వెలుగు నీడలు
ABN , Publish Date - Jul 04 , 2026 | 01:02 AM
అమెరికా స్వాతంత్ర్య ప్రకటన (4 జూలై, 1776) ప్రజాస్వామ్య ప్రభాతం కాదు. క్రీస్తుపూర్వం రెండున్నర సహస్రాబ్దాల క్రితమే సిరియా, మెసొపొటేమియాలోని ప్రాచీన నాగరికతలలో ప్రజాస్వామ్య తొలి వెలుగులు...
అమెరికా స్వాతంత్ర్య ప్రకటన (4 జూలై, 1776) ప్రజాస్వామ్య ప్రభాతం కాదు. క్రీస్తుపూర్వం రెండున్నర సహస్రాబ్దాల క్రితమే సిరియా, మెసొపొటేమియాలోని ప్రాచీన నాగరికతలలో ప్రజాస్వామ్య తొలి వెలుగులు ప్రసరించాయి. రాజులు, మతాధికారుల చేతుల్లో అధికారం కేంద్రీకృతం కాకుండా నిరోధించేందుకు ఆ పురాతన సమాజాలు ప్రజా మండళ్లను నిర్మించాయి. ఇవే ప్రాచీన గ్రీసులో స్ఫూర్తిదాయకమైన ఏథెనియన్ ప్రజాస్వామ్యానికి ప్రాతిపదికలు అయ్యాయి. ఆ తొలి యుగాలలో భారత ఉపఖండంలో వర్ధిల్లిన గ్రామీణ గణతంత్రాలు కూడా ప్రజాస్వామ్య భావన, ఆచరణకు దోహదం చేశాయి. ప్రాతినిధ్య ప్రజాస్వామ్య తొలి పథగామి కావడమే అమెరికా విశిష్టత.
నిరంకుశ పాలనతో తమను అణచివేస్తున్న బ్రిటన్‌తో తెగతెంపులు చేసుకుంటూ ఉత్తర అమెరికా ఖండంలో అట్లాంటిక్ తూర్పు తీరంలోని పదమూడు వలస రాజ్యాలు 1776లో స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నాయి. థామస్ జెఫర్సన్ రచించిన అమెరికా స్వాతంత్ర్య ప్రకటన మానవహక్కుల తాత్వికతకు సుప్రసిద్ధమయింది. అమెరికా సంస్థాపన పత్రమైన ఆ ప్రకటన మానవులు అందరూ సమానులేనని ఉద్ఘాటించింది. స్వేచ్ఛాజీవనం, ఆనందాన్ని అన్వేషించి పొందడం అనేవి వారి ప్రాథమిక హక్కులు అని పేర్కొంది. ప్రతి ఒక్కరికి ఉన్న ఆ స్వతస్సిద్ధ హక్కులను పరిరక్షించడమే ప్రభుత్వాల పరమ కర్తవ్యమని ఆ స్వాతంత్ర్య ప్రకటన ఘోషించింది. పాలితుల ఆమోదం మేరకే పాలకులు ఎవరు అనేది నిర్ణయమవుతుందంటూ ప్రజాస్వామ్యానికి ఒక కొత్త విప్లవాత్మక నిర్వచనాన్ని ఇచ్చింది. ప్రజలను పాలితుల నుంచి పౌరులుగా మార్చింది. తద్వారా ప్రజాసార్వభౌమత్వాన్ని వ్యవస్థీకరించి సుస్థిరపరిచింది.
నేడు అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం. 1976లో అమెరికా ద్విశతాబ్ది ఉత్సవాల సమయంలో వెల్లువెత్తిన ఆనందోత్సాహాలు ఇప్పుడు అంతగా లేవు. ప్రపంచ వ్యవహారాలలో అమెరికా ప్రాభవ ప్రాబల్యాలు తగ్గి పోతుండడమే కాకుండా, దేశీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు స్వాతంత్ర్య ప్రకటన వాగ్దానాలు నెరవేరేందుకు తోడ్పడేవి కాకపోవడమే అమెరికన్ల నిర్లిప్తతకు కారణం. మానవులందరూ సమానులే అన్న స్వాతంత్ర్య ప్రకటన స్ఫూర్తి అమెరికా పాలనలో గానీ, సామాజిక జీవితంలో గానీ ప్రతి బింబించలేదు. సాక్షాత్తు అమెరికా సంస్థాపకులే బానిసత్వ వ్యవస్థను యథేచ్ఛగా కొనసాగించారు. ఆ అమానుష ఆచారాన్ని నిర్మూలించేందుకు దశాబ్దాలు పట్టింది. అంతర్యుద్ధం ప్రజ్వరిల్లి ఏడున్నర లక్షల మంది హతులైన తర్వాత గానీ బానిసత్వం రద్దు కాలేదు. అది రద్దయిన శతాబ్దానికిగానీ, ఆఫ్రికన్ అమెరికన్లు అయిన నల్ల జాతివారికి పౌరహక్కులు లభించలేదు. ఆనందసాధన ప్రతి ఒక్కరి హక్కు అని అంగీకరించినప్పటికీ ఆస్తుల యాజమాన్యానికి సంబంధించి చట్ట పరమైన రక్షణలు కల్పించలేదు. ఇలా సామాజిక, ఆర్థిక అసమానతలను ఉపేక్షించడాన్ని వివేచనాపరులు, మరీ ముఖ్యంగా అమానుష అణచివేతలకు గురైన నల్లజాతీయులు మొదటినుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. నల్ల జాతీయులకు జూలై 4 ఏమి ఇచ్చిందని నల్ల జాతి ప్రముఖుడు ఫ్రెడరిక్ డగ్లస్ 1852లోనే ప్రశ్నించారు. ఈ భూమండలం మీద సాటి మనుషుల రక్తంతో పాపపంకిలమైన జాతి అమెరికన్ జాతి మినహా మరొకటి లేదని ఆయన ఆనాడే గర్హించారు. 125 ఏళ్ల అనంతరం మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ కూడా ప్రపంచాన్ని హింసాగ్నులలో ముంచెత్తుతున్న ఏకైక దేశం అమెరికా అని నిరసించారు. ఈ విమర్శలు నేటి అమెరికాకు సైతం వర్తించేవిగా ఉన్నాయంటే అందుకు కారణం ఆ దేశ పాలక వర్గాలలో ఔదార్య స్వభావమూ, హృదయ వైశాల్యమూ తగ్గిపోవడం వల్లే కాదూ?
నిజాయితీపరులైన పెద్ద మనుషులు మాదిరిగా కంటే సంభావ్య దుష్టులుగానే మనుషులు ఎక్కువగా ఉంటారని, వారు ఎల్లవేళలా సద్గుణవంతులుగా వ్యవహరించేలా చేయలేము కనుక చెడుపనులకు పాల్పడడాన్ని అసాధ్యంచేసే పద్ధతులను కనుగొని తీరాలని ప్రజాస్వామ్యం భావిస్తుందని చైనీస్ రచయిత లిన్ యుటాంగ్ అంటారు. ఇంటా బయటా అటువంటి ప్రజాస్వామిక వివేకశీలతను పెంపొందించడం ప్రపంచపురాతన ప్రజాస్వామ్యవ్యవస్థ అయిన అమెరికా నైతిక కర్తవ్యం.
ఈ వార్తలనూ చదవండి:
దోషులను కఠినంగా శిక్షించాలి.. రామ్ మందిర్ విరాళాల వివాదంపై ఆర్ఎస్ఎస్..
గుజరాత్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్ ఏర్పాటుకు కుట్ర.. 8 మంది అరెస్ట్..