Share News

వందరోజుల విధ్వంసం

ABN , Publish Date - Jun 09 , 2026 | 12:50 AM

యుద్ధం ఆపండి అంటూ భారతదేశం పిలుపునివ్వడం సంతోషించవలసిన పరిణామం. ఇరాన్‌మీద అమెరికా, ఇజ్రాయెల్‌ చేస్తున్న యుద్ధానికి వందరోజులు నిండిన సందర్భాన్ని పురస్కరించుకొని, పశ్చిమాసియాలో...

వందరోజుల విధ్వంసం

యుద్ధం ఆపండి అంటూ భారతదేశం పిలుపునివ్వడం సంతోషించవలసిన పరిణామం. ఇరాన్‌మీద అమెరికా, ఇజ్రాయెల్‌ చేస్తున్న యుద్ధానికి వందరోజులు నిండిన సందర్భాన్ని పురస్కరించుకొని, పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్ళీ మొదటికొస్తున్న నేపథ్యంలో, భారత్‌ ఎంతో స్పష్టంగా ఉద్రిక్తతలను చల్లార్చుకొని, ఉభయపక్షాలు దౌత్యంతో వివాదాన్ని పరిష్కరించుకోవాలని కోరింది. మళ్ళీ పరస్పరం దాడులు ఆరంభించడం విచారకరమని, ఇప్పటికే అపారమైన బాధనీ, ఆర్థిక కష్టాలను, ఇంధన కొరతనూ కలిగించిన ఈ యుద్ధాన్ని సత్వరమే ముగించి, శాంతి, స్థిరత్వం తిరిగి నెలకొల్పేందుకు విశేష ప్రయత్నం జరగాలని భారత్‌ కోరింది. ఇరాన్‌ సైనిక సదుపాయాలమీద ఇజ్రాయెల్‌ ఆదివారం క్షిపణులతో విరుచుకుపడినందుకు ఇరాన్‌ ప్రతీకారదాడులు చేసిన విషయ తెలిసిందే. ఏప్రిల్‌లో కాల్పుల విరమణ ఒప్పందం అంటూ ఒకటి జరిగినప్పటికీ, అమెరికా ఆశీస్సులతో ఇజ్రాయెల్‌ దానిని వీసమెత్తు గౌరవించడంలేదు. హిజ్బొల్లాను నాశనం చేసే పేరిట ఇజ్రాయెల్‌ క్షిపణుల వర్షం కురిపిస్తూ, భారీ సైన్యంతో, ట్యాంకులతో దక్షిణ లెబనాన్‌లోకి చొరబడటం ఇరాన్‌కు ఆగ్రహం కలిగించి, చివరకు చర్చలనుంచి ఉపసంహరించుకున్నది. ఆ తరువాత నెతన్యాహూమీద ట్రంప్‌ కోపగించుకున్నారని, ఫోన్‌లో చెడామడా ఏకేశారని వార్తలు వచ్చాయి. యుద్ధాన్ని ఆపడానికి అమెరికా అధ్యక్షుడు ఎంతో శ్రమిస్తూంటే, నెతన్యాహూ తన దూకుడు వైఖరితో చర్చలను సాగనివ్వడం లేదని మిగతా ప్రపంచం అనుకోవాలి.

ఒప్పందానికి దగ్గరలో ఉన్నాం, దాడులు చేసుకోకండి అంటూ ట్రంప్‌ మరోమారు ఇరాన్‌, ఇజ్రాయెల్‌ను కోరడమే కాదు, ఇరాన్‌ దాడులకు ప్రతీకారం వద్దని కూడా ఇజ్రాయెల్‌ ప్రధానిని కోరారు. నేడో, రేపో, ఎల్లుండో... ఈ వారమే ఒప్పందం కుదరబోతోంది, పరస్పర దాడులు ఇక చాలు అని ఉభయపక్షాలనూ శాంతింప చేస్తూ ఆయన చెల్లుకుచెల్లు తరహా తీర్పు చెప్పారు. అమెరికా సైనిక స్థావరాలు, ఆస్తిపాస్తులు లక్ష్యంగా తీవ్రంగా విరుచుకుపడతామని ఘాటైన హెచ్చరికలు చేసిన ఇరాన్‌ తాత్కాలికంగా వెనక్కు తగ్గి, ఇజ్రాయెల్‌మీద దాడులు ఆపుతున్నట్టు ప్రకటించింది కూడా. అయితే, లెబనాన్‌మీద ఈగవాలినా ప్రతీకారం తప్పదన్న హెచ్చరికలు కొనసాగిస్తూనే ఉంది.


శాంతి ఒప్పందానికీ లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులకూ సంబంధం లేదన్న వాదనతో ఇరాన్‌ను లొంగదీసుకోవాలని అమెరికా ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆ విషయంలో రవ్వంత రాజీకీ కూడా ఇరాన్‌ సిద్ధంగా లేదు. లెబనాన్‌ మీద రెండువారాల పాటు ఇజ్రాయెల్‌ వీరంగాన్ని సహించి, పలు హెచ్చరికలు చేసిన తరువాతే ఇరాన్‌ చర్చలనుంచి ఉపసంహరించుకుంది. అయినా కూడా ట్రంప్‌, నెతన్యాహూ తమ నాటకాన్ని కొనసాగిస్తూనే వచ్చిన నేపథ్యంలో, దాదాపు రెండునెలల తరువాత ఇజ్రాయెల్‌పై అది మొన్న ప్రత్యక్షదాడులకు దిగింది. లెబనాన్‌ విషయంలో గీతదాటితే ఊరుకొనేది లేదనీ, ఇంతకాలం తాను చేసిన హెచ్చరికలు ఉత్తుత్తివి కాదని ఈ దాడితో ఇరాన్‌ స్పష్టంచేసింది. ఇజ్రాయెల్‌–హిజ్బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని ఏప్రిల్‌ 17న ట్రంప్‌ ప్రకటించినప్పటికీ, ఇజ్రాయెల్‌ తాను అనుకున్నదే చేసుకుపోతోంది. యెమెన్‌లోని హౌతీలను, లెబనాన్‌లోని హిజ్బొల్లాను, ఇరాక్‌, సిరియాల్లోని కొన్ని సాయుధ ముఠాలను కాపాడుకోవడం ఇరాన్‌ మనుగడకు అవసరం. హమాస్‌ను కోల్పోయిన తరువాత, హిజ్బొల్లాను సైతం రక్షించుకోలేకపోతే మిగతా గ్రూపులన్నీ ఇరాన్‌కు దూరమయ్యే, బలహీనపడే ప్రమాదం ఉంది. అందువల్ల, గీత దాటితే ఊరుకోను అని అది అమెరికా, ఇజ్రాయెల్‌లకు చెప్పదల్చుకుంది. యురేనియం నిల్వలు, హోర్ముజ్‌ ఇత్యాది అంశాల్లో ఇరాన్‌ వెసులుబాటు చూపితే, లెబనాన్‌లో ఇరాన్‌ ప్రయోజనాల పరిరక్షణ విషయంలో ట్రంప్‌ సర్దుకుపోతారన్న భయం నెతన్యాహూది. అందుకే, నిర్ణయాలు తీసుకొనేది నేనే, అతను కాదు అంటూ ట్రంప్‌ ఒకపక్క గర్జిస్తున్నా, నెతన్యాహూ తాను అనుకున్నదే చేసుకుపోతున్నారు. ఇదంతా తెరవెనుకనుంచి అమెరికా ఆడిస్తున్న నాటకం అని ఇరాన్‌ ఆగ్రహిస్తూ ఉంటుంది. శాశ్వత శాంతి సాధించే అవకాశాలు దాదాపు లేకున్నా, ఇరాన్‌–ఇజ్రాయెల్‌ పరిమితస్థాయిలో సంఘర్షించుకుంటున్నా, చర్చలు తిరిగి మొదలై, కొనసాగితే చాలు. ఇజ్రాయెల్‌ ప్రధానికి తప్ప ఎవరికీ మేలు చేయని ఈ యుద్ధం మిగతా ప్రపంచాన్ని ఇప్పటికే ముంచింది.

ఇవి కూడా చదవండి..

ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్న ఇండియా కూటమి నేతలు..

మోదీ పాలనలో రాజ్యాంగంపై దాడులు పెరిగాయి: ఏఐసీసీ చీఫ్ ఖర్గే..

Updated Date - Jun 09 , 2026 | 12:50 AM