Share News

ఉత్కంఠ రచనలకు మారుపేరు ‘మంజరి’

ABN , Publish Date - Feb 06 , 2026 | 01:27 AM

సహృదయుడు, స్నేహశీలి, కథాప్రియుడు, కథానవలా రచయిత మంజరి (గంధం నాగేశ్వరరావు) ఇటీవల అస్తమించారు. ఆయనకు పురస్కారాల వెంపర్లాట లేదు. ధర్మాగ్రహం తప్ప నసుగుడు...

ఉత్కంఠ రచనలకు మారుపేరు ‘మంజరి’

సహృదయుడు, స్నేహశీలి, కథాప్రియుడు, కథానవలా రచయిత మంజరి (గంధం నాగేశ్వరరావు) ఇటీవల అస్తమించారు. ఆయనకు పురస్కారాల వెంపర్లాట లేదు. ధర్మాగ్రహం తప్ప నసుగుడు మాటల్లేవు. నిర్మొహమాటంగా అభిప్రాయం చెప్పడం తప్ప అనుగ్రహం కోసం పాకులాట లేదు. నిర్మాణాత్మక విమర్శ, కథంటే పిచ్చి ప్రేమ తప్ప, సాహిత్యపరంగా కోరుకునేది ఏమీలేదు. పాఠకుని ప్రశంసకు పొంగిపోయే అల్పసంతోషి. తనకు చేతనైన రచనలు చేసుకుంటూ పోతారు. అంతే.

మంజరి తనలోని అసంతృప్తిని అధిగమించడానికి అక్షరాన్ని ఆసరా చేసుకున్నానంటారు. అలాగే 150 పేజీల నవల రాయాలంటే 450 పేజీలు రాస్తానంటారు. సరిచేసుకుని తిరగరాసి గానీ బయటకు వదలరు. మంజరి బహుళ సంఘటనల్ని ఏకధారగా ముడిపెట్టి ఆనక వాటిని జాగ్రత్తగా విప్పడంలో సిద్ధహస్తుడు. ఒక నవల (టార్గెట్ నెంబరు టు) మాసపత్రికలో ప్రచురణ అయిన తర్వాత కన్నడం, సంస్కృతం భాషల్లోకి అనువాదం అయ్యింది. క్రైం నవల (డిటెక్టివ్ నవల కాదు) రాయడం కష్టం. సగటు పాఠకునికి ఎంతమాత్రం పరిచయం లేని, తెలియని ప్రపంచాన్ని చూపించే నవలలెన్నో మంజరి రాశారు. సామాజిక చరిత్రలోని అదృశ్యశక్తుల నడవడికను చూపించే నవలలు రాశారు.


పోలీసుశాఖలో ఉన్నతాధికారిగా పనిచేసిన మంజరికి నేరప్రవృత్తుల అవగాహన, ఆయుధాలు ఉపయోగించడంలోని మెలకువలు ఇంకా నేర పరిశోధనకు సంబంధించిన సాంకేతిక పారిభాషిక పదాలు ఆయనకు తెలుసు. అందుకే ఆయన ఉత్కంఠ కలిగించే, చదివించే గుణంతో రాయగలిగారు. అంతేకాదు మంజరి ఒక పక్క జీవితంలోని కొత్త అంశాల్ని చిత్రించే తాపత్రయంతో కథలు రాశారు. ఆయన కలం సామాజిక అంశాలు, సమకాలీన రాజకీయ సంఘటనలు, మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు, మానవీయతతో కూడిన కథల్నీ స్పృశించింది.

ఇప్పటివరకు ఇరవై నవలలు, వందకు పైగా కథలు రాశారు. అనారోగ్యంతో బాధపడుతూ కూడా ఒక నవల రాస్తూ ముగింపు పేజీలో ఉన్నట్టు ఈ మధ్యే చెప్పారు. 1954లో జన్మించిన ‘మంజరి’ మరణం సాహితీలోకానికి తీరని లోటే. ఆయనకు శ్రద్ధాంజలి.

దాట్ల దేవదానం రాజు

కవి, కథకుడు

ఈ వార్తలు కూడా చదవండి..

తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏక సభ్య కమిషన్ ఏర్పాటు: సీఎం

హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం.. ఉమెన్స్ హాస్టల్లో చెలరేగిన మంటలు

Updated Date - Feb 06 , 2026 | 01:27 AM