Share News

ఇమ్రాన్‌కు సంఘీభావం

ABN , Publish Date - Feb 19 , 2026 | 01:25 AM

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, ప్రముఖ క్రికెటర్‌ ఇమ్రాన్‌ఖాన్‌ ఆరోగ్యం విషయంలో యావత్‌ ప్రపంచానికి ఉన్న అనుమానాలను, భయాలను ఆ పద్నాలుగు మంది ప్రపంచస్థాయి క్రీడాకారుల లేఖ ప్రతిబింబిస్తోంది. జైలులో ఆయన తీవ్ర అనారోగ్యంతో...

ఇమ్రాన్‌కు సంఘీభావం

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, ప్రముఖ క్రికెటర్‌ ఇమ్రాన్‌ఖాన్‌ ఆరోగ్యం విషయంలో యావత్‌ ప్రపంచానికి ఉన్న అనుమానాలను, భయాలను ఆ పద్నాలుగు మంది ప్రపంచస్థాయి క్రీడాకారుల లేఖ ప్రతిబింబిస్తోంది. జైలులో ఆయన తీవ్ర అనారోగ్యంతో ఉన్నారన్న వార్తల నేపథ్యంలో మాజీ కెప్టెన్లంతా కలసికట్టుగా పాకిస్థాన్‌ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఒక బహిరంగ లేఖ విడుదల చేయడం సరైన సమయంలో, సరైన చర్య. టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్లు కపిల్‌దేవ్‌, సునీల్‌ గవాస్కర్‌ సహా ఆ లేఖమీద సంతకాలు చేసినవారంతా ప్రపంచవ్యాప్తంగా పేరుప్రఖ్యాతులున్నవారే కనుక, ఈ చర్య పాకిస్థాన్‌ మీద కచ్చితంగా ఒత్తిడిపెంచుతుంది. ప్రపంచ క్రికెట్‌కు ఇమ్రాన్‌ చేసిన సేవలు, అందించిన చోదక శక్తిని ప్రస్తావిస్తూ, కెప్టెన్‌గా ఆయన క్రీడారంగానికీ, ప్రధానిగా దేశానికీ నాయకత్వాన్ని అందించిన విషయాన్ని వారు గుర్తుచేశారు. ఆయనకు చక్కని వైద్యచికిత్స దక్కాలని, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా నిర్బంధ పరిస్థితులు ఉండాలని, కుటుంబ సభ్యులను, న్యాయవాదులను ఆయనను కలిసేందుకు అనుమతించాలని, ఏ అవధులూ అడ్డంకులూ లేని న్యాయప్రక్రియకు అవకాశం దక్కాలని, అది పారదర్శకంగా సాగాలని వీరంతా విజ్ఞప్తిచేయడం బాగుంది. ఆటకు భౌగోళిక సరిహద్దులు లేవని, అది విశ్వవ్యాప్తమైనది ఈ లేఖ చాటుతోంది.

ఇటువంటి లేఖలు అరుదు. ఇమ్రాన్‌ ఆరోగ్యం గురించి వినబడుతున్న వార్తలు తమకు అందోళన కలిగిస్తున్నాయని వీరంతా పేర్కొనడం పాక్‌ ప్రజలను సైతం అప్రమత్తం చేస్తుంది. పాకిస్థాన్‌ ప్రభుత్వానికి ఈ లేఖ పెద్ద ఎదురు దెబ్బ. అది స్పందించిన తీరు, పడిన హడావుడి స్పష్టంగా కనిపిస్తోంది. ఇమ్రాన్‌ సుబ్బరంగా ఆరోగ్యంగా ఉన్నారంటూ ఆయన భోజనం చేస్తున్న చిత్రంతో పాటు, రోజూ తినే ఆహారపదార్థాల జాబితాను కూడా పాక్‌ ప్రభుత్వం విడుదల చేసింది. గాలీ వెలుతురూ చక్కగా ఉన్న ఏడు గదుల ప్రత్యేక సముదాయంలో ఉదయం అల్పాహారం నుంచి రాత్రి నిద్రపోయేవరకూ ఏమేమి తింటున్నారో వివరించింది.


అయినప్పటికీ, ఆయన ఆరోగ్యం పట్ల సాగుతున్న ప్రచారం ఏ మాత్రం తగ్గలేదు. ఆయన కుమారులు, సోదరి అదేపనిగా ఆరోపణలు చేస్తున్నారు. ఆయన జైల్లోనే కన్నుమూశారంటూ అడపాదడపా ప్రచారం జరుగుతూనే ఉంది. అనేక కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్‌ఖాన్‌ను జైలు అధికారులు తీవ్ర మానసికక్షోభకు గురిచేస్తున్నారని, ఆయన పట్ల అమానవీయంగా వ్యవహరిస్తున్నారని వార్తలు వెలువడ్డాయి. నిబంధనలకు భిన్నంగా అధిక గంటలు జైలు గదిలో నిర్బంధించడం వల్ల ఆయన శారీరక, మానసిక ఆరోగ్యం క్షీణించిందనీ, కంటిచూపు కోల్పోతున్నారని, కుడి కన్ను అత్యధికంగా దెబ్బతిన్నదనీ చెబుతున్నారు. సుప్రీంకోర్టు నియమించిన న్యాయనిపుణుడి ప్రత్యక్ష పరిశీలనలో ఇటువంటివి అనేకం వెల్లడైన నేపథ్యంలో, ఇమ్రాన్‌కు వైద్యపరీక్షలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది కూడా. అయితే, ఇది తాత్కాలిక ఉపశమనమే. దిగజారుతున్న ఇమ్రాన్‌ ఆరోగ్యాన్ని న్యాయస్థానాలు ఎప్పటికప్పుడు జోక్యం చేసుకొని కాపాడటం అసాధ్యం. సమీపకాలంలో ఇమ్రాన్‌ జైలునుంచి బయటకు రారన్నది వాస్తవం. ఆయన కథని జైల్లోనే ముగించాలని పాకిస్థాన్‌లో అత్యంత శక్తిమంతుడైన సర్వసైన్యాధ్యక్షుడు ఆసీమ్‌ మునీర్‌ కంకణం కట్టుకున్నారని పాకిస్థాన్‌ ప్రజల నమ్మకం.

తెహ్రీక్‌–ఏ–ఇన్సాఫ్‌ అధినేతగా, రాజకీయ నాయకుడిగా మారిన ఇమ్రాన్‌ఖాన్‌ను సులభంగా చరిత్రలోకి నెట్టేయవచ్చునని పాక్‌ పాలకులు నమ్ముతున్నారేమో. ఒక క్రీడాదిగ్గజంగా ఆయనకున్న విశేష ప్రజాదరణ రాజకీయరంగంలో ఆయన ఘనవిజయాలకు తోడ్పడిందని పాక్‌ ప్రభుత్వం మరిచిపోకూడదు. ఆ ప్రజాబలం కారణంగానే, ప్రత్యర్థులంతా ఒక్కటై, అమెరికా ఆశీస్సులతో గద్దెదించి, పలు కేసుల్లో భాగంగా జైల్లోకి నెట్టి, ఆ తరువాత ఎన్నికల్లో పాల్గొననివ్వకుండా చేసి‍న సంగతి పాక్‌ ప్రజలకు తెలియనిదేమీ కాదు. ఆర్థికంగా అధోగతిలోకి జారుతూ, రాజకీయంగా అస్థిరపరిస్థితులను ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌లో ఇమ్రాన్‌కు వీసమెత్తు హాని జరిగినా దేశం అగ్నిగుండమైపోతుంది. ప్రజాస్వామ్యం ముసుగులో ఒక కీలుబొమ్మ ప్రధానిని గద్దెమీద కూచోబెట్టి, సర్వమూ తానై, సకల వ్యవస్థలనూ నియంత్రిస్తున్న ఒక ఫీల్డ్‌మార్షల్‌ చేతిలో పాకిస్థాన్‌ ఎటుపోతోందో అర్థం కావడం లేదు.

ఈ వార్తలు కూడా చదవండి...

టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం: హోంమంత్రి అనిత

మంత్రి నారా లోకేశ్‌పై ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశంసలు..

Updated Date - Feb 19 , 2026 | 01:25 AM