Share News

ముగ్గురి ముచ్చట్లు...!

ABN , Publish Date - Nov 21 , 2026 | 01:56 AM

మూడు అతిపెద్ద అణ్వాయుధ దేశాల అధినేతలు ఒకే వేదికమీదకు రావడం, ఎదురెదురుగా కూర్చొని గంటన్నరకు పైగా మాట్లాడుకోవడం ఒక వింత.

ముగ్గురి ముచ్చట్లు...!

మూడు అతిపెద్ద అణ్వాయుధ దేశాల అధినేతలు ఒకే వేదికమీదకు రావడం, ఎదురెదురుగా కూర్చొని గంటన్నరకు పైగా మాట్లాడుకోవడం ఒక వింత. రెండో ప్రపంచయుద్ధం తరువాత అమెరికా, రష్యా, చైనా అధినేతల తొలి త్రైపాక్షిక భేటీ ఇది. ఉక్రెయిన్‌ యుద్ధం, ఇరాన్‌ సంక్షోభం, ఎడతెరిపి లేకుండా సాగుతున్న వాణిజ్య యుద్ధాల కాలంలో ఈ అగ్రరాజ్యాధినేతల మధ్య నేరుగా సంభాషణ జరగడం ఒక కీలక ఘట్టం. ప్రపంచాధిపత్యం కోసం పోటీపడుతున్న రెండు ఆర్థికశక్తుల నుంచి పరస్పర సహకారం, ఇచ్చిపుచ్చుకోవడం వంటి మాటలు రావడం వినసొంపుగా ఉంటుంది. నాలుగు అంశాల ‘శాంతి ప్రకటన’ తాత్కాలికంగానైనా ఓదార్పునిస్తుంది.

ఈ మువ్వురి భేటీని ‘యాల్టా 2.0’ అన్నారు కొందరు. ఆర్భాటం ఎక్కువ, ఫలితం తక్కువ అని పెదవి విరిచారు మరికొందరు. రష్యా, చైనా అధ్యక్షులతో అమీతుమీ తేల్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నా, ట్రంప్‌ లక్ష్యం అది కాదు కాబట్టే ఈ భేటీ అంత ఘనంగా, సవ్యంగా సాగిపోయిందన్నవారూ ఉన్నారు. మధ్యంతర ఎన్నికల్లో ఎదురుదెబ్బతిని, ఇంట ఓడిన ఆయన రచ్చ గెలవాలనుకోవడం సహజం. మూడురోజుల ఆసియా పర్యటన, అందులో రెండు సదస్సులు, ఈ త్రైపాక్షిక భేటీ ఆయనకు ఉపశమనం కలిగిస్తాయి. జిన్‌పింగ్‌ ఆదరణ, ఆ హడావుడి, అట్టహాసం, వేలాదిమంది ఘనస్వాగతం తన పర్యటన విజయవంతమైందని చెప్పడానికి నిదర్శనాలన్నారాయన వెనక్కు తిరిగి వెడుతూ. ఇంతకు మించి ఆయన కోరుకున్నది ఏమీ లేదు. జిన్‌పింగ్‌ను ఆలింగనం చేసుకోవడం, పుతిన్‌ను క్లోజ్‌ఫ్రెండ్‌ అనడం అమెరికా రాజకీయ విశ్లేషకులకు మాత్రం ఆగ్రహం కలిగించింది. భౌగోళిక రాజకీయ ప్రత్యర్థులను ఇలా ఆకాశానికి ఎత్తేయడం, ఒక ప్రపంచవేదికమీద రష్యాను అమెరికాతో సమానం చేయడం విమర్శలకు తావిస్తోంది. మధ్యంతర ఎన్నికల్లో ఓడిన అమెరికా గతకాలపు అధ్యక్షులు కూడా ఇలా విదేశీపర్యటనలు చేసినవారే. అయితే, వ్యక్తిగతంగా కానీ, దేశానికి కానీ ఎక్కువకాలం ఆ ప్రయోజనాలు నిలబడలేదని కొందరు గుర్తుచేస్తున్నారు.

ఈ భేటీ వెనుక ఎవరి ప్రయోజనాలు వారివి. అమెరికా, రష్యా అధినేతలను పిలిచి, వారి మధ్య నిలబడి, ప్రపంచ రాజకీయాలకు తానే కేంద్రబిందువు అనిపించుకున్నారు జిన్‌పింగ్‌. అమెరికాతో ఘర్షణపడకుండా చైనా విస్తరణ, ఆధిపత్యం కొనసాగితే చాలు ఆయనకు. పాశ్చాత్యదేశాలన్నీ తనను ఒంటరి చేసినా, ఈ ఇద్దరితో సమానంగా గౌరవాన్ని అందుకుంటూ, రష్యా ఇప్పటికీ ఎప్పటికీ అగ్రరాజ్యమేనన్న గుర్తింపు పుతిన్‌కు దక్కింది. అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు పరిధిని కట్టడి చేయాలన్న అంశాన్ని ఉమ్మడి ప్రకటనలో చేర్చడం ఆయనకు మరింత ఓదార్పును ఇచ్చింది. ఇజ్రాయెల్‌ మాజీ ప్రధాని నెతన్యాహూకు కూడా ఈ హేగ్‌ కోర్టు అరెస్టు వారెంట్‌ జారీచేసింది కనుక ట్రంప్‌కు కూడా అదంటే ఎలాగూ గిట్టదు. ప్రపంచదేశాల ప్రయోజనాలు, చమురు ధరల స్థిరత్వం పేరిట చేసిన నిర్ణయాలు, ప్రమాణాలూ రష్యాకే అధికంగా ఉపకరిస్తాయి కనుక పుతిన్‌కు ఇక అడ్డంకులు లేనట్టే. రష్యా చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటున్న ఉక్రెయిన్‌కు ఇంధన భద్రత అన్నమాట ఒక హెచ్చరిక.


ఐదేళ్ళుగా సాగుతున్న ఉక్రెయిన్‌ యుద్ధం, ఏడాదికి చేరువవుతున్న ఇరాన్‌ యుద్ధం ఇటువంటి భేటీల తరువాత ముగిసిపోతాయన్న భ్రమ ఎవరికీ లేదు. కానీ, ప్రపంచశాంతినీ, భద్రతనూ పరిరక్షించడంలో తమకు ఒక ప్రత్యేక బాధ్యత ఉన్నదని ఈ ముగ్గురూ చెప్పుకోవడం, కట్టుబడతామని అనడం మంచిదే. అణుప్రమాదం, అణ్వస్త్రవ్యాప్తి నిరోధంమీద మరిన్నిసార్లు మాట్లాడుకోవాలనీ, కలవాలనీ సంకల్పించడం అవసరమే. దీనర్థం తమ దగ్గర ఇప్పటికే పోగుబడిన అణ్వస్త్రాలను తగ్గించుకుంటామని మాత్రం భ్రమపడనక్కరలేదు. ఐక్యరాజ్యసమితిని సంస్కరించి, ఆవిర్భావ లక్ష్యాలకు అనుగుణంగా దానిని తీర్చిదిద్దాలన్న ఆలోచన మంచిదే కానీ, భద్రతామండలిని విస్తరించి, కొత్త శాశ్వత సభ్యులకు సైతం సమాన వీటో హక్కులు దఖలుపరిచినప్పుడే ఆ ఆశయం నెరవేరుతుంది. కీలకమైన అంశాలపై ఏకాభిప్రాయానికి రావడం కష్టమైనప్పటికీ, సూత్రప్రాయంగా ఈ ముగ్గురూ దేని గురించి అయినా మాట్లాడుకోవచ్చు, ప్రమాదం లేదనుకున్నవాటిలో ఏకాభిప్రాయం సాధించవచ్చు. ఈ భేటీలో గొప్ప ఒప్పందాలు జరుగుతాయని, ఘనమైన ఫలితాలు వస్తాయని మిగతా ప్రపంచం కూడా అనుకోలేదు. అయితే, వైరుధ్యాలు తీవ్రంగా ఉన్న కాలంలో జరిగిన ఈ భేటీ పునాదిగా సంఘర్షణలతో నిండిన ఈ ప్రపంచానికి ఎంతోకొంత శాంతి చేకూరితే సంతోషించవలసిందే.

ఈ వార్తలనూ చదవండి:

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడి.. కస్టమర్ల సమాచారం లీక్!

ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్.. 37 గంటల మిషన్‌లో ఏం జరిగిందంటే..

Updated Date - Nov 21 , 2026 | 01:56 AM