలసిందేనన్న ఒత్తిడిపెరగడంతో, మరోపక్క బీరేన్‌ను తొలగించేందుకు విపక్షాలు తమ ప్రయత్నాలు ఉధృతం చేయడంతోనూ ఆఖరుక్షణాల్లో రాష్ట్రపతిపాలన విధించి ఆ రాష్ట్రం తమ చేజారిపోకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాపాడుకుంది. మీతీలకు ఆయుధాలు సమకూర్చవలసిందిగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న బీరేన్ తన అధికారులకు ఆదేశిస్తున్న ఆడియో ఒకటి బయటకు వచ్చి, సుప్రీంకోర్టు కూడా దానిని ధ్రువీకరించడం బీజేపీ అధిష్ఠానాన్ని ఇరకాటంలో పడవేసింది. బీరేన్‌ను తప్పించి, ఏడాది పాటు రాష్ట్రపతిపాలన అమలు చేసినప్పుడు కూడా రాష్ట్రంలో అరాచకాలు కొనసాగాయి. మీతీయేతర జాతుల్లో బీజేపీ పట్ల అవిశ్వాసం అధికంగా ఉన్న నేపథ్యంలో, సౌమ్యుడిగా, అందరికీ ఆమోదయోగ్యుడుగా పేరున్న ఖేమ్‌చంద్‌ను సీఎం చేసి, నాగా, కుకీల నుంచి ఇద్దరిని ఉపముఖ్యమంత్రులను చేయడంతో రాష్ట్రం గాడినపడవచ్చునన్న అభిప్రాయం కలిగింది. కానీ, ఖేమ్‌చంద్ నాయకత్వంలో నాగా–కుకీ ఘర్షణలు మొదలై, నాలుగునెలల్లోనే తీవ్రస్థాయికి చేరి, ఉపముఖ్యమంత్రులు ఇద్దరూ పరస్పరం ఆరోపణలు చేసుకోవడం ప్రారంభించారు.
20రోజుల క్రితమే అక్కడ సాయుధదళాల ప్రత్యేకాధికారాల చట్టం అమలును మరో ఆర్నెల్లపాటు పొడిగించి, కల్లోలితప్రాంతంగా దాని గుర్తింపును కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మణిపూర్‌ను దారికి తీసుకురావడంలో తాము విఫలం చెందామని పాలకులే ఒప్పుకున్నట్టు దేశానికి అనిపించింది. ఓ పదమూడు పోలీసు స్టేషన్ల పరిధి మినహా మిగతా రాష్ట్రమంతా కల్లోలంగానే ఉందని ఈ నిర్ణయం అర్థం. నాగా–కుకీల మధ్య వరుసబెట్టి సాగుతున్న దాడులు నివారించడం సాధ్యం కాకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చివుండవచ్చు. ఖేమ్‌చంద్ పాలనలో నాగా–కుకీ ఘర్షణలు రేగడం వెనుక కూడా రాజకీయ కుట్రలున్నాయన్న విమర్శను అటుంచితే, బీరేన్ నిష్క్రమణతో తగ్గుముఖం పట్టాయనుకుంటున్న మీతీ–కుకీ ఘర్షణలు ఇప్పుడు మళ్ళీ మొదలుకావడం అత్యంత భయం కొల్పే పరిణామం. అప్పటి మాదిరిగా గ్రామాలకు గ్రామాలు తగలబడటం, మహిళలపై సామూహిక అత్యాచారాలు జరగడం వంటి ఘోరమైన పరిస్థితులు మళ్ళీ తలెత్తకుండా ప్రభుత్వం నిష్పక్షపాతంగా, నిర్దయగా వ్యవహరించడం అవసరం. ఓట్ల లెక్కలను, రాజకీయ అవసరాలను పక్కనబెట్టి, యుద్ధభూమిగా మారిన ఈ రాష్ట్రంలో దేశప్రయోజనాలదృష్ట్యా వ్యవహరించాలి. కేంద్రప్రభుత్వం మణిపూర్మీద పూర్తిగా దృష్టినిలిపి ఈ నిత్య సంఘర్షణను అంతం చేయాలి. మణిపూర్‌ను కల్లోలిత ప్రాంతంగా ఉంచడం, కొనసాగించడం ప్రమాదం.
ఈ వార్తలనూ చదవండి:
ఆర్ఎస్ఎస్పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు.. పిల్ల చేష్టలని కొట్టిపడేసిన బీజేపీ..
భారత్‌ను టార్గెట్ చేయాలనే ఉద్దేశం మాకు లేదు: అమెరికా విదేశాంగ మంత్రి