Share News

పిలుపు మంచిదే!

ABN , Publish Date - Oct 29 , 2026 | 03:36 AM

న్యూఢిల్లీలో నవంబరు 20–౨౨ తేదీలలో షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) చర్చా కార్యక్రమం ఒకదానిలో పాల్గొనవలసిందిగా పాకిస్థాన్‌ను భారత్‌ ఆహ్వానించింది. ఎస్సీవోలోని మిగతా...

పిలుపు మంచిదే!

న్యూఢిల్లీలో నవంబరు 20–౨౨ తేదీలలో షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) చర్చా కార్యక్రమం ఒకదానిలో పాల్గొనవలసిందిగా పాకిస్థాన్‌ను భారత్‌ ఆహ్వానించింది. ఎస్సీవోలోని మిగతా సభ్యదేశాలన్నింటినీ పిలవడంలో భాగంగానే ఈ ‘సివిలైజేషనల్‌ డైలాగ్‌’లో పాలుపంచుకోమంటూ పాకిస్థాన్‌ సాంస్కృతిక శాఖామంత్రి ఔరంగజేబ్‌ ఖాన్‌కూ పిలుపు వెళ్ళింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా గత ఏడాది మే నెలలో ఆపరేషన్‌ సిందూర్‌ నిర్వహించిన అనంతరం, పాకిస్థాన్‌ సీనియర్‌ మంత్రిని భారతదేశం ఆహ్వానించడం ఇదే ప్రథమం. పాకిస్థాన్‌ మంత్రి ఒకరు మన దేశానికి వచ్చింది 2023 మే నెలలో. గోవాలో జరిగిన ఎస్సీవో విదేశాంగ మంత్రుల సదస్సుకు బిలావల్‌ భుట్టో హాజరైనారు. ఇప్పుడు ఔరంగజేబ్‌ సరేనంటారా, కాదంటారా అన్నది వేరే విషయం.

ఎస్సీవో సభ్యదేశాల ప్రజల మధ్య సంబంధాలను పెంచడం, సాంస్కృతిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, ఉమ్మడి వారసత్వాన్ని పెంపొందించడం, కళ, సాహిత్యం, ప్రాచీన నాగరికతా సంప్రదాయాలు ప్రదర్శించడం ఈ సివిలైజేషనల్‌ డైలాగ్‌ ప్రధాన లక్ష్యాలు. గత ఏడాది తియాంజిన్‌లో జరిగిన ఎస్సీవో శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాగరికతల మధ్య సంభాషణ అవసరాన్ని గుర్తుచేసి, ప్రతిపాదిస్తే, ఇటీవల తజకిస్థాన్‌లో జరిగిన మరో సమావేశంలో ఈ కార్యక్రమానికి భారతదేశం ఆతిథ్యం ఇస్తుందని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ ప్రకటించారు. మనమే నిర్ణయించి, నిర్వహిస్తున్న కార్యక్రమం కనుక దీనికి పాకిస్థాన్‌ను ఆహ్వానించడం సముచితం. గత నెలలో షాంఘై సహకార సంస్థ జాతీయ సమన్వయకర్తల మూడురోజుల సమావేశం ఇస్లామాబాద్‌లో జరిగినప్పుడు భారతదేశం నుంచి విదేశాంగశాఖ సీనియర్‌ అధికారి అలోక్‌ డిమ్రీ అందులో పాల్గొన్నారు. పహల్గాం ఉగ్రదాడి తరువాత మన బృందం పాకిస్థాన్‌ వెళ్ళడం ఆ విధంగా ఎస్సీవో ఛత్రం కిందే జరిగింది. దీనికి రెండేళ్ళముందు భారత విదేశాంగమంత్రి జైశంకర్‌ పాకిస్థాన్‌లో అడుగుపెట్టి, కొందరు సీనియర్‌ పాకిస్థానీ నాయకులతో సమావేశమైనది కూడా ఎస్సీవో సదస్సు సందర్భంలోనే. తొమ్మిదేళ్ళలో పాకిస్థాన్‌ను సందర్శించిన మొదటి భారత విదేశాంగమంత్రి ఆయన.

ఐదురోజుల క్రితమే ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్‌ను భారత్‌ చెడామడా ఏకేసింది. భారత్‌లో మతస్వేచ్ఛ గురించి పాకిస్థాన్‌ చేసిన విమర్శలకు ప్రతిస్పందిస్తూ, 1999 కార్గిల్‌ ఘర్షణలో మరణించిన తమ సైనికుల దేహాలను పాకిస్థాన్‌ వెనక్కుతీసుకోకపోతే భారతసైన్యమే సైనిక లాంఛనాలతో, ఇస్లామిక్‌ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించిన విషయాన్ని గుర్తుచేసింది. అటువంటి దేశం విశ్వాసాలు, మతం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదంటూ తప్పుబట్టింది. ప్రతీ సందర్భాన్నీ, ప్రతీ వేదికనూ ఉభయదేశాలూ పరస్పర విమర్శలకు వాడుకొనే వాతావరణం నేడు నెలకొని ఉంది. గతంలో మాదిరిగా ఉద్రిక్తతలు రేగిన తరువాత చర్చలకు ఉపక్రమించడం పూర్తిగా నిలిచిపోయింది. 2016 నుంచి ఉన్నతస్థాయి చర్చలంటూ జరపకపోవడంతో భారతదేశం దీనిని ఒక దౌత్యవిధానంగా అమలు చేస్తున్నదని అనిపించడం సహజం. భారత్‌ నుంచి జరిగే ప్రతీ శాంతిప్రయత్నానికీ పాక్‌ సైనికశక్తి అడ్డుపడటం, ఇక్కడ ఉగ్రదాడులు జరుగుతూండటం చూస్తూనే ఉన్నాం. భారతదేశంతో శాంతి తన ఆధిపత్యానికి ప్రమాదమని పాక్‌ సైన్యం భావిస్తూంటే, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు చేష్టలుడిగి చూస్తున్నాయి. పఠాన్‌కోట్‌ దాడి తరువాత తన వ్యూహాన్ని మార్చుకున్న భారత్‌, ఆపరేషన్‌ సిందూర్‌తో దాని అణు హెచ్చరికల డొల్లతనాన్ని బట్టబయలు చేసింది. ప్రతీ ఉగ్రవాద చర్యకూ వ్యతిరేకచర్య తప్పదని రుజువుచేసింది. అయితే, అణ్వాయుధాలున్న రెండు ఇరుగుపొరుగు దేశాల మధ్య దౌత్యంకోసం ఒక తలుపు తెరిచివుండటం ఉభయదేశాలకు అవసరం. కొత్త సంక్షోభాలు తలెత్తినప్పుడు, పొరపాట్లకు తావులేకుండా వాటిని సమర్థవంతంగా నిర్వహించడానికీ, పరిష్కరించడానికీ ఒక మార్గం ఉండాలి. సంబంధాలు ఘనీభవించి ఉన్న తరుణంలో, ఈ నామమాత్రపు ఆహ్వానాలు, రాకపోకలు పెద్ద మార్పును తీసుకురాకపోవచ్చు, కానీ ఎటువంటి సంబంధాలు లేని పూర్తి తెగదెంపులస్థితి కంటే కొద్దోగొప్పో సంప్రదింపులు, అడపాదడపా పలకరింపులు ఉండటమే మంచిది.

Updated Date - Oct 29 , 2026 | 03:36 AM