Share News

తునకలైన తృణమూల్‌!

ABN , Publish Date - Jun 05 , 2026 | 12:59 AM

పశ్చిమబెంగాల్‌ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఘోరంగా ఓడినప్పటికీ, దానికి వచ్చిన ఓట్లు, సీట్లను బట్టి ఆ పార్టీ యుద్ధరంగంలో తీవ్రంగా గాయపడిందే తప్ప, ప్రాణం వదిలేయలేదని జనానికీ, మేధావులకూ...

తునకలైన తృణమూల్‌!

పశ్చిమబెంగాల్‌ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఘోరంగా ఓడినప్పటికీ, దానికి వచ్చిన ఓట్లు, సీట్లను బట్టి ఆ పార్టీ యుద్ధరంగంలో తీవ్రంగా గాయపడిందే తప్ప, ప్రాణం వదిలేయలేదని జనానికీ, మేధావులకూ అనిపించింది. 208 సీట్లు గెలుచుకొని బీజేపీ అధికారంలో కూచుంటే, ప్రజాతీర్పు మేరకు 80సీట్లతో టీఎంసీ ప్రధాన ప్రతిపక్షమైంది. ఈ రెండు పార్టీల మధ్యా ఓట్ల తేడా 5శాతమే ఉన్నందున, సీట్ల లెక్కన టీఎంసీ ఎన్నికల రంగంలో దెబ్బతిన్నదే కానీ, ప్రజాక్షేత్రంలో దాని పునాదులు బలంగానే ఉన్నాయని అనిపించింది. టీఎంసీకంటే నూటయాభైశాతం రెట్టింపు సీట్లు గెలుచుకున్న అధికారపక్షానికి ఈ వివరం మరింత బాగా తెలుసు. భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చాం కదా అని ధిలాసాగా ఉండటం క్షేమం కాదనీ, వీధిపోరాటాలకు మారుపేరైన టీఎంసీ అధినేతను ఇలాగే వదిలేస్తే మహా ప్రమాదమనీ దానికి ఎరుకే. ఇదే వేడిమీద ఆ తృణమూలాన్ని పెకిలించేయాలని డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ నిర్ణయించుకుంది. దశాబ్దాలపాటు మమత నిర్మించిన కోట పేకమేడలా కూలిపోయింది.

కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే ఒకరు తనతో ఓ అరవైమంది ఉన్నారంటూ శాసనసభలో మమత పార్టీకి నాయకుడయ్యారు. రాజ్యాంగపరంగా ఏ ఇబ్బందులూ రాకుండా, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని గౌరవిస్తూ రితబ్రత బెనర్జీ చూపిన ఈ చొరవకు ముచ్చటపడిన స్పీకర్‌ ఆ చీలికవర్గాన్నే అసలైన టీఎంసీగా వెనువెంటనే గుర్తించి విపక్షంలో కూచోబెట్టారు. మూడింట రెండువంతుల మెజారిటీ లెక్కకు ఏ లోటూ రానివ్వకుండా ఎంతో నైపుణ్యంగా చీల్చిన ఈ చోటా నాయకుడికి ప్రతిపక్షనేతకోసం ఉద్దేశించిన కార్యాలయాన్ని తక్షణమే కేటాయించి సముచితంగా గౌరవించారు. టీఎంసీ శాసనసభాపక్ష నేత, చీఫ్‌విప్‌ స్థానాల్లో ఎవరెవరిని నియమించాలో తెలియచేస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో మమత మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ రాసిన లేఖను అప్పటికే దొంగసంతకాల వివాదం కారణంగా స్పీకర్‌ తిరస్కరించారు కనుక, ఈ కొత్త అంకానికి ఏ అడ్డంకులూ లేకపోయాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ గుర్తుపైన ఎన్నికల్లో గెలిచిన తామంతా అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని, ప్రజల సమస్యలపై పోరాడతామని రితబ్రత బెనర్జీ చెప్పడం కడు రమ్యంగా ఉంది. మమతను ఒంటరిని చేసిన వ్యక్తే ఆమె తమకు సలహాదారుగా, మార్గదర్శిగా ఉండాలనడం వినడానికే విచిత్రంగా ఉంది. అభిషేక్‌ బెనర్జీకీ నమ్మినబంటుగా ఉంటూ రెండేళ్ళక్రితం రాజ్యసభ సభ్యత్వాన్ని, ఇటీవలి ఎన్నికల్లో అసెంబ్లీ టిక్కెట్‌ను సంపాదించుకున్న ఈ మాజీ కమ్యూనిస్టు నాయకుడు మమత మేనల్లుడి ఆధిపత్యాన్ని సహించలేకపోయాడట. తృణమూల్‌ను తుదముట్టించే కార్యక్రమం రాష్ట్రానికే పరిమితం కావడం లేదనీ, నలభై ఒక్కమంది ఎంపీల బలం ఉన్న ఈ పార్టీని పార్లమెంట్‌లోనూ మాయం చేసే పని జోరుగా సాగుతోందని వార్తలు వస్తున్నాయి. 28మంది లోక్‌సభ సభ్యులు, 13మంది రాజ్యసభ సభ్యుల్లో ఎంతమందిని ఆలింగనం చేసుకుంటే రాజ్యాంగ విహితంగా ఉంటుందో అధినాయకులకు తెలుసు. సంఖ్యరీత్యా దక్కే ప్రయోజనంతో పాటు, విపక్ష కూటమిలో రెండవ అతిపెద్ద పార్టీ అలా కుప్పకూలిపోతే అధికారపక్షానికి లభించే ఆ ఆనందమే వేరు.


రితబ్రత బెనర్జీలో అందరికీ ఏక్‌నాథ్‌ షిండే కనిపిస్తున్నాడు. దశాబ్దాలుగా ఎదిగివచ్చిన అసలు పార్టీలను మింగేసి, మహామహులనుకొనే వాటి అధినాయకులను అర్థరాత్రి కుట్రలతో నడిరోడ్డుమీదకు నెట్టేసే మరో నాటకం బెంగాల్‌లో మొదలైంది. మూడువంతులమంది ఎమ్మెల్యేలే కాదు, పార్టీలో పెద్దతలకాయలనుకున్నవారిని కూడా కోల్పోయి ఒంటరి అయిన మమత రేపటిరోజుల్లో న్యాయస్థానాల్లోనూ, ఎన్నికల సంఘం ముందు వీరోచితంగా పోరాడి పార్టీ పేరునూ, గుర్తునూ కాపాడుకోగలరా? లేక పవార్లు, ఠాక్రేల గతే ఆమెకూ పడుతుందా? చూడాలి. పార్టీలోని సమస్త విభాగాలను, హోదాలను రద్దుచేసి, అధినాయకురాలిగా తన పేరును మాత్రమే మిగల్చిన మమతా బెనర్జీ కూలుతున్న కోటను కాపాడుకోవడానికి ఏవో ఆఖరు ప్రయత్నాలైతే చేస్తున్నారు. తన వీరోచిత పోరాటాలతో ముప్పై ఐదేళ్ళ కమ్యూనిస్టు పాలనను కుప్పకూల్చి, ముప్పయ్యేళ్ళుగా పార్టీలో తలెగరేసినవారిని తరిమికొట్టి, పదిహేనేళ్ళపాటు నిరవధికంగా బెంగాల్‌ను ఏలిన మమత జాతకం ముప్పైరోజుల్లోనే తారుమారైంది. బుల్‌డోజర్‌ రాజకీయాలకు మారుపేరైన డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఉండగా, పార్టీని మళ్ళీ పునాదులనుంచి నిర్మించడం ఆమెకు ఇప్పట్లో సాధ్యమయ్యేది కూడా కాదు.

ఇవి కూడా చదవండి...

రెండేళ్లలో ఏం చేశామో ప్రజలకు వివరించండి.. మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశం

బలమైన భారత్‌ కోసం యువత ఎదురుచూపు: పవన్ కల్యాణ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 05 , 2026 | 12:59 AM