Share News

ఇదేమి న్యాయం..?

ABN , Publish Date - Jul 08 , 2026 | 05:21 AM

సాక్షాత్తూ సర్వోన్నత న్యాయస్థానమే స్పష్టంగా చెప్పాక, నేను మాత్రం బెయిల్‌ ఎలా ఇవ్వగలను? అంటూ ఉమర్‌ ఖాలిద్‌, షర్జీల్‌ ఇమామ్‌ల విజ్ఞప్తిని ఢిల్లీ కోర్టు ఇటీవల తోసిపుచ్చింది. బెయిల్‌ హక్కు గురించి..

ఇదేమి న్యాయం..?

సాక్షాత్తూ సర్వోన్నత న్యాయస్థానమే స్పష్టంగా చెప్పాక, నేను మాత్రం బెయిల్‌ ఎలా ఇవ్వగలను? అంటూ ఉమర్‌ ఖాలిద్‌, షర్జీల్‌ ఇమామ్‌ల విజ్ఞప్తిని ఢిల్లీ కోర్టు ఇటీవల తోసిపుచ్చింది. బెయిల్‌ హక్కు గురించి బహిరంగ వేదికల మీద న్యాయమూర్తులు చేసే అద్భుతమైన ప్రసంగాల స్ఫూర్తి వారి తీర్పుల్లో మాత్రం ప్రతిఫలించదు. బెయిల్‌ నియమం, జైలు మినహాయింపు అనే సూత్రం ఊపా వంటి కఠిన చట్టాలకు, ఉగ్రవాద కేసులకు కూడా వర్తిస్తుందని గతంలో స్పష్టం చేసిన సుప్రీంకోర్టు వీరిద్దరి విషయంలో మాత్రం ఆర్నెల్లక్రితం నిర్దయగా వ్యవహరించింది. బెయిల్‌ కాదు, జైలే.. అని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ తీర్పు ఇప్పుడు ఢిల్లీ కోర్టుకు ఆదర్శమైంది. విచారణలో ఉన్న ఖైదీలకు ఏదో కారణంతో బెయిల్‌ ఇవ్వకుండా దిగువ కోర్టులు నిర్దయగా వ్యవహరిస్తున్నాయని సుప్రీంకోర్టు చాలాసార్లు బాధపడింది. ఇప్పుడు ఢిల్లీ కోర్టు బెయిల్‌ తిరస్కరణ తరువాతైనా, ఒక నేరంలో దోషిగా తేలకుండా కేవలం నిందితుడన్న ఆరోపణతో ఒక వ్యక్తిని ఎంతకాలం జైల్లో కొనసాగించవచ్చునో సుప్రీంకోర్టు లెక్కతేల్చడం మంచిది.

వీరిద్దరూ పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్లకు పరిశీలనార్హత లేదని, పరిస్థితుల్లో అప్పటికీ ఇప్పటికీ ఏ మార్పూ లేనప్పుడు వాటిని పరిశీలించడం సాధ్యం కాదని ఢిల్లీ కోర్టు ప్రకటించింది. ఆరేళ్ళుగా నిర్బంధంలో ఉన్న వీరిద్దరినీ బయటకు రాకుండా అలాగే ఉంచేందుకు ఎగువ, దిగువ న్యాయస్థానాలన్నీ ఏవేవో కారణాలు వెతుకుతున్నాయి. సమీపకాలంలో విచారణ పూర్తవుతుందన్న సూచనలూ లేవు. ఈ పాటికే ఆరోపణలు రుజువుచేసి, అసరమైతే శిక్షలు కూడా వేయాల్సి ఉండగా, ఆరేళ్ళుగా అక్రమంగా నిర్బంధించింది చాలక, అదేపనిగా బెయిల్‌ను కూడా తిరస్కరిస్తూపోవడం అమానుషం. న్యాయ ప్రక్రియలో ఉద్దేశపూర్వక జాప్యం వీరికి కనీస హక్కులు దక్కకుండా చేస్తున్నది. సాక్షుల విచారణ పూర్తయ్యేవరకూ లేదా సంవత్సరంపాటు బెయిల్‌ ఊసెత్తకండి అని జనవరిలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం ఢిల్లీ కోర్టుకు శిరోధార్యమైంది. కుట్రపూరితంగా జనసమీకరణ చేసి, అల్లర్లకు మార్గనిర్దేశనం చేశారన్న ప్రాసిక్యూషన్‌ వాదనను సుప్రీంకోర్టు తన బెయిల్‌ నిరాకరణకు ఆధారం చేసుకుంది. ఏడాదిలోగా సాక్షుల వ్యవహారం పూర్తవుతుందని నమ్మిందో, లేదా ఏడాది తరువాత కచ్చితంగా పరిస్థితుల్లో మార్పు వచ్చి బెయిల్‌ ఇవ్వగలిగే అవకాశాలు పెరుగుతాయని అనుకుందో తెలియదు కానీ, మళ్ళీ రమ్మంటూనే అప్పటికి తిరగ్గొట్టింది. బెయిల్‌ ఇవ్వడానికి వీరిద్దరూ జైల్లో మగ్గిన ఆ సుదీర్ఘకాలం సర్వోన్నత న్యాయస్థానానికి కనీసార్హతగా కనిపించలేదు. బెయిల్‌ దశలో కేసు లోతుపాతుల్లోకి పోనక్కరలేదు, ఉపరితలంలో చూసి ఇచ్చేయవచ్చు అని గతంలో పలుమార్లు వాక్రుచ్చిన న్యాయస్థానమే, ఐదేళ్ళపాటు విచారణ లేకుండా చీకట్లో మగ్గినంతమాత్రాన బెయిల్‌ ఇవ్వాలన్న నియమం ఏమీ లేదు పొమ్మన్నది.


ఈ తీర్పు ఢిల్లీ కోర్టుకు ఆధారమైంది కానీ, మే నెలలో సయ్యద్‌ ఇఫ్తికార్‌ అద్రాబీ కేసులో సుప్రీంకోర్టు మరో ధర్మాసనం ఇందుకు పూర్తిభిన్నమైన, ఎంతో విలువైన తీర్పును ప్రకటించింది. ఐదేళ్ళుగా విచారణలేకుండా జైల్లో మగ్గుతున్న ఓ కశ్మీరీకి బెయిల్‌ ఇవ్వడమే కాక, దిగువకోర్టుల నుంచి సర్వోన్నత న్యాయస్థానం వరకూ ఎన్నో పర్యాయాలు వేడుకున్నా షర్జీల్‌ ఇమామ్‌, ఉమర్‌ ఖాలిద్‌లకు ఆరేళ్ళుగా బెయిల్‌ దక్కక జరుగుతున్న అన్యాయాన్ని సైతం జస్టిస్‌ నాగరత్న, ఉజ్జల్‌ భుయాన్‌ ధర్మాసనం గుర్తించింది. అరవింద్‌కుమార్‌, జారియా సారథ్యంలోని సుప్రీంకోర్టు బెంచ్‌ జనవరిలో వీరిద్దరికీ బెయిల్‌ ఇవ్వకపోవడాన్ని కూడా ఈ తీర్పులో ఇద్దరు న్యాయమూర్తులూ తప్పుబట్టారు. 2021లో కె.ఎ.నజీబ్‌ కేసులో ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్‌ ఇచ్చిన ఉదారమైన తీర్పునూ, మార్గదర్శకాలను జనవరినాటి తీర్పు బేఖాతరు చేసిందని ప్రకటించారు. బెయిల్‌ను ఒక రాజ్యాంగ నియమంగా పేర్కొంటూ, ఖైదీల జీవించే హక్కును పరిరక్షించాల్సిన బాధ్యతను తెలియచెప్పిన ఐదేళ్ళనాటి ఆ తీర్పునీ, అందులోని స్ఫూర్తిని పట్టించుకోకుండా సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుకు ఇప్పుడు ఢిల్లీ కోర్టు కట్టుబడటంతో ఈ ఇద్దరు ఖైదీలకు మరోమారు బెయిల్‌ దక్కకుండా పోయింది. రాజకీయంగా సున్నితమైన కేసుల్లో న్యాయస్థానాల తూకం నిర్బంధం వైపే మొగ్గుతూండటం విచారకరం.

ఈ వార్తలు కూడా చదవండి..

సింగరేణికి తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌ కేటాయింపు.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం

రూ.15 విలువైన ఆర్డర్‌కు రూ.500 టిప్పు.. డెలివరీ బాయ్ రియాక్షన్ వీడియో వైరల్

Updated Date - Jul 08 , 2026 | 05:21 AM