కల్లోల ప్రయాణం
ABN , Publish Date - Aug 14 , 2026 | 03:34 AM
తమ పైలట్లందరికీ డోప్ టెస్ట్‌ను తప్పనిసరి చేస్తూ ఎయిర్ ఇండియా తీసుకున్న నిర్ణయం సరైనది. ఢిల్లీ–ఫుకెట్ విమానఘటన ఆ సంస్థ పరువుప్రతిష్ఠలను దెబ్బతీసిన నేపథ్యంలో, దిద్దుబాటుచర్యలకు ఉపక్రమించడం సహజం...
తమ పైలట్లందరికీ డోప్ టెస్ట్‌ను తప్పనిసరి చేస్తూ ఎయిర్ ఇండియా తీసుకున్న నిర్ణయం సరైనది. ఢిల్లీ–ఫుకెట్ విమానఘటన ఆ సంస్థ పరువుప్రతిష్ఠలను దెబ్బతీసిన నేపథ్యంలో, దిద్దుబాటుచర్యలకు ఉపక్రమించడం సహజం. డీజీసీఏ సూచించిన ర్యాండమ్ తనిఖీలకు అదనంగా, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో పనిచేస్తున్న మొత్తం ఐదువేలమంది పైలట్లకు ఫ్లైట్ బ్రీఫింగ్ సెంటర్లు, కార్యాలయాల్లో క్రమం తప్పకుండా ఈ డోప్‌టెస్ట్ నిర్వహించడానికి ఈ సంస్థ నిర్ణయించుకుంది. ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడవేసిన ఆగస్టు 4వతేదీ ఘటనను కేంద్రం తీవ్రంగా పరిగణించి సదరు సంస్థకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. దాదాపు నూటనలభైమంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్న ఆ విమానం తీవ్ర కుదుపులకు లోనుకావడమే కాక, హఠాత్తుగా మూడువందల అడుగులు కిందకు జారిన ఈ ఘటన అత్యంత తీవ్రమైనది. పాతికమంది గాయపడినప్పటికీ, ప్రయాణికులంతా క్షేమంగా ఇళ్ళకు చేరినందుకు సంతోషించాలి.
ఫుకెట్–ఢిల్లీ విమానం నడిపిన పైలట్లు ఇద్దరికీ నిర్వహించిన పరీక్షల్లో పైలట్ ఇన్ కమాండ్ గంజాయి సేవించినట్టుగా నిర్థారణ అయిందని అంటున్నారు. నిద్రలేమితో బాధపడుతున్న ఆ పైలట్ నిద్రమాత్రలు కూడా వాడుతున్నారట. ప్రయాణంలో విమానాన్ని కో–పైలట్‌కు అప్పగించి క్యాబిన్ వెలుపల ఓ అరగంటపాటు ఈ ప్రధాన పైలట్ కునుకుతీశాడట. అతడు తనకాళ్ళమీద తాను నిలబడలేని స్థితిలో ఉన్నాడంటూ, పైలట్ ప్రవర్తన మీద కూడా ప్రయాణికులు ఫిర్యాదు చేశారట. విధి నిర్వహణలో అతడి నిర్లక్ష్యం కానీ, వ్యవస్థాగత లోపాలతో దీనిని సాగనిచ్చిన ఆ సంస్థ క్షమార్హం కాని నేరాలు. ఈ ఘటనలో ఐదునిముషాల పాటు ప్రయాణికులు అనుభవించిన నరకం ఊహకు అందనిది. ప్రకృతి వైపరీత్యాలవల్లనో, సాంకేతిక కారణాలతోనో కాక, పూర్తి బాధ్యతారాహిత్యం, అలక్ష్యంతో జరిగిన ఘటన ఇది.
ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబి) విచారణలో సదరు పైలట్ స్థితిగతులు, విమానం మంచిచెడులతో పాటు మరిన్ని అంశాలు వెలుగులోకి రావచ్చు. అంతెత్తునుంచి ఒక్కసారిగా విమానం జారిపోవడానికి పైలట్ తప్పిదమా, సాంకేతిక సమస్యా, రెండూ కలగలసి ఈ ఘోరం జరిగిందా అన్నవి నిర్థారణ కావచ్చు. ప్రయాణికుల భద్రత కేవలం ఆధునిక విమానాలు, వాటి అధునాతన సాంకేతికతలపైనే పూర్తిగా ఆధారపడదని, కాక్‌పిట్‌లో ఉన్నవారి శారీరక, మానసిక ఆరోగ్యాలు, వారి బాధ్యతాయుత నడవడికలు అతిముఖ్యమని ఈ ఘటన తెలియచెబుతోంది. పైలట్ నిద్రమాత్రలే వేసుకున్నారా, గంజాయి కూడా మింగారా అన్నది అటుంచితే, అతడు సక్రమంగా విధులు నిర్వహించే స్థితిలో లేరన్నది వాస్తవం. తెలిసికూడా అతడు డ్యూటీచేయడం, దానిని ఆ సంస్థ నివారించలేకపోవడం సరికాదు. నిద్రమత్తుతోనో, మత్తుపదార్థాల ప్రభావంతోనో పైలట్లు విమానాలను నడపడం ఇటీవల హెచ్చింది. దాదాపు నాలుగోవంతుమంది ఈ స్థితిలోనే ఉంటున్నారని అధికారిక డేటా చెబుతోంది. ఈ నేపథ్యంలో, డీజీసీఏ తన నిబంధనలను మరింత కఠినతరం చేయాల్సిన అవసర ఉంది. ప్రతి ఎయిర్‌లైన్స్‌లోనూ కనీసం 10 శాతం మంది సిబ్బంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు ఏటా ఆకస్మికంగా డ్రగ్‌టెస్ట్ చేయాలని ప్రస్తుత నిబంధనలు చెబుతున్నాయి. దానివల్ల పెద్ద సంఖ్యలో మిగిలిన సిబ్బంది ఈ పరీక్షనుంచి తప్పించుకుంటున్నారు. అలాగే, డ్రగ్స్ పరీక్షలో తొలిసారిగా పాజిటివ్ వచ్చిన పైలట్లకు వెంటనే లైసెన్స్ రద్దు కావడమన్నది కూడా ఇక్కడ జరగడం లేదు. విదేశాల్లో చట్టబద్ధంగా లభించే కొన్ని మత్తుపదార్థాలను సమర్థవంతంగా గుర్తించే ప్రక్రియలోనూ లోపాలున్నాయని అంటారు. ఈ ఉదంతం ఎయిర్ ఇండియా స్క్రీనింగ్ విధానాలపై ప్రశ్నలు లేవనెత్తినప్పటికీ, పైలట్లు తమ నైతిక నియమావళిని ఉల్లంఘించడమన్నది కాస్త అటూఇటూగా అన్ని సంస్థల్లోనూ ఉన్నదే. దీనిని నియంత్రిస్తూ, పైలట్లకు తగినంత విశ్రాంతి దక్కేట్టుగా చూస్తూ అన్ని సంస్థలూ ప్రయాణికుల భద్రతకు అమిత ప్రాధాన్యం ఇవ్వాలి.
ఇవి కూడా చదవండి..
మావోయిస్టు క్యాంప్ నుంచి మోడలింగ్ ర్యాంప్ వరకు.. మారిన మాజీ మహిళా నక్సల్స్ జీవితాలు..
మీరు చేయలేకపోతే మేమే చేస్తాం.. లేబుల్స్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు హెచ్చరిక..