అదే జరుగుతోంది
ABN , Publish Date - Apr 08 , 2026 | 02:07 AM
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడానికి గతనెలలో విపక్షపార్టీలు ఇచ్చిన నోటీసులను ఉభయసభల అధిపతులూ....
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడానికి గతనెలలో విపక్షపార్టీలు ఇచ్చిన నోటీసులను ఉభయసభల అధిపతులూ తిరస్కరించారు. 130మంది ఎంపీల సంతకాలతో ఉన్న నోటీసును లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, 63మంది ఎంపీల సంతకాలతో అందిన నోటీసును రాజ్యసభ చైర్మన్ తిరస్కరిస్తూ, పార్లమెంట్‌లో సీఈసీపై అవిశ్వాసానికి అంగీకరించలేదు. జ్ఞానేశ్ కుమార్ భారతీయ జనతాపార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారన్న ఆరోపణతో, ఏడు అభియోగాలతో ఇండియా కూటమి పక్షాలు గతనెలలో ఇచ్చిన ఈ రెండు వేర్వేరు నోటీసుల్లో, ఆయనను తక్షణమే పదవినుంచి తొలగించాల్సి ఉన్నదని కోరాయి. సీఈసీని తొలగించడానికి ఉద్దేశించిన ప్రక్రియలో రాజకీయ కారణాలకు, నిరాధారమైన ఆరోపణలకు తావులేదన్నది ఉభయసభాపతుల నిర్ణయం సారాంశం.
జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలన్న డిమాండ్ వెనుక రాజకీయం ఉన్నదని అధికారపక్షం భావించడంలో తప్పేమీ లేదు. విపక్షపార్టీలు ఇచ్చిన నోటీసులను తిరస్కరించే అధికారం సభాధ్యక్షులదే. అయితే, జ్ఞానేశ్‌ను వెనకేసుకురావాల్సిన అవసరమైతే బీజేపీ నాయకులకు లేదు. ఆయన బీజేపీ పక్షాన వ్యవహరిస్తున్నారన్న ఆరోపణకు ఇది మరింత ఊతం ఇస్తుంది. ఒకవేళ నోటీసులను అనుమతించినప్పటికీ, తీర్మానాలు వీగిపోయేవే తప్ప, జ్ఞానేశ్ పదవికి వచ్చే నష్టమేమీ లేదు. అయితే, ఇండియా కూటమి నేతలు ఈ సందర్భంగా జరిగే చర్చను వినియోగించుకొని తీవ్రస్థాయిలో సీఈసీమీద విరుచుకుపడే ప్రమాదమైతే ఉంది. సీఈసీనీ, ఆయన దూకుడుగా అమలు చేస్తూ పోతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (సర్) ను విమర్శించడమే కాక, లక్షలాది ఓటర్ల తొలగింపు సహా ఆయన అధికారపక్షానికి ఏయే రకాలుగా సానుకూలంగా వ్యవహరించారో దుమ్మెత్తిపోసేందుకు ఇది అవకాశం ఇస్తుంది. సంఖ్యాబలం లేని కూటమిపార్టీలు అంతిమంగా జ్ఞానేశ్‌ను దించలేకపోయినా, వాడిగా దాడిచేసి ప్రజలకు తమవాదనను సమర్థంగా చేర్చవచ్చు. ఆయన పనితీరుమీద సభలో చర్చించడానికీ, ఆయనను పూర్తిగా తొలగించడానికి హస్తిమశకాంతరం ఉన్నదన్న విషయం విపక్షాలకూ తెలుసు. అయితే అవిశ్వాసం ద్వారా రాజకీయంగా పైచేయి సాధించాలన్న విపక్షాల యత్నాన్ని సభాపతులు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఆరంభానికి ముందే గండికొట్టారు.
సుప్రీంకోర్టు ఆదేశాలకు భిన్నంగా సీఈసీ ఎంపిక జరిగిందన్న అంశం సహా, బిహార్‌లో అతివేగంగా ‘సర్’ పూర్తిచేసే లక్ష్యంతో అనేక తప్పిదాలకు పాల్పడటం, ఎప్పటికప్పుడు మార్గదర్శకాలను మార్చుతూ పోవడం, సుప్రీంకోర్టు పలుమార్లు చెబితే కానీ ఆధార్‌ను ఒక ఆధారంగా ఓటుహక్కు నిరూపణకు అనుమతించకపోవడం వంటి ఆరోపణలు ఈ నోటీసుల్లో ఉన్నాయి. ఎన్నికలకు పోబోతున్న బెంగాల్‌లో ఓటరు జాబితాల ప్రక్షాళన హడావుడిగా, తీవ్రమైన ఒత్తిళ్ళమధ్య సాగుతూ, బీఎల్‌వోలు సైతం అనేకమంది ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితి వచ్చిందని విపక్షాలు పేర్కొన్నాయి. ఈ ఆరోపణల ఆధారంగా సీఈసీని తొలగించడం సరికాదని తెలియచెబుతూ ఉభయసభాపతులూ ప్రత్యుత్తరాలు ఇస్తున్నప్పుడే, బెంగాల్ ఓటర్ జాబితాల ప్రక్షాళనలో లక్షలాది ఓట్లు తొలగిపోయిన నిజమూ వెలుగుచూసింది. తొలివిడత పోలింగ్‌కు సంబంధించిన జాబితాలో అధికారికంగా ఇరవైఏడులక్షల పైచిలుకు ఓట్లను ఎన్నికల సంఘం తొలగించింది. ఈ మొత్తం ఓట్లలో సగానికిపైగా తొలగింపులు ముస్లింలు, దళితులు అత్యధికంగా ఉన్న ఐదు జిల్లాల్లో జరిగాయట. అత్యధిక తొలగింపులు జరిగిన జిల్లాలు తృణమూల్ కంచుకోటలన్నది మరో వివాదం. 27లక్షలమంది ఓటుహక్కు కోల్పోవడం ఈసీ అనుసరించిన ప్రక్రియమీద మరిన్ని విమర్శలకు తావిస్తోంది. సకాలంలో ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయకుండా, ఓటర్లు సమర్పించిన ఆధారాల పరిష్కారాన్ని జాప్యం చేయడం ద్వారా కొన్ని చోట్ల వారికి ఉద్దేశపూర్వకమైన అన్యాయం జరుగుతోందన్న ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి. తొలివిడత పోలింగ్ జాబితా తొలగింపుల లెక్కలు ఇలా ఉండగా, మలివిడత పోలింగ్ జాబితా తొలగింపులను సవాలు చేయగల అవకాశం ఇంకా ఉన్నప్పటికీ, ఈ ప్రక్రియ ఆరంభానికి ముందు ఉన్న ఓటర్ల సంఖ్యనుంచి మొత్తంగా ఓటుహక్కు కోల్పోబోయేవారిసంఖ్య అత్యధికంగా ఉండబోతోందన్నది సత్యం. పశ్చిమబెంగాల్‌లో రేపు ఏ పార్టీ గెలిచినప్పటికీ, తృణమూల్ మొదటినుంచీ చేస్తున్న విమర్శలకు అనుగుణంగా ఎన్నికల సంఘం లెక్కలు ఉండటం విషాదం.
ఇవి కూడా చదవండి:
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్
ఓటములకు బౌలర్లను మాత్రమే కారణంగా చూపొద్దు: క్లాసెన్