Share News

రేవంత్‌ ప్రతిపాదన విప్లవాత్మకం!

ABN , Publish Date - Aug 04 , 2026 | 02:20 AM

స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో సార్వత్రిక వయోజన ఓటుహక్కు కల్పించడం భారత ప్రజాస్వామ్యానికి మొదటి బలమైన పునాది. అయితే 1988లో ఓటు హక్కు వయస్సును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించడం...

రేవంత్‌ ప్రతిపాదన విప్లవాత్మకం!

స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో సార్వత్రిక వయోజన ఓటుహక్కు కల్పించడం భారత ప్రజాస్వామ్యానికి మొదటి బలమైన పునాది. అయితే 1988లో ఓటు హక్కు వయస్సును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించడం మరో చారిత్రక ఘట్టం. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిపాదించిన శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలనే ఆలోచన కూడా జాతీయ స్థాయిలో చర్చించదగిన విప్లవాత్మక అంశం. ఈ ప్రతిపాదనను రాజకీయ వ్యాఖ్యగా చూడలేం. ఇది మన దేశ ప్రజాస్వామ్యం తదుపరి దశలోకి అడుగుపెట్టాలా లేదా అన్న ప్రాథమిక ప్రశ్నను దేశం ముందుంచుతోంది.

మన దేశంలో 21 ఏళ్ల యువకుడు దేశ భవిష్యత్తును నిర్ణయించే ఓటు వేయగలడు. గ్రామ సర్పంచ్‌గా, మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికల్లో పోటీ చేయగలడు. సైన్యంలో చేరగలడు, ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగాలకు పోటీపడగలడు. శాస్త్రవేత్త కాగలడు. కానీ అదే యువకుడు శాసనసభ లేదా పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేయడానికి మాత్రం మరో నాలుగేళ్లు వేచి ఉండాల్సి రావడం ఎంతవరకు సబబు?

స్వాతంత్ర్యానికి ముందు ప్రపంచంలోని అనేక దేశాలు ఓటు హక్కును ఆస్తి, విద్య, లింగం వంటి పరిమితులకు లోబడి ఇచ్చాయి. కానీ భారత రాజ్యాంగ నిర్మాతలు పేదరికం, నిరక్షరాస్యత ఉన్నా ప్రతి పౌరుడిపై విశ్వాసంతో సమాన ఓటు హక్కును అందించారు. ఆ తర్వాత, 1988లో ప్రధాని రాజీవ్‌గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయస్సును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించింది. అప్పట్లో కూడా ‘‘18 ఏళ్ల యువతకు రాజకీయ పరిపక్వత ఉంటుందా?’’ అని ప్రశ్నించినవారు ఉన్నారు. కానీ కాలం నిరూపించింది... ఆ నిర్ణయం భారత ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసిందని.

ప్రస్తుతం మన రాజ్యాంగంలో లోక్‌సభ సభ్యుని కనీస అర్హత వయస్సును నిర్దేశించే ఆర్టికల్ 84(బి), రాష్ట్ర శాసనసభ సభ్యుల అర్హతను నిర్దేశించే ఆర్టికల్ 173(బి) ప్రకారం పోటీ చేసే కనీస వయస్సు 25 సంవత్సరాలుగా ఉంది. అయితే రాజ్యాంగం అనేది ప్రజా అవసరాలకు అనుగుణంగా మారే ఒక జీవవంతమైన వ్యవస్థ. గతంలో ఓటు హక్కు వయస్సును సవరించినట్లే, పోటీ చేసే కనీస వయస్సును తగ్గించడానికి పార్లమెంట్ ద్వారా రాజ్యాంగ సవరణ చేయడం రాజ్యాంగబద్ధమైన ప్రక్రియే.


యూకే (బ్రిటన్), కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ వంటి అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాల్లో 18 నుంచి 21 ఏళ్ల వయస్సులోనే శాసనసభలకు, పార్లమెంట్‌కు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. మన దేశంలో కూడా 21 ఏళ్ల యువత ఇప్పటికే గ్రామ పంచాయతీలకు సర్పంచ్‌లుగా, మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లుగా బాధ్యతలు చేపడుతున్నారు. స్థానిక పాలనలో లేని అభ్యంతరం, చట్టసభలకు వచ్చేసరికి ఎందుకు? ‘‘21 ఏళ్లకు పాలనా అనుభవం ఉండదు’’ అనే వాదన ప్రజాస్వామ్య సూత్రాల ముందు నిలబడదు. ఎందుకంటే అనుభవం అనేది వయస్సుతో మాత్రమే రాదు, ఇచ్చే అవకాశాల ద్వారా వస్తుంది.

ప్రస్తుతం దేశంలో అతిపెద్ద జనాభా యువతదే. సాంకేతిక విప్లవం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), విద్య, ఉపాధి, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, వాతావరణ మార్పుల వంటి అనేక నూతన అంశాలు నేరుగా యువతరం జీవితాలపై ప్రభావం చూపుతున్నాయి. నేటి జెన్–జీ తరం కేవలం రాజకీయ నాయకుల ప్రచార సభల్లో జెండాలు మోసే కార్యకర్తలుగా ఉండటానికి సిద్ధంగా లేదు. ప్రశ్నించే చైతన్యాన్ని, జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తోంది. అలాంటి తరాన్ని చట్టాలు చేసే శాసనసభలకు దూరంగా ఉంచడం వల్ల వారి ఆలోచనలు, ఆకాంక్షలు చట్టాలుగా మారే అవకాశం కోల్పోతాయి. విద్యార్థి, యువజన ఉద్యమాల నుంచి వచ్చిన నాయకులు చట్టసభల్లోకి అడుగుపెట్టినప్పుడే వీధి నినాదాలు శాశ్వత విధాన నిర్ణయాలుగా రూపాంతరం చెందుతాయి.

పోటీ చేసే కనీస వయస్సును 21 ఏళ్లకు తగ్గించడం అంటే యువతకు నేరుగా పదవులను పంచి ఇవ్వడం కాదు. ఇది కేవలం ప్రజల తీర్పును ఎదుర్కొనే అవకాశాన్ని కల్పించడం మాత్రమే. అయితే ఈ సంస్కరణ పూర్తి ఫలితాలనివ్వాలంటే చట్ట సవరణతో పాటు రాజకీయ పార్టీల ధోరణి కూడా మారాలి. నేడు 21 ఏళ్ల యువతకు శాసనసభల ద్వారాలు తెరవాలన్న రేవంత్‌రెడ్డి ప్రతిపాదన ఆ ప్రజాస్వామ్య వికాసంలో సహజమైన మైలురాయి. యువతను కేవలం ఐదేళ్లకోసారి ఓటు వేసే ఓటర్లుగా మాత్రమే చూస్తామా? లేక దేశ విధానాలను రూపొందించే భావి శాసనకర్తలుగా విశ్వసిస్తామా? అన్నదే ఇప్పుడు దేశం ముందున్న ప్రశ్న.

చనగాని దయాకర్

టీపీసీసీ జనరల్ సెక్రటరీ

ఇవి కూడా చదవండి..

విద్యార్థులపై కేసులు ఉండవు.. హామీపై కట్టుబడి ఉన్నాం: సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ

బరువు తగ్గడం కోసం ప్రమాదకర ప్రయత్నం.. టీలో ఆ ద్రవాన్ని కలిపి తాగితే..

Updated Date - Aug 04 , 2026 | 02:20 AM