బాధ్యులు ఎవరు?
ABN , Publish Date - Jun 04 , 2026 | 12:51 AM
దేశ రాజధాని ఢిల్లీలోని మాల్వీయనగర్‌లో బుధవారం ఉదయం ఒక హోటల్‌లో జరిగిన అగ్నిప్రమాదం అత్యంత దురదృష్టకరమైనది. దేశ ప్రజలను కలచివేసిన ఈ ఘటనలో పాతికమంది సజీవంగా...
దేశ రాజధాని ఢిల్లీలోని మాల్వీయనగర్‌లో బుధవారం ఉదయం ఒక హోటల్‌లో జరిగిన అగ్నిప్రమాదం అత్యంత దురదృష్టకరమైనది. దేశ ప్రజలను కలచివేసిన ఈ ఘటనలో పాతికమంది సజీవంగా దహనమయ్యారు, మరో ముప్పైమంది వరకూ ఆస్పత్రులలో ప్రాణాలతో పోరాడుతున్నారు. బేస్‌మెంట్‌లో ఉన్న రెస్టారెంట్‌లో రేగిన మంటలు స్వల్పవ్యవధిలో మొత్తం ఐదంతస్థుల భవనాన్ని చుట్టుముట్టడంతో ఈ ఘోరం సంభవించింది. కమ్ముకొచ్చిన మంటలు, దట్టమైన పొగవల్ల పైన గదుల్లో ఉన్నవారు అక్కడే చిక్కుబడిపోయారు. ప్రాణాలు కాపాడుకోవడానికి పైనుంచి దూకేసిన కొందరు ఎముకలు విరిగి, వెన్నెముక దెబ్బతిని తీవ్రంగా గాయపడ్డారు. దీనికి మూడు రోజుల ముందు, దక్షిణ ఢిల్లీలోని సాకేత్ మెట్రోస్టేషన్ సమీపంలో ఒక భవనం కూలి పలువురు విద్యార్థులు మరణించారు. అత్యంత అవమానకరమైన ఘటనలు ఇవి.
ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడల్లా నాయకుల సంతాపాలు వెల్లువెత్తుతాయి, కొందరు అధికారులు సస్పెండ్ అవుతారు, బాధిత కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారాన్ని ప్రకటిస్తాయి, జరిగిన ఘోరంలో దాగిన రహస్యాలను ఛేదించేందుకు ఉన్నతస్థాయి కమిటీలు ఏర్పాటవుతాయి. కానీ, ఈ తరహా ఘటనల్లో అత్యధికం ప్రమాదాలు కాదు. అధికారులు, పాలకులు చేయీచేయీ కలిపి సాగిస్తున్న అవినీతి, నిర్లక్ష్యం, కుమ్మక్కుల పర్యవసానం ఇవి. అక్రమ నిర్మాణాలు వర్ధిల్లుతూంటే, భద్రతా ప్రమాణాలు దిగజారిపోతూంటాయి. జవాబుదారీతనం కొరవడుతుంది. వెల్లువెత్తిన ప్రజాగ్రహం సైతం చల్లారిపోతుంది. అంతిమంగా, వ్యవస్థాగత మార్పులేమీ జరగవు కనుక, అవే విషాదాలు పునరావృతమవుతాయి. మాల్వీయనగర్‌లోని ఐదంతస్థుల ఆ వసతి గృహానికి ఒకే దారిగుండా రాకపోకలు సాగుతున్నాయి. ‘బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్’ విధానంలో నడుస్తున్నట్టుగా చెబుతున్న ఈ వసతిలో ఆరు డబుల్ బెడ్ రూములకు మాత్రమే అనుమతి ఉండగా, పాతిక గదుల్లో పర్యాటకులు, సమీపంలోని ఒక అతిపెద్ద ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నవారి బంధువులు ఉంటున్నారు. ప్రమాదం జరిగి, అనేకమంది ప్రాణాలుపోయిన తరువాత వెలుగుచూసే నిబంధనల ఉల్లంఘనలు ఈ ఘటనలోనూ అనేకం. ఫైర్‌సేఫ్టీ అనుమతులు, బేస్‌మెంట్‌లో వంటలు, ప్రమాదం జరిగిన సందర్భాల్లో సులువుగా తప్పించుకోగల మార్గాలు ఇత్యాది విషయాల్లో డొల్లతనం బయటపడింది.
సాకేత్ మెట్రో సమీపంలో శనివారం కూలిన భవనం పాతదేమీ కాదు. కానీ, మూడంతస్థులకు అనుమతి ఉండగా, ఇప్పటికే ఐదంతస్థులు కట్టిన సదరు భవనం యజమాని, డబ్బు సంపాదనకోసం మరో అంతస్థు వేస్తూంటే అది పేకమేడలాగా కూలింది. పక్కనే ఉన్న కోచింగ్ ఇనిస్టిట్యూట్స్‌లో శిక్షణ తీసుకుంటూ, ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్‌కు సిద్ధమవుతున్న విద్యార్థులు చదువుకోసం వచ్చి ప్రాణాలు కోల్పోయారు. భవనం ఎత్తు అక్రమంగా పెంచుతున్నారంటూ కొందరు ఫిర్యాదు చేసిన మేరకు మూడునెలల క్రితమే ఢిల్లీ పోలీసులు వివిధ ప్రభుత్వ విభాగాలకు లేఖలు రాసినా, ఫలితం లేకపోయిందట. ఒకపక్క పైన బరువు పెంచడంతో పాటు, బేస్‌మెంట్‌లో సంప్ విస్తరణకోసం జరిపిన తవ్వకాలు పునాదినే బలహీనపరచాయి. మన దేశంలో వివిధ రకాల భవనాలు కూలి ఏటా సగటున 2,700 మంది వరకూ మరణిస్తున్నారు. వీటిలో డబ్బు వెదజల్లి అక్రమంగా నిర్మిస్తున్నవీ, నిబంధనలను ఉల్లంఘిస్తున్నవే అధికం. భవనాలు కూలి మరణిస్తున్నవారి సంఖ్య ఢిల్లీలోనే ఎక్కువ. దేశ వాణిజ్య రాజధాని కూడా ఈ విషయంలో తీసిపోలేదు. డబ్బు కోసం అడ్డుతోవలు తొక్కుతున్న బిల్డర్లు, భవన యజమానులకు అన్ని విధాలా అండదండలు అందించే అధికారులకూ, వీరిని రక్షించే నాయకులకు ఈ దేశంలో కొదువ లేదు. కూలిన భవనాలకు అనుమతులు ఇచ్చిన అధికారుల ఇళ్ళలో సోదాలు చేస్తే, డబ్బు, బంగారంతో పాటు, డెవలపర్లతో ఉన్న బంధాలు కూడా బయటపడుతూంటాయి. నిర్మాణస్థలాన్ని ఎన్నడూ సందర్శించకుండానే, కట్టిన భవనం నివాసయోగ్యమా కాదా అన్నది పరీక్షించకుండానే సంతకాలు చేసే అధికారులు ఈ దేశంలో అనేకులు ఉన్నారు. ఒక భవనం కూలిన తరువాత కొందరు అధికారులు పేరుకు సస్పెండ్ అయినా, త్వరలోనే తిరిగి కొలువులో చేరగలిగే మార్గాలు అనేకం. పార్కింగుకో, స్టోరేజీకో ఉపయోగించాల్సిన పెద్దపెద్ద భవనాల బేస్‌మెంట్‌లలో ఏకంగా రెస్టారెంట్లే నడుస్తున్న ఈ దేశంలో, విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపినవారిని నరహంతకులుగా గుర్తించి, త్వరితంగా శిక్షిస్తే తప్ప పరిస్థితిలో మార్పురాదు.
ఇవి కూడా చదవండి..
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం
కాంగ్రెస్‌కు రాజ్యసభ సీటు కేటాయించిన విజయ్ టీవీకే