Share News

గవర్నర్ల వితండం

ABN , Publish Date - Jan 23 , 2026 | 01:55 AM

అప్పట్లో జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ విపక్షపాలిత రాష్ట్రాల గవర్నర్లందరికీ ఆదర్శం. పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌గా ఆయన కనబరిచిన అపారమైన ‘ప్రతిభాపాటవా’లకు మెచ్చి ఢిల్లీ పెద్దలు...

గవర్నర్ల వితండం

అప్పట్లో జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ విపక్షపాలిత రాష్ట్రాల గవర్నర్లందరికీ ఆదర్శం. పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌గా ఆయన కనబరిచిన అపారమైన ‘ప్రతిభాపాటవా’లకు మెచ్చి ఢిల్లీ పెద్దలు ఆయనకు పదోన్నతి కల్పించారన్న నమ్మకం వీరిది. ఆయనను మించి తమ శక్తిసామర్థ్యాలను నిరూపించుకోవడానికి ప్రస్తుతం వీరంతా తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి దారిలో నడుస్తూ శక్తివంచనలేకుండా కృషి చేస్తున్నారు.

కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో గురువారం గందరగోళం చోటుచేసుకుంది. మొదటిరోజు ఉభయసభలనూ ఉద్దేశించి ప్రసంగించాల్సిన గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లౌత్‌ రెండేరెండు ముక్కల్లో ప్రసంగాన్ని ముగించేశారు. సభ్యులందరికీ శుభాకాంక్షలు చెప్పి, ఆ తరువాత రాష్ట్రాన్ని ఆర్థికంగా, సామాజికంగా, భౌతికంగా అభివృద్ధిపరచడానికి ప్రభుత్వం కట్టుబడివుందని ఓ వాక్యాన్ని పూర్తిచేసి, జైహింద్‌, జై కర్ణాటక అంటూ ప్రసంగం ముగించి సభ నుంచి నిష్క్రమించారాయన. దీంతో అధికార కాంగ్రెస్‌ సభ్యులు గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసి తమ నిరసన ప్రకటించారు. ఒక పక్షానికి ప్రజాసమస్యలుగా కనిపిస్తున్న అంశాలు మరోపక్షానికి రాజకీయం అనిపించడం సహజం. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని సమూలంగా మార్చివేసి, దాని స్థానంలో కేంద్రప్రభుత్వం తెచ్చిన జీ రామ్‌జీ పథకం మీద ఈ సమావేశాల్లో చర్చించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించుకుంది. కొత్త పథకంతో పేదలకు అన్యాయం జరుగుతుందని, రాష్ట్రాలపై అదనపు ఆర్థికభారం పడి పంచాయితీలకు నిర్ణయాధికారం పోతుందని కాంగ్రెస్‌ చేస్తున్న వాదనను తాను అధికారంలో ఉన్నది కనుక ఈ సమావేశాల్లో చెప్పుకోవాలనుకుంది. ఇందుకు ప్రతిగా సీఎం, డీప్యూటీ సీఎం నాయకత్వపోరు సహా పలు అంశాలతో కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టడానికి బీజేపీ సిద్ధపడింది. ఈ రాజకీయపోరులో గవర్నర్‌ భాగస్వామి కావాల్సిన అవసరం లేదు. మంత్రివర్గం ఆమోదించిన ప్రతిని యథాతథంగా చదవాల్సిన రాజ్యాగబద్ధమైన స్థానంలో ఉన్న ఆయన కేంద్రం మీద విమర్శలు కారణంగా చూపి చదవడం మానివేయడం సరికాదు. ప్రసంగ ప్రతులను ఆక్షేపించే అధికారం గవర్నర్‌కు లేదు. క్యాబినెట్‌ ఆమోదించిన ప్రతిని కాక, తనకు నచ్చిన ఓ రెండు మాటలు వల్లించి సభ నుంచి వెళ్ళిపోయిన గవర్నర్‌ మీద సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని సిద్దరామయ్య అంటున్నారు.


తమిళనాడు, కేరళలోనూ ఇవే దృశ్యాలు ఇటీవల చూశాం. తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి ప్రసంగం చదవకుండా సభనుంచి వెళ్ళిపోయారు. స్టాలిన్‌ ప్రభుత్వం తయారుచేసిన ఈ ప్రసంగపాఠంలో అతిశయోక్తులు నిరాధారమైన ఆరోపణలు ఉన్నాయని లోక్‌భవన్‌ ఆరోపణ. కేరళ గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ ఆర్లేకర్‌ ప్రసంగాన్ని చదివారు కానీ, రెండు పేరాల్లో లేని వాక్యాలను చేర్చి, ఉన్నవాటిని సరిదిద్ది ఆయా అంశాలను తనకు నచ్చినట్టుగా మార్చుకున్నారు. ఆ మార్పులతో ప్రభుత్వం చెప్పదల్చుకున్నదానికి భిన్నమైన అర్థం వచ్చిందని ముఖ్యమంత్రి పినరాయ్‌ విజయన్‌ సభకు వివరించారు. ఆరిఫ్‌ మహ్మద్‌ఖాన్‌తో విజయన్‌ ప్రభుత్వం సాగించిన పోరాటం తెలిసిందే. గత ఏడాది ఫిబ్రవరిలో తమిళనాడు గవర్నర్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు తీవ్రవ్యాఖ్యలు చేసింది. ఆర్డినెన్సులు నిలిపివేయడం, బిల్లులపై సంతకాలు చేయకుండా, తిప్పిపంపకుండా, రాష్ట్రపతికి నివేదించకుండా నిరవధికంగా అటకెక్కించడం వంటి దుశ్చర్యలమీద విపక్షపాలిత రాష్ట్రాలు సుప్రీంకోర్టుకు వరుసకట్టిన సందర్భాల్లో న్యాయమూర్తులు ఘాటుగా మాట్లాడారు. చివరకు విసిగిపోయి, గవర్నర్ల వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లుల గడువు మూడునెలలు దాటితే అవి ఆమోదం పొందినట్టుగా భావించాలని సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు వెలువరించింది. అయితే, రాష్ట్రపతి గట్టిగా నాలుగు ప్రశ్నలు అడిగేసరికి కోర్టు చల్లబడిపోయి ఆ అద్భుతమైన తీర్పును వెనక్కుతీసుకుంది. హక్కులు అధికారాల పేరిట ప్రస్తుత దుర్మార్గవిధానమే కొనసాగాలని పాలకులు కోరుకుంటున్నారు. తమకు నచ్చినట్టుగానే ప్రసంగాలు రాయాలని, లేనిపక్షంలో చదవడం మానివేయడమో, అక్కడ లేనిదానిని చదవడమో, ఉన్నదానిని పూర్తిగా మార్చివేయడమో తప్పదని ఈ ముగ్గురు గవర్నర్లూ తేల్చిచెబుతున్నారు. రాజ్యాంగం ప్రతినిధులుగా, సమన్వయకర్తలుగా, సంధానకర్తలుగా ఉండాల్సిన వారు కేంద్రం కనుసన్నల్లో నడిచే ఏజెంట్లుగా, పార్టీ కార్యకర్తల్లాగా వ్యవహరించడం ఆ ఉన్నతమైన వ్యవస్థకు అప్రదిష్ట తెస్తున్నది. ప్రజాస్వామ్యవ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానిదే పైచేయి. దానిని గౌరవించి, రాజ్యాంగబద్ధంగా నడుచుకోవడం గవర్నర్‌ విధి.

Also Read:

అవును.. మా దగ్గర రహస్య ఆయుధాలు ఉన్నాయి.. షాకింగ్ న్యూస్ చెప్పిన అమెరికా అధ్యక్షుడు..

మీ బ్రెయిన్‌కు సూపర్ టెస్ట్.. ఈ ఫొటోలో జిరాఫీ ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Jan 23 , 2026 | 01:55 AM