సాధించిందేమిటి?
ABN , Publish Date - Oct 07 , 2026 | 02:12 AM
ఇరాక్‌పై అమెరికా దాడికి ఇరవై మూడేళ్ల తరువాత, ఇటీవలే చివరి విడత అమెరికన్ సైనికులు కూడా అక్కడినుండి తరలిపోయారు. వాషింగ్టన్ దీనిని తన సైనిక మిషన్ ముగింపు...
ఇరాక్‌పై అమెరికా దాడికి ఇరవై మూడేళ్ల తరువాత, ఇటీవలే చివరి విడత అమెరికన్ సైనికులు కూడా అక్కడినుండి తరలిపోయారు. వాషింగ్టన్ దీనిని తన సైనిక మిషన్ ముగింపు అన్నది. పూర్తి సార్వభౌమాధికారం దిశగా మరో అడుగు అన్నది ఇరాక్. సద్దాం హుస్సేన్ వద్ద సామూహిక మారణాయుధాలున్నాయన్న ఆరోపణతో ఈ దురాక్రమణ జరిగింది కనుక అవి మరి అమెరికాకు దొరికినట్టేనా? తన లక్ష్యం పరిపూర్ణమై అది దేశాన్ని విడిచిపోతోందా? పచ్చి అబద్ధాలతో ఒక దేశాన్ని దురాక్రమించి, దానిని సర్వనాశనం చేసి, మరింత ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టి, గాలికొదిలేయడం అమెరికాకు కొత్తేమీ కాదు. అఫ్ఘానిస్తాన్‌ను చేజేతులా తాలిబాన్‌కు అప్పగించిన అమెరికా ఇప్పుడు ఇరాక్‌లోనూ అదే చేస్తోంది.
తాత్కాలికంగా వెళ్ళినవాళ్ళం అక్కడ ఎలా ఉండిపోతామని ప్రశ్నిస్తూ, మిషన్ పూర్తయిందన్నారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. సద్దాం హుస్సేన్ పాలనను కూల్చివేయడం, ఆయన ప్రాణం తీయాలన్న కసి నెరవేరడమే ఆ మిషన్. కానీ, అమెరికా ప్రవేశం ఇరాక్ సర్వవ్యవస్థలను నాశనం చేసి, మతవిభేదాలను పెంచి, అంతర్గత యుద్ధాలకు దారితీసింది. ఇస్లామిక్ స్టేట్ వంటి ఉగ్రసంస్థల పుట్టుకకు కారణమైంది. లక్షలాది ఇరాకీల మరణంతోపాటు, ఇరాక్ తీవ్రంగా పతనమైంది. పదిహేనేళ్ళక్రితం అమెరికా ఇరాక్‌ను వదిలిపెట్టగానే, ఇస్లామిక్ స్టేట్ మోసుల్ నగరాన్ని ఆక్రమించి, రాజ్యాన్ని ప్రకటించుకోవడంతో మూడేళ్ళలోనే అమెరికా మళ్లీ యుద్ధరంగంలోకి ప్రవేశించాల్సి వచ్చింది. అమెరికా నేతృత్వంలోని కూటమి దెబ్బకు ఇస్లామిక్ స్టేట్ తన భూభాగాన్ని కోల్పోయినప్పటికీ, ఇరాక్‌లోని ఉగ్రవాద నెట్‌వర్క్‌లు, సాయుధ గ్రూపులు, ప్రాంతీయ వైరాలు, పెత్తనాలు నాశనం కాలేదు. ఇప్పుడు అమెరికా తన కాలు పూర్తిగా వెనక్కు తీసేసుకున్న నేపథ్యంలో, ఇరాక్ ప్రభుత్వం తన సొంత బలంతో ఈ సాయుధ గ్రూపులతో పోరాడగలదా? ఇస్లామిక్ స్టేట్ మళ్లీ బలపడి తలెగరేస్తే అది తట్టుకోగలదా? భవిష్యత్తు భద్రంగా ఉంటుందన్న నమ్మకం ఏ మాత్రం లేని ఈ స్థితిలో, అమెరికా సైన్యం వెళ్ళిపోవడంతో పూర్తి సార్వభౌమాధికారం దక్కిందన్న ఇరాక్ వ్యాఖ్యలు అర్థంలేనివి. ఒక పరిమిత సైనికవిజయంతో, నిజమైన రాజకీయ పరిష్కారమంటూ లేకుండా, మరిన్ని సమస్యలను సృష్టించి మరీ, ఇరాక్‌ను అమెరికా ఇప్పుడు దాని కర్మానికి దానిని వదిలేసింది.
సద్దాం హుస్సేన్ దగ్గర సామూహిక విధ్వంసక ఆయుధాలున్నాయని, ఆయన ఉనికి ప్రపంచానికి తీవ్ర ప్రమాదమన్న వాదనతో ఇరాక్ మీద అమెరికా దాడి జరిగింది. అటువంటి ఆయుధాలేమీ ఎప్పటికీ దొరక్కపోగా, అమెరికా, బ్రిటన్ కట్టుకథలతో ప్రపంచాన్ని మోసం చేశాయన్నది యుద్ధం మధ్యలోనే తేలిపోయింది. అయినా, అడ్డగోలు వాదనలతో అమెరికా ఆ దండయాత్రను కొనసాగించింది. ఆ తరువాత సద్దాం వాసనలను, బాత్‌పార్టీ మూలాలను సమూలంగా నిర్మూలించే పేరిట ఇరాక్ సైన్యాన్ని, అక్కడి ప్రభుత్వ వ్యవస్థలను కూడా నాశనం చేసింది. ఉపాధి కోల్పోయిన లక్షలాదిమంది మాజీ సైనికులు, కొత్త అధికార వ్యవస్థలో చోటుదక్కని బాత్ పార్టీ సభ్యులు, విభిన్న వర్గాలూ తెగలు వేర్వేరు శక్తులుగా తయారైనాయి. మత మిలీషియాలు అనేకం విస్తరించాయి. సద్దాం లేని ఇరాక్‌లో ఒక బలమైన ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయకపోవడంతో పాటు, ఉన్నవాటిని మిగలనివ్వని ఫలితం ఇది. తన భద్రత కోసం ఇరాక్ ఎల్లకాలం అమెరికా సైన్యాలమీద ఆధారపడలేదన్నది నిజమే. కానీ, అఫ్ఘానిస్తాన్‌లో జరిగింది ఏమిటో అందరం చూశాం. ఆ దేశం నుంచి మిగిలిన ఆ కాస్త అమెరికా సైన్యం అలా విమానాల్లో తరలిపోగానే, తాలిబాన్ విరుచుకుపడి అతి సులభంగా అధికారాన్ని వశం చేసుకుంది. సెప్టెంబర్ 11 ఘటన తరువాత అమెరికా చేసిన యుద్ధాల వల్ల యాభైలక్షల మంది మరణించారు, నాలుగుకోట్ల జనాభా నిరాశ్రయులైనారు. దురాక్రమణ చేసిన సైనికులు తరలిపోయినప్పటికీ, బాధితదేశం చాలా కాలం పాటు ఆ పర్యవసానాలను అనుభవిస్తూనే ఉంటుంది. ఇరాక్ యుద్ధం దుష్ప్రభావాలను పశ్చిమాసియా మాత్రమే కాక, యావత్ ప్రపంచం చవిచూసింది. ఇప్పుడు అమెరికన్ సైనికులు వదిలేసిన ఇరాక్ రేపటి రోజుల్లో ఏ విధంగా తయారవుతుందో చూడాలి.
ఈ వార్తలు కూడా చదవండి
నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఇద్దరి మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు..
మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం యువత ముందుకు రావాలి: గవర్నర్