Share News

వారూ ఎదగాలి!

ABN , Publish Date - Aug 27 , 2026 | 04:43 AM

వాతావరణ మార్పు ఒక మిథ్య అని ఎవరూ భావించడం లేదు. ఎండ, వానల వైపరీత్యాలను చవిచూస్తున్నందున అది వాస్తవమేనని అందరూ అంగీకరిస్తున్నారు. అయితే ఆరోగ్య సంక్షోభాల వెనుక...

వారూ ఎదగాలి!

వాతావరణ మార్పు ఒక మిథ్య అని ఎవరూ భావించడం లేదు. ఎండ, వానల వైపరీత్యాలను చవిచూస్తున్నందున అది వాస్తవమేనని అందరూ అంగీకరిస్తున్నారు. అయితే ఆరోగ్య సంక్షోభాల వెనుక ఆ ప్రాకృతిక విపత్తు పరోక్ష ప్రభావాన్ని మనం అర్థం చేసుకుంటున్నామా? పిల్లల్లో ఎదుగుదల లోపంపై కొత్త పరిశోధనలు ఆ నిగూఢ ప్రభావాన్ని నిర్ధారించాయి. భావి తరాల బాలలకు ఎదుగుదల లోపం అనే ఆరోగ్య ముప్పు మరింత ఎక్కువగా వాటిల్లవచ్చని కూడా ఆ వైద్యశాస్త్ర అధ్యయనాలు సూచిస్తున్నాయి.

పిల్లలు తమ వయసుకు తగినంత ఎత్తు లేకపోవడమే ఎదుగుదల లోపం (స్టంటింగ్‌).. వాతావరణ విపత్తులు, పేదరికం, ఆహార కొరత మూలంగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది బాలల శారీరక ఎదుగుదల సక్రమంగా ఉండడం లేదు. అటువంటి వారిలో బుద్ధి వికాసం అసంపూర్ణంగానే ఉండడం కద్దు. బతుకు బాటల్లో ముందుకు సాగేందుకు అవసరమైన నైపుణ్యాలను వారెలా సమకూర్చుకోగలుగుతారు? సమాజ పురోగతికి వారు దోహదం చేయలేరు. అయితే ఆ దురదృష్ట వంతుల పట్ల కరుణాత్మక దృక్పథంతో వ్యవహరించవల్సిన బాధ్యత సమాజానికి ఉన్నది. ఇది నైతిక నిర్దేశం మాత్రమే కాదు, మన రాజ్యాంగ ఆదేశం కూడా.

ఐదేళ్ల వయసు లోపు భారతీయ బాలల్లో 35శాతం మంది ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. 2006లో 48శాతంగా ఉన్న ఈ పిల్లలు 2018 నాటికి 35శాతానికి తగ్గిపోయారు. గణనీయమైన ఈ తగ్గుదల తరువాత కూడా ఎదుగుదల లోపించిన బాలల సంఖ్య మన దేశంలో నాలుగున్నర కోట్లకు పైగానే ఉన్నది! ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం స్టంటెడ్‌ బాలల్లో మూడోవంతు మంది భారత్‌లోనే ఉన్నారని ఐక్యరాజ్యసమితి నిర్ధారించింది. వీరిలో సగం మందికి పైగా కేవలం నాలుగు రాష్ట్రాల– బిహార్‌ , మధ్యప్రదేశ్‌ , ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర–లో ఉన్నారు. తెలుగునాట వీరి సంఖ్యామానం తెలంగాణ రాష్ట్ర్టంలో 33శాతం కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 31శాతంగా ఉన్నది. దేశవ్యాప్తంగా షెడ్యూల్డ్‌ కులాల బాలల్లో 39శాతం, షెడ్యూల్డ్‌ తరగతుల బాలల్లో 42శాతం మంది ఎదుగుదల లోపంతో అవస్థలు పడుతున్నవారేనన్నది ఒక కఠోరసత్యం. పోషకాహారం విషయంలో ప్రపంచ ప్రమాణాలలో బాగా వెనుకబడి ఉన్న మన దేశంలో ఎదుగుదల లోపించిన బాలలు పెద్ద సంఖ్యలో ఉండడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఇప్పటికే ప్రజారోగ్యానికి సవాల్‌గా ఉన్న పిల్లల్లో శారీరక ఎదుగుదల లోపం తీవ్రత వాతావరణ మార్పు పర్యవసానాలతో మరింతగా విషమిస్తోంది.


అమెరికాలోని నోట్రే డేమ్‌ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు నిర్వహించిన అధ్యయనాలలో ఐదేళ్ల వయసులోపు శిశువుల ఎదుగుదలపై వాతావరణ మార్పు ప్రతికూల ప్రభావం చూపుతున్నదని నిర్ధారించింది. 34 ఆఫ్రికన్‌ దేశాలలో పదహారు సంవత్సరాల పాటు నిర్వహించిన అధ్యయన ఫలితాల విశ్లేషణలో మానవ ప్రేరిత ఉష్ణోగ్రత వ్యత్యాసాలలో 1శాతం సెంటీగ్రేడ్‌ హెచ్చుదల పిల్లల్లో ఎదుగుదల లోపం 3.45శాతం పెరుగుదలకు దారితీసిందని వెల్లడయింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఆహార భద్రత, నీటి లభ్యతకు అంతరాయం కలిగిస్తాయి. అంటు వ్యాధులను వ్యాపింపచేస్తాయి. తద్వారా వాతావరణ మార్పు ప్రభావాలు పిల్లల శారీరక ఎదుగుదలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయి. కరువు కాటకాలు, వరదలు మొదలైన వాతావరణ వైపరీత్యాల కారణంగా జింబాబ్వే గ్రామీణ ప్రాంతాల్లో రెండు సంవత్సరాల వయసులోపు పిల్లలు ఇంచుమించు రెండు సెంటీమీటర్ల ఎదుగుదలను కోల్పోయారని కూడా నోట్రే డేమ్‌ పరిశోధకులు కనుగొన్నారు. చాలా ఆఫ్రికా దేశాలలో ఉన్న సామాజిక ఆర్థిక పరిస్థితులు మన దేశంలోనూ చాలా ప్రాంతాలలో ఉన్నాయనే వాస్తవం విస్మరించలేనిది.

శారీరక ఎదుగుదలే లోపించిన బాలల దైన్యతను కరుణాంతరంగంతో చూడవలసిన అవసరముంది. ఏ కారణాల వల్ల వారికాస్థితి దాపురించిందన్నది స్పష్టమే. మొదటి కారణం పోషకాహారం లోపించడమే కాదూ? ‘తిండి కలిగితే కండ కలదోయ్‌ / కండ కలవాడేను మనిషోయ్‌’ అన్న గురజాడ మాట జాతికి ఆరోగ్య సూత్రాన్ని నిర్దేశించింది. ‘ఈసురోమని మనుషులుంటే/ దేశమే గతి బాగుపడునోయ్‌’ అన్న ఆ మహాకవి ప్రశ్నకు నేటి మన ప్రభుత్వాలు నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలు, న్యూట్రిషన్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్స్‌; అమలుపరుస్తున్న రాష్ట్రీయ బాల్‌ స్వాస్థ్య, పోషణ్‌ అభియాన్‌ మొదలైన కార్యక్రమాలు ఒక సముచిత సమాధానమని భావించవచ్చు. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ గురజాడ దేశభక్తి గీతాన్ని ఉటంకించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఇప్పుడు తమ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలుపరుస్తున్న సంక్షేమ, వికాసాలలో ఏదైనా ఒకదానికి ఆ మహాకవి పేరు పెట్టడం మరింత సముచితంగా ఉంటుంది. జాతీయ సమైక్యతా భావమూ మరింత పటిష్ఠమవుతుంది.

ఈ వార్తలనూ చదవండి:

ఆకస్మిక వరదలు అందుకే.. నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి

నేపాల్ ఎంబసీ కీలక ప్రకటన.. దిగువ ప్రాంతాలకు అలర్ట్..

Updated Date - Aug 27 , 2026 | 04:43 AM