Share News

ఎల్‌నినో వేళ దీపావళి

ABN , Publish Date - Nov 03 , 2026 | 04:03 AM

దీపావళి సందర్భంగా ఢిల్లీ–ఎన్‌సిఆర్‌ ప్రాంతంలో ఈ నెల 7, 8 తేదీల్లో బాణాసంచా కాల్చుకోవడానికి సుప్రీంకోర్టు సరేనన్నది. ఈ రెండురోజులూ ఉదయం ఓ గంట, రాత్రి రెండుగంటలు...

ఎల్‌నినో వేళ దీపావళి

దీపావళి సందర్భంగా ఢిల్లీ–ఎన్‌సిఆర్‌ ప్రాంతంలో ఈ నెల 7, 8 తేదీల్లో బాణాసంచా కాల్చుకోవడానికి సుప్రీంకోర్టు సరేనన్నది. ఈ రెండురోజులూ ఉదయం ఓ గంట, రాత్రి రెండుగంటలు ఢిల్లీవాసులు ఆనందంగా గ్రీన్‌క్రాకర్స్‌ కాల్చుకోవచ్చు. మర్నాటినుంచి మళ్ళీ పూర్తి నిషేధం అమలులోకి వస్తుంది. సిఎస్‌ఐఆర్‌, పెసో ధ్రువీకరణ పొందిన క్రాకర్స్‌ మాత్రమే అమ్మాలి, కొనాలి, లడీలు, బేరియం లవణాలున్న టపాసులకు స్థానం లేదు. ఆస్పత్రులు, నర్సింగ్‌హోమ్‌లు, ఆరోగ్యకేంద్రాలు, వృద్ధాశ్రమాలు, నోటిఫైడ్‌ సైలెన్స్‌ జోన్ల చుట్టూ మూడువందల మీటర్ల పరిధిలో బాణాసంచా కాల్చకూడదు. షరతులతో కూడిన ఈ అనుమతి మెచ్చదగిందే కానీ, ఇందులో అత్యధికం గతంలోనూ ఉన్నవే, ఉల్లంఘనలకు గురవుతున్నవే.

కేవలం నిర్దిష్ట సమయాల్లో బాణాసంచాను అనుమతించడం ద్వారా వాయునాణ్యత పడిపోకుండా ఉంటుందని కోర్టు భావించినట్టుంది. సాధారణ టపాసులకంటే భిన్నమైన ఫార్ములాతో తయారయ్యే గ్రీన్‌క్రాకర్స్‌ ఓ ముప్పైశాతం తక్కువ కాలుష్యాన్ని విడుదల చేయడంతో పాటు, పర్యావరణానికీ, ఆరోగ్యానికీ హానిచేసే ప్రమాదకరమైన రసాయనాలు వీటిలో దాదాపుగా ఉండవు. బాణాసంచా తయారీదారుల, విక్రయదారుల ఉపాధినీ, పండుగ సందర్భాన్ని పరిగణనలోకి తీసుకుంటూ కోర్టు మధ్యేమార్గాన్ని ఎంచుకుంది. అయితే, ఇదేమీ కొత్తకాదు, ఎనిమిదేళ్ళ క్రితమే సుప్రీంకోర్టు సాధారణ టపాసులను, లడీలను నిషేధించి, గ్రీన్‌క్రాకర్స్‌ను ముందుకు తెచ్చింది. ఆ మినహాయింపు కూడా దుర్వినియోగం అయిందన్న సత్యాన్ని అటుంచితే, విపక్షంలో ఉన్నప్పుడు టపాసుల విషయంలో కేజ్రీవాల్‌ ప్రభుత్వం మీద ఒంటికాలిమీద లేచిన బీజేపీ ఢిల్లీలో తాను అధికారంలోకి రాగానే అప్పటివరకూ అమలులో ఉన్న పూర్తిస్థాయి నిషేధాన్ని నీరుగార్చేందుకు కంకణం కట్టుకుంది. పూర్తినిషేధం వల్ల ఆశించిన ఫలితాలు రాలేదని, నిషేధం ఉన్నకాలంలో కూడా ఢిల్లీ కాలుష్యస్థాయి బాగా ఉందని, ఇందుకు సరిహద్దుల ఆవలనుండి అక్రమంగా తరలివచ్చిన సాధారణ టపాసులే కారణమని, పూర్తి నిషేధం ఉన్నపక్షంలో జనం గ్రీన్‌క్రాకర్స్‌ కూడా కొనుగోలు చేయలేకపోయారని కోర్టు ఇప్పుడు అభిప్రాయపడింది. వాయుకాలుష్యాన్ని పరిష్కరించడానికి పూర్తి నిషేధం ఉపకరిస్తుందా? అన్నది నిగ్గుతేల్చే సైంటిఫిక్‌ డేటా ఏమీ సంబంధిత వ్యవస్థలు కోర్టుముందు ఉంచకపోవడం ఇందుకు ప్రధాన కారణం.


సర్టిఫైడ్‌ గ్రీన్‌క్రాకర్స్‌ను అనుమతిస్తూ మరిన్ని కఠినమైన నిబంధనలను కోర్టు ఈ మారు సూచించింది. ప్రతీ బాక్సుమీద క్యూఆర్‌ కోడ్ ఉండాలంటూ క్షణాల్లో సదరు ఉత్పత్తి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోగలిగే వీలుకల్పించింది. వ్యాపారుల సెక్యూరిటీ డిపాజిట్లు గణనీయంగా పెంచి, ఉల్లంఘన జరిగితే డిపాజిట్‌ మొత్తాన్ని ప్రభుత్వం జప్తుచేయగలిగే అవకాశం ఇచ్చింది. అయితే, గతంలో గ్రీన్‌క్రాకర్స్‌ అంటూ సాధారణ టపాసులే అధికంగా అమ్ముడయ్యేవన్నది వాస్తవం. ధర ఎక్కువ గ్రీన్‌క్రాకర్స్‌ కంటే, సాధారణ టపాసులవైపు ప్రజలు కూడా మొగ్గుచూపడం సహజం. అందువల్ల, ఈ కొత్త నిబంధనలు సైతం క్షేత్రస్థాయిలో సవ్యంగా అమలయ్యేట్టు చూడటం, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి దొంగచాటుగా వచ్చే టపాసులను అడ్డుకోవడం అధికారులకు ఇప్పుడూ పరీక్షే. అలాగే, ఢిల్లీ అంతటా కేవలం రెండుగంటలే క్రాకర్స్‌ కాల్చాలన్న నియమం అమలు కావడం కూడా కష్టమే. గతంలోనూ ఏ గడువులూ, వేళపాళలు అమలు కాలేదు. తన గత ఆదేశాలన్నీ ఆచరణకు దూరంగా ఉండిపోయాయని, సవ్యంగా అమలుకాలేదని కోర్టే అంటోంది. కానీ, టపాసుల పూర్తి నిషేధంతో బ్లాక్‌మార్కెట్‌ పెరిగిందని, పైగా నిషేధమూ అమలు కాలేదన్న ప్రాతిపదికతో న్యాయస్థానం ఇప్పుడు మినహాయింపు ఇచ్చినప్పటికీ, పోలీసులు, అధికారులు, వ్యాపారుల కలసికట్టు కుట్రలను ఛేదించడం, కాలినవీ, పేలినవీ గ్రీన్‌క్రాకర్సేననని నిర్థారించడం సాధ్యమేనా? అన్నది ప్రశ్న. దీపావళి దీపాల పండుగ మాత్రమే, టపాసులను నియంత్రించని పక్షంలో పిల్లలు, వృద్ధులు, రోగులు తీవ్రంగా ఇబ్బంది పడతారు, ప్రజారోగ్యం దెబ్బతింటుందని వ్యాఖ్యానించిన న్యాయస్థానం కఠినంగా ఉంటూ, ఢిల్లీవాసులను ఆ దిశగా చైతన్యపరచే బాధ్యత ప్రభుత్వంమీద పెట్టివుంటే బాగుండేది. ఈ ఎల్‌నినో శీతాకాలం ఢిల్లీలో అతి ప్రమాదకరంగా ఉండవచ్చునని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలూ అర్థం చేసుకుంటారు.

ఈ వార్తలూ చదవండి

మురసు తుఫాన్ ఎఫెక్ట్.. విజయవాడ డివిజన్‌లో పలు రైళ్ల రద్దు

మురసు తుఫాన్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్‌డీఎంఏ

Updated Date - Nov 03 , 2026 | 04:03 AM