Share News

Denial of Justice: న్యాయభంగం

ABN , Publish Date - Jan 07 , 2026 | 02:44 AM

బెయిల్‌ కాదు, జైలే.. సుప్రీంకోర్టు తేల్చేసింది. ఉమర్‌ ఖాలిద్‌, షర్జీల్‌ ఇమామ్‌ పట్ల న్యాయస్థానం ఇంతకఠినంగా ఉండటం, బెయిల్‌ నిరాకరించడం హక్కుల ప్రేమికుల నుంచి...

Denial of Justice: న్యాయభంగం

బెయిల్‌ కాదు, జైలే.. సుప్రీంకోర్టు తేల్చేసింది. ఉమర్‌ ఖాలిద్‌, షర్జీల్‌ ఇమామ్‌ పట్ల న్యాయస్థానం ఇంతకఠినంగా ఉండటం, బెయిల్‌ నిరాకరించడం హక్కుల ప్రేమికుల నుంచి న్యాయకోవిదుల వరకూ అందరినీ ఆశ్చర్యపరిచింది. మిగతా ఐదుగురికీ కఠినషరతులతోనైనా బెయిల్‌ వచ్చినందుకు ఉమర్‌ సంతోషిస్తున్నాడు. ఇక జైలే నా జీవితం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు నిరాశ కాదు. ఈ సర్వస్వతంత్ర, సర్వసత్తాక, ప్రజాస్వామ్యదేశంలో వ్యవస్థలు ఎంత స్వతంత్రంగా ఉన్నాయన్న అవగాహన అది.

సుప్రీంకోర్టుకు మిగతావారికంటే వీరిద్దరూ ప్రమాదకారులనిపించింది. ప్రణాళికాబద్ధంగా, ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా జనసమీకరణ చేసి, అల్లర్లకు మార్గనిర్దేశనం చేశారన్న ప్రాసిక్యూషన్‌ వాదనను కోర్టు తన బెయిల్‌ నిరాకరణకు ఆధారంగా చూపింది. ఏడాది తరువాత కొత్తగా బెయిల్‌ దరఖాస్తు చేసుకోవచ్చునని అంతపెద్ద కుట్రదారులకూ కోర్టు వెసులుబాటు ఇచ్చింది. ఏడాదిలోగా సాక్షుల వ్యవహారం ముగింపునకు వస్తుందనో, లేదా ఏడాది తరువాత బెయిల్‌ ఇవ్వగల అవకాశాలు కొత్తగా పెరుగుతాయనో కోర్టు అనుకుంటోందా? బెయిల్‌ దక్కడానికి వారు జైల్లో గడిపిన ఈ ఐదేళ్ళకాలం రాజ్యాంగపరంగా కనీసార్హతగా సరిపోదా, అందుకు మరో ఏడాది గడువు ఏమైనా ఉందా? తెలియదు. మళ్ళీ రండి చూద్దాం అన్నంతమాత్రాన అదేమాట మళ్ళీ మళ్ళీ అనరన్న నమ్మకమేమీ లేదు. అందుకే ఉమర్‌ తన జీవితభాగస్వామితో ఆ మాటన్నాడు.


‘ఊపా’ మోపిన నిందితులందరినీ ఏకరీతిన చూడకుండా, బెయిల్‌ అంశాన్ని సామూహికంగా నిర్ణయించకుండా వీరిద్దరినీ వేరుపెట్టి సుప్రీంకోర్టు విభిన్నంగా వ్యవహరించడం న్యాయకోవిదులను సైతం ఆశ్చర్యపరిచింది. బెయిల్‌ దశలో సుదీర్ఘ విచారణలు, ఆధారాల తవ్వకాలు అంతగా అక్కరలేదని, నేరం తీవ్రతని ఉపరితలంలో గ్రహించి, సులభంగా బెయిల్‌ ఇవ్వాలన్నది సర్వోన్నత న్యాయస్థానం గతంలో పలుమార్లు నొక్కివక్కాణించిన న్యాయం. ఇప్పుడు అదే కోర్టు ఐదేళ్ళపాటు విచారణ లేకుండా జైల్లో మగ్గినంతమాత్రాన బెయిల్‌ ఇవ్వాలన్న నియమం ఏమీ లేదు పొమ్మన్నది. విచారణ ముందుకు సాగకపోవడం రాజ్యాంగ నియమాలు, విలువల ఉల్లంఘనగా కాక, ఒక సాంకేతిక తప్పిదంగా కోర్టు భావిస్తున్నట్టుంది. సెప్టెంబరులో ఢిల్లీ హైకోర్టు నిందితులపట్ల కఠినంగా వ్యవహరించినప్పుడు, ఉమర్‌ భాగస్వామి ఎంతో నమ్మకంగా తమకు ఇక సుప్రీంకోర్టే దిక్కని అన్నారు. బెయిల్‌ నియమం, జైలు మినహాయింపు అనే సూత్రం ఊపా వంటి కఠిన చట్టాలకు, ఉగ్రవాద కేసులకు కూడా వర్తిస్తుందని సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసి, కొందరికి బెయిల్‌ కూడా ఇచ్చింది. నేర స్వభావంతో నిమిత్తం లేకుండా నిందితుడి బెయిల్‌ హక్కును కాపాడవలసిందేనని నొక్కివక్కాణించింది. అందువల్ల, ఈ కేసులో నిందితులు అనుభవించిన ఐదేళ్ళ ముందస్తు జైలుశిక్షకు కోర్టు మనసు కరుగుతుందని అనుకున్నారు. కానీ, ‘ఊపా’లో బెయిల్‌ ఎంత కష్టమో తెలుసా అని సుప్రీంకోర్టు ఇప్పుడు మళ్ళీ కొత్త పల్లవి అందుకుంటోంది.

సమీపకాలంలో విచారణ పూర్తికాబోదన్న నిజం తెలిసికూడా న్యాయస్థానాలు నిందితుల ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. నిందితులు దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనీ, సంఘవిద్రోహశక్తులనీ ప్రభుత్వ వ్యవస్థలన్నీ ఏకమాటగా వాదిస్తున్నప్పుడు, మిగతావారంతా నమ్ముతున్నప్పుడు ఆ సత్యాన్ని రుజువుచేసే ప్రక్రియ ఇంకా ఆరంభం కాకపోవడం ఆశ్చర్యం. ఐదేళ్ళుగా విచారణ జరపకుండా, బెయిల్‌ మంజూరు చేయకుండా, దోషులుగా నిరూపించకుండా, నేరనిర్ధారణకు ముందే శిక్షలు అనుభవించేట్టుగా చేయడంలో ప్రభుత్వం పై చేయి సాధించింది. దిగువకోర్టులో ఎదురుదెబ్బలు అటుంచితే, సుప్రీంకోర్టులో పలు రకాల కారణాలతో ఒకే ఏడాదిలో పదిహేనుసార్లు ఉమర్‌ బెయిల్‌ పిటిషన్‌ పరిశీలనకు దూరంగా ఉండిపోయిన చరిత్ర ఉంది. చివరకు, తనకు తానుగా ఆయన ఆ అభ్యర్థనను ఉపసంహరించుకొని, ఇతరత్రా వాదనలతో, కారణాలతో మళ్ళీ దిగువ నుంచి పోరాటం మొదలుపెట్టి, ఇదిగో ఇప్పుడు మళ్ళీ పెద్దకోర్టు చేతిలోనే ఎదురుదెబ్బ తిన్నాడు. బెయిల్‌ నిరాకరించిన సుప్రీంకోర్టు ఇప్పటికైనా, నిర్దిష్టకాలపరిమితిలోగా విచారణ ముగిసేట్టుగా చర్యలు తీసుకోవాలి.

ఇవీ చదవండి:

హైకోర్టును ఆశ్రయించిన రకుల్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్.. అందుకేనా?

కవిత కాంగ్రెస్‌లో చేరినా ఆశ్చర్యమేమీ లేదు: మల్‌రెడ్డి రంగారెడ్డి

Updated Date - Jan 07 , 2026 | 02:44 AM