Share News

బర్మాతో బంధం..!

ABN , Publish Date - Jun 06 , 2026 | 01:54 AM

ఒక సైనిక నియంతకు ఎర్రతివాచీ స్వాగతం పలికి, ఐదురోజుల పాటు ఆతిథ్యం ఇవ్వడం అత్యంత అన్యాయమని మయన్మార్‌ ప్రజాస్వామ్య ఉద్యమనేత ఆంగ్‌సాన్‌ సూకీ కుమారుడు భారతదేశాన్ని తప్పుబడుతున్నారు...

బర్మాతో బంధం..!

ఒక సైనిక నియంతకు ఎర్రతివాచీ స్వాగతం పలికి, ఐదురోజుల పాటు ఆతిథ్యం ఇవ్వడం అత్యంత అన్యాయమని మయన్మార్‌ ప్రజాస్వామ్య ఉద్యమనేత ఆంగ్‌సాన్‌ సూకీ కుమారుడు భారతదేశాన్ని తప్పుబడుతున్నారు. కేబినెట్‌ మంత్రులు, వ్యాపారవేత్తలతో కూడిన ఒక భారీ బృందంతో మయన్మార్‌ దేశాధ్యక్షుడు మిన్‌ ఆంగ్‌ హ్లాయింగ్‌ ఇటీవల భారత్‌లో జరిపిన పర్యటన పట్ల సూకీ కుమారుడు తన అభ్యంతరాలనూ, అసంతృప్తినీ వ్యక్తంచేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశమైన భారత్‌ మానవహక్కుల పక్షాన నిలబడాలని, ఒకపక్క బర్మాలో రక్తసిక్తమైన అంతర్యుద్ధం సాగుతూండగా, భారతదేశం ఈ ఘనస్వాగతాలతో సైనికపాలకుడికి గుర్తింపునివ్వడం సరికాదని అన్నారాయన. సైనిక కుట్ర కారణంగా పదవులు కోల్పోయిన చట్టసభసభ్యులు, ప్రజాప్రతినిధులు, ప్రజాస్వామిక వాదులు, వివిధ తెగల నాయకులు, సైనికపాలన వ్యతిరేక కార్యకర్తలు సంఘటితంగా ఏర్పాటు చేసుకున్న ‘నేషనల్‌ యూనిటీ గవర్నమెంట్‌’ సైతం హ్లాయింగ్‌ పర్యటనమీద తీవ్ర అభ్యంతరాలను వెలిబుచ్చుతూ భారత విదేశాంగ మంత్రి జయశంకర్‌కు ఒక లేఖ రాసినట్టు వార్తలు వచ్చాయి. ఒక కీలకమైన పొరుగుదేశంగా భారతదేశం మయన్మార్‌ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు ప్రాధాన్యం ఇవ్వాలని, సైనిక ప్రభుత్వాన్ని తిరస్కరిస్తున్న వీరి ఆశయాలను గౌరవించాలని ఆ లేఖలో వారు పేర్కొన్నారట.

మయన్మార్‌ అధ్యక్షుడి తొలి విదేశీ పర్యటనకు భారతదేశం ఆతిథ్యం ఇవ్వడం, ఆంక్షలు, విమర్శలు ఎదుర్కొంటున్న ఒక దేశాధినేతతో చేయికలపడం మీద ఆక్షేపణలు వెల్లువెత్తడం సహజం. ప్రధాని మోదీతో బర్మాపెద్ద భేటీ అయినప్పుడు సూకీ నిర్బంధం గురించి కూడా ప్రస్తావించినట్టు భారత విదేశాంగశాఖ తన ప్రకటనలో విశేషంగా పేర్కొన్నది ఈ కారణంవల్లనే. మయన్మార్‌ అంతర్యుద్ధాన్ని ముగించేందుకు ఒక ప్రత్యేక కృషి జరుగుతున్న తరుణంలో, అందులో భాగంగా సూకీ విడుదలకు సంబంధించిన ప్రస్తావనలు కూడా వచ్చాయని భారత్‌ అతి జాగ్రత్తగా వ్యాఖ్యానించింది. ఇద్దరు నాయకుల మధ్య చర్చల్లో తన తల్లి ప్రస్తావన వచ్చినందునవల్ల, సానుకూల ఫలితాలకోసం ఎదురుచూస్తున్నానని సూకీ కుమారుడు అంటున్నారు. భారత్‌ న్యాయం పక్షాన నిలబడాలని ఆయన కోరుతున్నాడు. ఆంగ్‌సాన్‌ సూకీని మిగతా ప్రపంచం చూసి చాలాకాలమైంది. మూడేళ్ళక్రితం ఒక లేఖరాయడం వినా ఆమె కుమారుడు మాట్లాడింది లేదు. తన తల్లి ఇంకా జీవించే ఉందని రుజువుచేసే సాక్ష్యాలు ఇవ్వమని మయన్మార్‌ ప్రభుత్వాన్ని అతడు డిమాండ్‌ చేస్తున్నాడు. ఇద్దరు పోలీసు అధికారులు ఎదురుగా ఉండగా, ఆమె ఒక చెక్కబల్లమీద కూర్చున్న చిత్రాన్ని ప్రభుత్వం ఇటీవల విడుదల చేసినప్పటికీ, అది ఎప్పటిదో తెలియదు. అది నూటికి నూరుశాతం ఫేక్‌ అని ఇతని వాదన.


భారత్‌–బర్మా అధినేతల మధ్య మరో పక్షంరోజుల్లో 81వ పుట్టినరోజు జరుపుకుంటున్న సూకీ విడుదల గురించి ఏ ప్రస్తావనలు వచ్చాయో తెలియదు కానీ, మయన్మార్‌ తిరిగి ప్రజాస్వామ్యంవైపు ప్రయాణిస్తున్న తరుణంలో... అంటూ విదేశాంగశాఖ ఆ ప్రకటనలో వ్యాఖ్యానించడం మరింత విశేషం. 2020లో మహాద్భుతమైన మెజారిటీతో మరోమారు సూకీని జనం ఎన్నుకున్న ఏడాదిలోపే సైన్యం ఆమెను పదవీచ్యుతురాలిని చేసి, తిరిగి నిర్బంధంలోకి నెట్టేసింది. దేశం సైన్యం అధీనంలోకి పోవడంతో ప్రజాగ్రహం వెల్లువెత్తింది. సూకీ మద్దతుదారులు, ప్రజాస్వామిక వాదులు, వివిధ తెగలు కలసికట్టుగా దేశం నాలుగుదిక్కులా సాగిస్తున్న సాయుధ పోరాటంలో బర్మా నలిగిపోతోంది. నిరసనకారులమీద సైన్యం నిర్దయగా బాంబుల వర్షం కురిపిస్తోంది, గ్రామాలకు గ్రామాలు తగలబడుతున్నాయి. అంతర్యుద్ధం కారణంగా మిజోరమ్‌, మణిపూర్‌లోకి చిన్‌ తెగకు చెందినవారు వందలసంఖ్యలో వచ్చిపడుతున్న విషయం తెలిసిందే. ఈ పోరాటాలు, ప్రపంచవ్యాప్త ఒత్తిళ్ళు, ఆంక్షలనుంచి బయటపడటానికి సూకీని దించేసిన సైనిక కమాండర్‌ తన సైనికదుస్తులు వదిలేయాలని నిర్ణయించుకున్నారు. నామమాత్రంగా జరిగిన ఎన్నికల్లో నెగ్గి, ఏప్రిల్‌లో దేశాధ్యక్షుడైనారు. సైనికపెద్దగా రష్యా, చైనాల్లో పర్యటించిన ఆయన, దేశాధ్యక్షుడైన రెండునెలల్లోనే తన తొలివిదేశీ పర్యటనలో మనదేశంలో కోటుతో ప్రత్యక్షమైనారు. పదహారు వందల కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దు ఉన్న మయన్మార్‌ పాలకులతో అనేక వ్యూహాత్మక ప్రయోజనాల రీత్యా సయోధ్య, సాన్నిహిత్యం ఎంతో అవసరం. ఇంధనం, మైనింగ్‌, ఆగ్రో, నౌకాశ్రయ నిర్మాణం ఇత్యాది రంగాల్లో ఉభయదేశాల మధ్యా కుదిరిన ఒప్పందాలతో పాటు, తమ భూభాగం నుంచి భారత వ్యతిరేక కార్యకలాపాలను అనుమతించబోనని ఆ సైనికపెద్ద ఇచ్చిన హామీ కూడా ఉపశమనం కలిగించేదే. కొత్తపాలకులను స్వాగతించడంతో పాటుగా, బర్మా ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు ప్రతీక అయిన సూకీ విడుదలకోసం కూడా కృషిచేయాల్సిన బాధ్యత భారత్‌పైన ఉంది.

ఇవి కూడా చదవండి..

టీఎంసీలో చిచ్చు... రెబల్ ఎమ్మెల్యేలతో 23 మంది ఎంపీల మంతనాలు

కాంగ్రెస్‌కు జేఎంఎం ఝలక్.. రెండు రాజ్యసభ సీట్లలో పోటీకి కసరత్తు

Updated Date - Jun 06 , 2026 | 01:54 AM