20 ఏళ్ల అనుభవం.. 40 ఏళ్ల దార్శనికత
ABN , Publish Date - Jul 04 , 2026 | 01:06 AM
ఒక స్పష్టమైన సంకల్పం ఉన్నప్పటికీ రాజకీయాల్లో రాణించాలంటే చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలి. భౌగోళిక వర్తమాన రాజకీయాలను ఆకళింపు చేసుకోవాలి. వీటికి తోడు నైతిక నిబద్ధత, విశ్వసనీయత...
ఒక స్పష్టమైన సంకల్పం ఉన్నప్పటికీ రాజకీయాల్లో రాణించాలంటే చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలి. భౌగోళిక వర్తమాన రాజకీయాలను ఆకళింపు చేసుకోవాలి. వీటికి తోడు నైతిక నిబద్ధత, విశ్వసనీయత, దూరదృష్టి మరీ ముఖ్యం... ఇవన్నీ పాలమూరు బిడ్డ, తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డిలో స్పష్టంగా కనిపిస్తాయి.
పాలమూరు అంటేనే దశాబ్దాల నుంచీ అత్యంత వెనుకబడిన జిల్లాగా చరిత్రకెక్కింది. ఉపాధి కోసం యువత వలసలతో గ్రామాలను విడిచిపెడితే వృద్ధులు మాత్రమే గ్రామాల్లో బతుకులీడ్చిన దయనీయ పరిస్థితులు ఉండేవి. పాలమూరుకు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగిందనుకుంటే, రాష్ట్రం వేరుపడిన తర్వాత కూడా దశాబ్దకాలంగా పాలమూరు బాగుపడ్డది లేదు.
‘డెభ్బై ఏళ్ల రాష్ట్ర చరిత్రలో ఈ ప్రాంతం నుంచి జననేతగా తనకొక అవకాశం వచ్చిందని, దాన్ని జారవిడుచుకుంటే చరిత్ర తనను క్షమించదు’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తరచూ చెబుతుంటారు. ఒక పార్టీ నాయకుడిగా కాకుండా, ఒక ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న వ్యక్తి.. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన పాలమూరును, క్రమంగా రాష్ట్రాన్ని బాగుచేసుకుందామని, రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలని అన్ని పార్టీల నేతలకు వినమ్రంగా విన్నవించుకోవడమంటే.. ఆ ప్రాంత పరిస్థితులను అవగతం చేసుకున్న వారందరూ ఆయనలోని తపనను అర్థం చేసుకోగలరు.
ఒక్క పాలమూరు మాత్రమే కాదు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రాంతీయ, జాతీయ అంశాలపై రేవంత్‌రెడ్డికి సంపూర్ణ అవగాహన ఉందని చెప్పడానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన నిర్వహిస్తున్న పాత్రే గొప్ప నిదర్శనం.
కేంద్రం ప్రతిపాదించిన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలా అన్యాయం జరుగుతుందన్నది విడమరిచి చెప్పారు. ఈ అంశంపై ఆయన విశ్లేషణ దేశం మొత్తం చర్చనీయాంశంగా మారడమే కాకుండా, రేవంత్‌రెడ్డి వాదనలోని హేతుబద్ధతను విపక్షాలన్నీ సమర్థించాయి. అందుకు సహేతుకమైన ప్రత్యామ్నాయాలను కూడా సూచించారు.
కేంద్రం, రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. దేశ సమగ్రత అంశం తెరమీదకు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా రేవంతన్న ముందు నిలిచారు. పహల్గాం దాడి ఘటనను తీవ్రంగా నిరసిస్తూ, సైనిక బలగాలకు మనోధైర్యం కలిగించడానికి నిర్వహించిన ర్యాలీ, ఆ సందర్భంలో ఆయన మాట్లాడిన మాటలే అందుకు నిదర్శనం. దేశంలో భిన్న రాజకీయ సిద్ధాంతాలతో సంక్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు.. అవసరాలకు అనుగుణంగా మాట్లాడే నాయకులను చాలా మందిని చూస్తుంటాం. కానీ ‘నాకు ముందు దేశం, ఆ తర్వాత రాష్ట్రం, ఆ తర్వాతే పార్టీ’ అని ధైర్యంగా చెప్పిన నాయకుడు రేవంతన్న.
రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యల పరిష్కారం కోసం కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉందన్న విషయం కన్నా, ఆ సమస్య పరిష్కారం కోసమే ఎక్కువగా పాకులాడిన నాయకుడు రేవంత్. ‘పంచాయితీ కావాలా?... పరిష్కారం కావాలా?’ అన్న ప్రశ్నకు– నాకు పరిష్కారమే కావాలని విస్పష్టంగా ప్రకటించిన నాయకుడు రేవంత్ రెడ్డి.
మూసీ ప్రక్షాళన విషయంలో కావొచ్చు.. మరో విషయంలో కావొచ్చు.. తేల్చుకోవాల్సివచ్చినప్పుడు ప్రధాని మోదీని రేవంత్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ‘కేంద్రం సబర్మతి, గంగా, యమునా నదుల ప్రక్షాళన చేసుకున్నప్పుడు.. హైదరాబాద్ ప్రజల భవిష్యత్తు ఆధారపడి ఉన్న మూసీ నదిని మేం ఎందుకు ప్రక్షాళన చేయకూడదు’ అని ప్రశ్నించడానికి ఏమాత్రం సందేహించలేదు. అయితే... ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నిలబడి కొట్లాడాలో కూడా బాగా తెలిసిన వ్యక్తి రేవంత్‌రెడ్డి. కేంద్ర రాష్ట్రాల సామరస్యం విషయంలో అవసరమైనప్పుడు పట్టువిడుపులు ప్రదర్శించారు. ప్రధానమంత్రిని పెద్దన్నగా సంబోధించడమే కాకుండా, విమర్శకులకు తన వాదనపై సమర్థవంతమైన వివరణ ఇచ్చారు. అదే సమయంలో పార్టీ వ్యవహారంలో అధినాయకత్వం ఆదేశాలను శిరసావహిస్తానని స్పష్టంగా చెప్పారు.
రేవంత్‌రెడ్డికి సంబంధించినంత వరకూ పరస్పర వైరుధ్యాలకు తావు లేవు. ఆయన వైఖరి చాలా స్పష్టంగా ఉంది. చెప్పాల్సిన విషయాన్ని నిర్మొహమాటంగా చెబుతారు. అలా చెప్పడం వల్ల పలు సందర్భాల్లో వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బందులు కూడా పడ్డారు. కానీ తెరమీద ఒకటి, అంతరాల్లో మరొక నైజం లేని నాయకుడని కచ్చితంగా చెప్పొచ్చు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత.. దాదాపు పదేండ్ల అనంతరం కూడా దాని పయనం, గమ్యం ఏమిటన్న అయోమయ పరిస్థితులు. దశాబ్దకాలంగా పేరుకుపోయిన సమస్యలు తెరమీదకొచ్చినప్పుడు ‘సంసారం చక్కదిద్దుకోవడానికి, సర్దుకోవడానికి కొంత సమయం పడుతుంది’ అని సూటిగానే చెప్పారు. ఇప్పుడు రేవంతన్న సరిగ్గా అదే చేస్తున్నారు. తాను చేపట్టిన సంస్కరణలపై ఎన్నెన్నో విమర్శలు వచ్చినా, మొక్కవోని దీక్షతో ముందుకు వెళుతున్నారు. అది పాఠశాల విద్యారంగంలో సంస్కరణలు కావొచ్చు, రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన ఇతర అంశాలు కావొచ్చు. ఉపాధి అవకాశాలను గణనీయంగా పెంచే దిశగా ఐటీఐలను అధునాతన సాంకేతిక విజ్ఞాన కేంద్రాలుగా (ఏటీసీలుగా) తీర్చిదిద్దడంలోనూ ఆయన చేసిన, చేస్తున్న నిరంతర కృషి ఫలితాలు మన కళ్లముందే కనిపిస్తున్నాయి. వ్యవసాయం, విద్య, మహిళ, యువత... ఇలా ప్రభుత్వ ప్రాధాన్యాలను స్పష్టంగా చెప్పారు రేవంత్. రాష్ట్రాన్ని ఏ దిశలో నడిపించి, ఏ దశకు చేర్చాలో ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్‌ను నిర్దేశించుకుని లక్ష్యాన్ని చేరుకోవడానికి రేవంత్‌రెడ్డి కంటున్న కల నిజం కావాలని ఆశిద్దాం.
2007లో జెడ్పీటీసీగా రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర అధినేత వరకూ ఎదిగారు. రెండు దశాబ్దాల అనుభవం.. మరో రెండు దశాబ్దాల దార్శనికతతో ముందుకు కదులుతున్నారు.
సామ రామమోహన్ రెడ్డి
టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్
ఈ వార్తలనూ చదవండి:
దోషులను కఠినంగా శిక్షించాలి.. రామ్ మందిర్ విరాళాల వివాదంపై ఆర్ఎస్ఎస్..
గుజరాత్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్ ఏర్పాటుకు కుట్ర.. 8 మంది అరెస్ట్..