రిజర్వేషన్లపై ఎవరు గెలవాలి? ఎవరు ఓడాలి?
ABN , Publish Date - Oct 22 , 2026 | 04:26 AM
కుల వ్యవస్థపై చర్చ వచ్చినప్పుడు ప్రతి కుల సంఘం, కుల పెద్దలు, మేధావులు, సామాజిక ప్రతినిధులు సహజంగానే తమ తమ అనుభవాలు, ప్రయోజనాలు, సామాజిక స్థితి నుంచి తమ వాదనను...
కుల వ్యవస్థపై చర్చ వచ్చినప్పుడు ప్రతి కుల సంఘం, కుల పెద్దలు, మేధావులు, సామాజిక ప్రతినిధులు సహజంగానే తమ తమ అనుభవాలు, ప్రయోజనాలు, సామాజిక స్థితి నుంచి తమ వాదనను నిర్మించుకుంటారు. ఒక వర్గం తమలో తాము చర్చించుకున్నప్పుడు ‘‘మా వాదనే సరైనది’’ అనిపించడం సహజం. కానీ సమాజానికి వర్తించే విధానాన్ని నిర్ణయించాలంటే ఒక్క వర్గం అనుభవం మాత్రమే ప్రాతిపదిక కాకూడదు. ఇతర వర్గాల అనుభవాలు, చారిత్రక వాస్తవాలు, సామాజిక గణాంకాలు, రాజ్యాంగ విలువలు కూడా చర్చలోకి రావాలి. అందుకే రిజర్వేషన్ల వంటి సున్నితమైన అంశాలపై ‘‘ఎవరి వాదన వారిదే’’ అనే స్థాయిని దాటి, భిన్న వర్గాలు ఒకరినొకరు వినే సామాజిక సంభాషణ అవసరం.
రిజర్వేషన్లను వ్యతిరేకించే వారు ‘‘రిజర్వేషన్లు వద్దు’’ అని చెప్పడంతో చర్చ ముగిసిపోదు. ‘‘అయితే వాటి స్థానంలో ప్రత్యామ్నాయం ఏమిటి?’’ అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి. వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం, ఆర్థిక అవకాశాలు, సామాజిక గౌరవం ఎలా కల్పించాలి? దానికి మీ కాంక్రీట్ విధాన ప్రతిపాదన ఏమిటి? ఆ ప్రతిపాదనను రిజర్వేషన్ల మద్దతుదారులతో బహిరంగంగా చర్చించడానికి సిద్ధంగా ఉన్నారా? అనే ప్రశ్నలు ముందుకు రావాలి. ఎవరికి వారు తమ అభ్యంతరాన్ని చెప్పడంతో పాటు ప్రత్యామ్నాయ సామాజిక పరిష్కారాన్ని కూడా సమాజం ముందు ఉంచడం ముఖ్యం కదా.
అదే సమయంలో రిజర్వేషన్లను అమలు చేస్తున్న లేదా పెంచుతున్న పాలకులను కూడా ప్రశ్నించాలి– ఇప్పటివరకు అమలైన రిజర్వేషన్ల వల్ల ఎంతమంది సామాజికంగా ముందుకు వచ్చారు? ఇంకా ఎంతమంది అవకాశాలకు దూరంగా ఉన్నారు? ఏ రంగాల్లో వెనుకబాటుతనం కొనసాగుతోంది? దాన్ని కొలిచే వ్యవస్థ ఏమిటి? తదుపరి కార్యాచరణ ఏమిటి? – ఇలాంటి ప్రశ్నలను అడగాలి. రిజర్వేషన్లు ప్రకటించడం మాత్రమే సామాజిక న్యాయం కాదు. రిజర్వేషన్ల అవసరం తగ్గేంతగా విద్య, ఉపాధి, ఆర్థిక అవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక గౌరవం వంటి రంగాల్లో అసమానతలను తగ్గించే కార్యాచరణ కూడా అవసరం. ఇక్కడే ‘‘ఇక ఎంతకాలం?’’ అనే ప్రశ్నకు అసలు అర్థం వస్తుంది.
రిజర్వేషన్లు యాభై శాతం మించకూడదన్న సుప్రీంకోర్టు ఇందిరా సహాని తీర్పును అనుసరించి పలు సందర్భాల్లో తన న్యాయస్థితిని స్పష్టం చేసింది. కాబట్టి ‘‘కోర్టులు చట్టాన్ని పక్కనపెట్టి రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్పు ఇవ్వాలి’’ అనేది ప్రశ్న కాదు. అసలు ప్రశ్న ఏమిటంటే–రిజర్వేషన్ల ప్రతి వివాదాన్ని కేవలం పరిమితి అనే న్యాయపరమైన ప్రశ్నగానే చూస్తామా? లేక ఆ వివాదం వెనుక ఉన్న సామాజిక అసమానత, వెనుకబాటుతనం, రిజర్వేషన్ల లక్ష్యం, వాటి ఫలితాలను చూస్తామా? అన్నది.
యాభై శాతం పరిమితి విషయంలో రాజ్యాంగ–చట్టపరమైన మార్పు అవసరమని భావిస్తే, ఆ మార్పుపై రాజకీయ ప్రక్రియ ఎక్కడ జరగాలి అన్న ప్రశ్న సహజంగానే పార్లమెంట్ ముందుకు వస్తుంది. అందుకే రాజకీయ ప్రతినిధులను కూడా ప్రశ్నించాలి: సమాజంలో సమానత్వాన్ని సాధించడానికి ఇన్నేళ్లుగా ఏ విధానపరమైన మార్పులు తీసుకొచ్చారు? కుల అసమానతలను తగ్గించడానికి మీ కార్యాచరణ ఏమిటి? వంటి ప్రశ్నలు. ‘‘రిజర్వేషన్లు ఎప్పటివరకు?’’ అనే ప్రశ్నతో పాటు ‘‘రిజర్వేషన్లు అవసరం లేని సమాజాన్ని ఎప్పటికి నిర్మిస్తాం?’’ అనే ప్రశ్న కూడా ముందుకు రావాలి.
అందుకే ఈ చర్చలు రాజకీయ పార్టీలు నిర్వహించే సభలుగా కాకుండా స్వతంత్ర సామాజిక సంభాషణ వేదికలుగా ఉండాలి. సోషల్ సైంటిస్టులు, చరిత్ర–సమాజ శాస్త్ర పరిశోధకులు, న్యాయ నిపుణులు, విద్యావేత్తలు, జర్నలిస్టులు, శాస్త్రవేత్తలు, కుల సంఘాల ప్రతినిధులు, సిద్ధాంతపరంగా పనిచేసే సామాజిక సంస్థలు, ప్రజా ఉద్యమాలతో అనుబంధం ఉన్న నిజమైన స్వతంత్ర విప్లవవాదులు ఇందులో భాగస్వాములు కావాలి. ఎవరి రాజకీయ ప్రయోజనాలకు గులాంగిరి చేయకుండా సామాజిక వాస్తవాలను స్వతంత్రంగా పరిశీలించే వ్యక్తులు ఈ సంభాషణకు మధ్యవర్తులుగా ఉండాలి. ఈ చర్చలు ఒకే సభతో ముగియకూడదు. మొదట సామాజిక అసమానతలు, తర్వాత విద్య–ఉద్యోగ అవకాశాలు, ఆపై రాజకీయ ప్రాతినిధ్యం, చివరగా రిజర్వేషన్లకు సంబంధించిన విధానాలు, ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు వంటి అంశాలపై దశలవారీగా సమావేశాలు జరగాలి. ప్రతి సమావేశంలో గణాంకాలు, పరిశోధనలు, రాజ్యాంగ విలువలు, సామాజిక అనుభవాలు ముందుంచాలి. ఒక వర్గం మాట్లాడి మరొక వర్గం వినే కార్యక్రమం కాకుండా, ప్రతిపాదనలను ప్రశ్నించే, సమాధానాలు కోరే, అవసరమైతే సవరించే విధానం ఉండాలి.
ఈ చర్చల అంతిమ లక్ష్యం ఎవరి వాదననూ ఓడించడం కాదు. అన్ని వర్గాలు తమ అభిప్రాయాలను పూర్తిగా వదులుకోవాల్సిన అవసరం లేదు. కానీ సమాజం ముందుకు సాగడానికి అవసరమైన కొన్ని ప్రాథమిక అంశాలపై కనీస సామాజిక అవగాహన ఏర్పడాలి. అదే ఒక అనధికారిక జెంటిల్మెన్స్ అగ్రిమెంట్‌కు పునాది కావచ్చు. అది చట్టానికి ప్రత్యామ్నాయం కాదు, రాజ్యాంగ హక్కులకు ప్రత్యామ్నాయం కాదు. పరస్పర గౌరవంతో, ఆధారాలతో, బాధ్యతతో ముందుకు సాగేందుకు ఏర్పడే ఒక సామాజిక అవగాహన మాత్రమే.
రిజర్వేషన్లపై ఎవరు గెలవాలి? ఎవరు ఓడాలి? అన్నది ప్రశ్న కాదు. రిజర్వేషన్ల అవసరం లేకుండా చేసేంత సామాజిక సమానత్వాన్ని ఎప్పుడు, ఎలా నిర్మిస్తాం? అన్నదే అసలు ప్రశ్న. ఈ అంశంపై పలు వర్గాల వాదనలు తమ తమ గోడల మధ్యే మిగలకూడదు. ఒకరి మాట మరొకరు వినాలి. విభేదాలున్న చోటే సంభాషణ మొదలుకావాలి. సంభాషణ నుంచి అవగాహన, అవగాహన నుంచి విధానం, విధానం నుంచి సామాజిక మార్పు రావాలి.
పాపని నాగరాజు
సత్యశోధక మహాసభ
ఈ వార్తలనూ చదవండి:
ఆర్ఎస్ఎస్పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు.. పిల్ల చేష్టలని కొట్టిపడేసిన బీజేపీ..
భారత్‌ను టార్గెట్ చేయాలనే ఉద్దేశం మాకు లేదు: అమెరికా విదేశాంగ మంత్రి