ముసురుకుంటున్న ఆర్థిక సంక్షోభం
ABN , Publish Date - Jun 05 , 2026 | 01:22 AM
భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగారం తక్కువ కొనమనీ, పెట్రోలూ, వంట నూనెల వాడకం తగ్గించమనీ చెబుతూ పరోక్షంగానే భారతదేశం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని ప్రస్తావించారు. దరిమిలా డాలరుకు...
భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగారం తక్కువ కొనమనీ, పెట్రోలూ, వంట నూనెల వాడకం తగ్గించమనీ చెబుతూ పరోక్షంగానే భారతదేశం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని ప్రస్తావించారు. దరిమిలా డాలరుకు రూపాయి విలువ రూ.96కు చేరడం; పెట్రోల్‌పై అదనంగా రూ.6.50, వంట గ్యాస్ సిలిండర్ రూ.60, కమర్షియల్ సిలిండర్ రూ.993 పెరగడం, మరోవైపు స్టాక్ మార్కెట్ 5శాతం పడిపోవడం... వంటివి జరిగాయి. ఇరాన్‌పై యుద్ధం తరవాత మొదలైన ప్రపంచ సంక్షోభం ఇంటి గడప దాకా వచ్చిందన్న విషయం ప్రజలకు కూడా మెల్లగా అర్థం అవుతోంది.
రూపాయి విలువ అంతర్జాతీయంగా ఎంత ఉండాలి అన్న విషయంలో ఒక స్థిరమైన సిద్ధాంతమేమీ లేదు. మార్కెట్ నిర్ణయించిన ధర కరెక్ట్ అంటారు కొందరు. మార్కెట్ ధర అన్నది దీర్ఘకాలిక ఆర్థిక అవసరాలను దెబ్బతీస్తుంది అనేవాళ్ళూ ఉన్నారు. మార్కెట్‌లో ఆ ధరను కూడా ఎలా నిర్ణయిస్తారో చూస్తే ఆశ్చర్యమేస్తుంది. భారతదేశానికి విదేశీ మారకం మన ఎగుమతుల వల్లనూ, ప్రవాస భారతీయులు ఇంటికి పంపించిన డాలర్ల వల్లనూ, విదేశీ మదుపర్లు తెచ్చిన పెట్టుబడుల వల్లనూ, మన కంపెనీలు విదేశీ సంస్థల నుంచి అప్పుగా తెచ్చిన డాలర్ల వల్లనూ వస్తుంది. మరోవైపు, మనం కట్టాల్సిన దిగుమతుల బిల్లులు, విదేశీ పెట్టుబడిదారులు తిరిగి తీసుకువెళ్లే లాభాలు, ఇతర చెల్లింపుల కోసం డాలర్లకు డిమాండ్ ఏర్పడుతుంది. ఈ డిమాండ్, సరఫరా మధ్య సమతుల్యత ఆధారంగానే ఆ రోజు రూపాయి ధర నిర్ధారణ అవుతుంది. ఈ ధరను ఆర్బీఐ ప్రభావితం చేయగలదు. ఉదాహరణకు, ఈనాటికి ఆర్బీఐ వద్ద 700 బిలియన్ డాలర్ల నిల్వలు ఉన్నాయని సమాచారం. అందులో 250 డాలర్లు ఐఎమ్‌ఎఫ్ తాలూకు డిపాజిట్స్, వగైరాలు తీసేస్తే 400 బిలియన్ డాలర్లలో కొంతవరకు రూపాయిని స్థిరీకరించడానికి వాడుకోవచ్చు. నెలకు ఒక 30 బిలియన్ డాలర్ల చొప్పున రెండు మూడు నెలలు అమ్మి, రూపాయిని కాపాడే ఆస్కారం ఉందన్నది కొంతమంది నిపుణుల వాదన. కానీ ఇది స్వల్పకాలిక పరిష్కారమే. మరోపక్క ఆర్థికవేత్తలైన గీతా గోపీనాథ్, పానాగరియా, అరవింద్ సుబ్రమణియం, డి.సుబ్బారావు లాంటి వారు రూపాయి విలువను అంత కిందికి పడనివ్వబోమని చెబుతున్నారు. రేపు డాలరు– రూపాయి విలువ వందో, నూట ఇరవయ్యో అయితే పారిశ్రామిక రంగం కుదేలవుతుందన్న విషయం గురించి, ప్రజల మీద పడే భారం గురించి వీరు గమనిస్తున్నారో లేదో తెలీదు.
రూపాయి మారకం విలువను ఇప్పుడు రక్షించలేం. రూపాయి స్థిరంగా ఉండే పరిస్థితులు క్షీణించాయి. ఇది కేవలం ఇరాన్ యుద్ధం వల్ల వచ్చింది కాదు, గత పన్నెండేళ్లుగా ప్రభుత్వం ఆర్థిక రంగంలోని బలహీనతలను నిర్లక్ష్యం చేస్తూ వచ్చిన ఫలితం! ఎందుకంటే ఆసియా ఖండంలోనే ప్రస్తుతం మన దేశం అత్యంత బలహీనమైన పరిస్థితిలో ఉంది. ఎలాగంటే– మొదటిది, ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉన్నాయి. దిగుమతుల్లో ముఖ్యమైనవి ఎలక్ట్రానిక్స్, బంగారం, ఆయిల్ దిగుమతులు. ఎలక్ట్రానిక్స్‌ను అంత పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవడానికి కారణం అతి సులభమైన సెమీకండక్టర్లను కూడా మనం తయారు చేసుకోకపోవడం. కార్లు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, బైకులు, టీవీలు, కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు, డిఫెన్స్ ఉత్పత్తులు ఏమి తయారు చేసినా అందులో ఎలక్ట్రానిక్ విడి భాగాలు చైనా నుంచి దిగుమతి కావాల్సిందే. దీన్ని నివారించాలంటే ప్రభుత్వం ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని కొనుక్కుని ఇక్కడ ఆ పరిశ్రమలు పెట్టించి చేయిపట్టుకుని నడిపించాలి. అది చేయడానికి దానికి మన నాయకులకు తీరిక లేదు. పొద్దున లేస్తే... ఏ రాష్ట్రంలో ఎన్నికలు, ఎలా గెలవాలి అనే ఆలోచిస్తోంది ప్రభుత్వం.
విదేశీ పెట్టుబడి ఏమైనా ఎగుమతులను పెంచుతుందా అంటే, వాళ్లు మన దేశంలో ఉన్న గిరాకీ వాడుకుందామని చూసేవాళ్లే. ఇక బంగారం కొనుగోలు తగ్గించుకోవడం విషయానికి వస్తే– అక్షయ తృతీయ అని ఊదరగొట్టి ప్రతి పండగకూ బంగారం కొనుక్కోమని 30ఏళ్లుగా చెప్పి, ఇప్పుడు కొనుక్కోవద్దని చెబితే ఎవడు వింటాడు? ఇదిగాక, ద్రవ్యోల్బణం నుంచి ఆస్తి విలువను కాపాడుకోడానికి బంగారం ఒక పెద్ద మార్గం అయిపోయి కూర్చుంది. ప్రధానమంత్రే కాదు కదా, ఎవరు చెప్పినా ప్రజలు వినరు. బంగారం ఖరీదు పెరిగితేనే దాని కొనుగోలు తగ్గుతుంది. అప్పుడు బంగారం సామాన్య ప్రజలకు అందుబాటులో లేకపోతే వారికి వచ్చే కోపం మీద ప్రభుత్వాలకు భయం ఉంది. అలాగే పెట్రోల్, డీజిల్, గ్యాస్, సేంద్రియ ఎరువుల వాడకం తగ్గించుకోవాలంటే– ఎవరు తగ్గించుకోవాలి? రేపు ఆహారధాన్యాల ఉత్పత్తి పడిపోతే ఆ ధరల మంట మొదలవుతుంది. వీటన్నిటికీ మందు రూపాయి మార్కెట్ విలువ పడిపోనివ్వడమే అంటున్నారు కొందరు. దాని ప్రభావం వల్ల దిగుమతులు మరింత ప్రియమై ఉత్పత్తి/ వాడకం తగ్గి రూపాయి పడిపోవటం ఆగుతుంది అని ఒక చిన్న ఆశ. ఫలితంగా ఎకానమీ మందగించి గ్రోత్ రేట్ ఏ ఐదు శాతానికో పడిపోయినా తప్పదు. సామాన్యుల మీద పేదరికం, నిరుద్యోగ ప్రభావం ఎక్కువగా పడుతుంది. అంటే వికసిత భారత్ కూడా ఇప్పుడప్పుడే జరగదు.
నిజానికి భారత ఆర్థిక రంగంలో ఈ డోలాయమాన స్థితి ఈ ప్రభుత్వం రాక ముందు నుంచీ ఉంది. ద్రవ్య సంక్షోభం, బ్యాంకుల మొండి బకాయిలు, డీమానిటైజేషన్, కోవిడ్ లాంటి సంక్షోభాలన్నీ గత పదిహేనేళ్లుగా వస్తున్నాయి. మొదటి నుంచీ ఐటీ రంగం, పెట్రోకెమికల్స్, ఇంజనీరింగ్ వంటి కొద్ది రంగాల్లో పెరిగిన ఎగుమతుల ఆధారంగా, కరెంట్ అకౌంట్ డెఫిసిట్‌ను 2శాతం లోపే ఉంచుతూ, మిగిలిన అవసరాలకు అప్పులు తెచ్చుకుని దిగుమతులు చేసుకుందామనే వ్యూహంలోనే ఎంతో రిస్కు ఉంది. నిజానికి ఆర్థిక వ్యవస్థ పక్కాగా ఉందనీ, ధరలు అదుపులో ఉన్నాయనీ, ద్రవ్య లోటు కూడా అదుపులో ఉందనీ, కొంతమంది ఆర్థికవేత్తలు చెబుతున్నారు. కానీ ఈ సూచికలు ఒక మంచి పెరుగుదలను సూచించడానికి సరిపోవు. దేశంలో మధ్యతరగతి సేవింగ్స్ 37 నుంచి 27శాతం దిగువకు పడిపోతున్నాయి. ఎప్పుడూ లేని విధంగా వినియోగ వస్తువుల మీద ఖర్చు 5శాతం మేరకు పడిపోయింది. అసంఘటిత రంగం కుదేలైపోయి ఉంది. దేశంలో 80శాతం ప్రజల దగ్గర రోజుకు 3డాలర్ల ఆదాయం లేదు. అందువల్ల మన దేశం ఒక పెద్ద మార్కెట్ ఏమీ కాదు పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడిని ఆకర్షించడానికి. మన దేశంలో మానవ వనరుల నాణ్యత సంక్షోభంలో ఉంది. విద్య, వైద్యం, పరిశోధన, రవాణా, సాంకేతిక నైపుణ్యం, ఉత్పాదకత, ఉత్పత్తుల నాణ్యత, ఉపాధి అవకాశాలు దారుణంగా ఉన్నాయి. ఇవన్నీ రాష్ట్రాల పరిధిలోకి వస్తాయి. కానీ రాష్ట్రాల దగ్గర ఆదాయం లేదు. కేంద్రం ఇవ్వదు. దేశానికి ఎక్కువ ఆదాయం అందిస్తున్న దక్షిణాది రాష్ట్రాలతో బీజేపీ ప్రభుత్వ సహకారం రోజురోజుకూ దిగజారుతోంది. అన్నీ గుజరాత్ రాష్ట్రానికి పంచి ఇస్తోందన్నది సర్వత్రా వినిపిస్తున్న అభిప్రాయం. ‘మాక్సిమమ్ గవర్నెన్స్ మినిమం స్టేట్’ అన్న దగ్గర నుంచి ‘మాక్సిమమ్ పాలిటిక్స్ మినిమమ్ గవర్నెన్స్’ అనే స్థాయికి వచ్చింది పరిస్థితి. కళ్లు మూసుకుంటే ఈ తుపాను దాటిపోతుందనే ఉష్ట్రపక్షి తీరు ఈ దేశాన్ని నడిపించడానికి ఇంక పనికి రాదు.
ప్రొ. ఆర్.వి. రమణమూర్తి
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ
ఇవి కూడా చదవండి...
రెండేళ్లలో ఏం చేశామో ప్రజలకు వివరించండి.. మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశం
బలమైన భారత్ కోసం యువత ఎదురుచూపు: పవన్ కల్యాణ్
Read Latest AP News And Telugu News