Share News

కవి ఎవరి వాడు?

ABN , Publish Date - Jun 29 , 2026 | 04:25 AM

ఒక కవి ఏ ప్రాంతానికి చెందినవాడనే ప్రశ్న తెలుగు సాహిత్య చరిత్రలో కొత్తది కాదు. బమ్మెర పోతన తెలంగాణవాడా కాదా? పాల్కురికి సోమన స్థానికత ఏంటి? వేములవాడ భీమకవి ఎక్కడివాడు? ఇలాంటి ప్రశ్నలు కేవలం చారిత్రక సందేహాలుగా..

కవి ఎవరి వాడు?

క కవి ఏ ప్రాంతానికి చెందినవాడనే ప్రశ్న తెలుగు సాహిత్య చరిత్రలో కొత్తది కాదు. బమ్మెర పోతన తెలంగాణవాడా కాదా? పాల్కురికి సోమన స్థానికత ఏంటి? వేములవాడ భీమకవి ఎక్కడివాడు? ఇలాంటి ప్రశ్నలు కేవలం చారిత్రక సందేహాలుగా మాత్రమే కనిపించవచ్చు. కానీ వాటి వెనుక ఉన్న మీమాంస మరింత విస్తృతమైంది. ఒక కవిని ఒక ప్రాంతానికి చెందినవాడిగా నిర్ణయించడానికి అసలు ఏ ప్రమాణాన్ని స్వీకరించాలి?

సాధారణంగా జన్మస్థలం, నివాసం, భాష, వంశపారంపర్యం వంటి అంశాలను ఆధారంగా తీసుకుంటారు. అయితే ఈ ప్రమాణాలన్నీ ఎప్పుడూ ఒకే సమాధానాన్ని ఇవ్వవు. ఒక సందర్భంలో జన్మస్థలం ముఖ్యం అనిపిస్తే, మరో సందర్భంలో భాష ప్రాధాన్యం పొందుతుంది, ఇంకొకచోట సాహిత్యమే ప్రధాన ఆధారమవుతుంది. అందుకే కవి స్థానికత అనేది కేవలం సమాచారానికి సంబంధించిన అంశం కాదు. అది సాహిత్య చరిత్రను మనం ఎలా అర్థం చేసుకుంటున్నామన్న ప్రశ్నకి సంబంధించిన అంశం కూడా.

కవులను సాహిత్య చరిత్రలు సహజంగానే ప్రాంతాల వారీగా విభజిస్తాయి. తెలంగాణ కవులు, ఆంధ్ర కవులు, రాయలసీమ కవులు అని వర్గీకరణలు చేస్తాయి. ఇది కొన్ని సందర్భాల్లో అవసరమే. ఎందుకంటే ఒక ప్రాంతపు సాంస్కృతిక చరిత్రను అర్థం చేసుకోవడానికి అక్కడి సాహిత్య సంపదను గుర్తించడం ముఖ్యం. అయితే ఈ అంశం ఇక్కడితో ఐపోలేదు. ఒక కవిని ఒక ప్రాంతానికి చేర్చడం అంటే కేవలం అతని వివరాలను నమోదు చేయడం కాదు. ఒక ప్రాంత చరిత్రలో అతనికి స్థానం కల్పించడం కూడా.


అందువల్ల ‘కవి ఎవరి వాడు?’ అనే ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు, ఆ ప్రశ్న ఎందుకు పుడుతోందో పరిశీలించాలి. ఎందుకంటే స్థానికత అనేది స్థిరంగా ఉండే వస్తువు కాదు. అది చరిత్ర, భాష, జ్ఞాపకం, సామాజిక అనుభవం, సాంస్కృతిక అనుబంధం వంటి అనేక అంశాల కలయిక.

‘కవుల పుట్టుక, ఏరుల పుట్టుక ఎక్కడ జరుగుతుందో చెప్పలేం’ అని ఒక నానుడి. ఇది కేవలం కవితాత్మకమైన వాక్యం అనుకుంటే దాని పరిమితి అంతే. కానీ ఈ పోలికను కొనసాగిస్తే అర్థం మరింత విస్తరిస్తుంది. ఒక నది ఎక్కడ పుట్టిందన్నదే కాదు, అది ఏ నేలల గుండా ప్రవహించిందన్నదీ అంతే ముఖ్యం. కవి విషయంలోనూ అంతే. అతడు ఎక్కడ జన్మించాడన్నది ఒక సమాచారం మాత్రమే. అతని సాహిత్యం ఏ నేలల జీవితంతో ముడిపడి ఉందన్నది కీలకం.

అందుకే ఒక కవి స్థానికతను నిర్ణయించడంలో జన్మస్థలం ఒక్కటే ప్రమాణంగా సరిపోదు. పుట్టుక అనేది వ్యక్తి నిర్ణయం కాదు. కుటుంబ పరిస్థితులు, సామాజిక ఆచారాలు, యాదృచ్ఛిక సందర్భాలు పుట్టుక స్థలాన్ని నిర్ణయిస్తాయి. తెలుగు నాట తొలి ప్రసవం అమ్మమ్మగారింట్లోనే చేసే ఆచారముంది. అలాంటప్పుడు కేవలం జన్మస్థలం ఆధారంగా స్థానికతను ఎలా నిర్ణయిస్తాం.

వేములవాడ భీమకవి విషయంలో ఇలాంటి వివాదాలే ఉన్నాయి. ఆయన ద్రాక్షారామానికి చెందినవాడని ఒక వాదన, వేములవాడ వాడేనని మరో వాదన.


జన్మస్థలం కాకపోతే పోనీ నివాస స్థలాన్ని ప్రమాణంగా తీసుకోవచ్చు అనుకుందామా! కానీ ఆ ప్రమాణం కూడా పూర్తిగా సరైంది కాదు. ఎందుకంటే ఉద్యోగం, విద్య, జీవనావసరాలు మనుషులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్తాయి. అయితే నివాసం మారినంత మాత్రాన వారివైన వైయక్తిక అనుభవాలు పూర్తిగా అంతర్ధానమైపోవు.

కేశవరెడ్డి ఉదాహరణ ఇక్కడ ప్రస్తావనార్హం. ఆయన జీవితంలో గణనీయమైన భాగం తెలంగాణలో గడిచినప్పటికీ, ఆయన రచనల్లో ప్రధానంగా కనిపించేది రాయలసీమ జీవితమే. శరీరం ఒక చోట ఉండవచ్చు. కానీ సృజనాత్మక చైతన్యం మరో ప్రపంచంతో ముడిపడి ఉండవచ్చు. అప్పుడు స్థానికతను ఏ ఆధారంతో నిర్ణయించాలి?

ఈ ప్రశ్న మనల్ని భాష వైపు తీసుకెళ్తుంది. భాషలో ప్రాంతపు జ్ఞాపకాలు ఉంటాయి. జీవన విధానాల ఆనవాళ్లు ఉంటాయి. సామాజిక సంబంధాల ముద్ర ఉంటుంది. రచయిత తన ప్రపంచాన్ని భాష ద్వారానే వ్యక్తపరుస్తాడు. అందుకే భాష స్థానికతను అర్థం చేసుకోవడానికి ఒక ముఖ్యమైన ఆధారం. అయితే అది కూడా అంతిమ ప్రమాణం కాదు.

కోరుట్ల ప్రాంతానికి చెందిన కృష్ణమాచార్య జీవితాన్ని పరిశీలిస్తే సంస్కృతం, తెలుగు, తమిళ సంప్రదాయాల సంగమం కనిపిస్తుంది. ఆయన కుటుంబ చరిత్రలోనే ఈ సాంస్కృతిక కలయికకు ఆనవాళ్లు కనిపిస్తాయి. తమిళ భాష, శ్రీవైష్ణవ సంప్రదాయం పట్ల ఉన్న మక్కువతో ఆయన అన్నగారు కుటుంబ ఇంటిపేరైన ‘సిరిసెనగండ్ల’ను ‘సిరిశెనహళ్’గా మార్చుకున్నారని తెలుస్తుంది. ఈ చిన్న మార్పు వెనుకనే భాష, సంప్రదాయం, సాంస్కృతిక అనుబంధాల సంక్లిష్ట స్వభావం దాగి ఉంది. ఒక వ్యక్తి తెలంగాణలో జన్మించి పెరిగినా, అతని సాంస్కృతిక దృష్టి మరో ప్రాంతపు భాషా సంప్రదాయాల వైపు విస్తరించి ఉండవచ్చు. అందువల్ల భాషను మాత్రమే ఆధారంగా చేసుకొని స్థానికతను నిర్ణయించడమూ సాధ్యం కాదు. ఎందుకంటే భాష అనేది కేవలం భౌగోళిక సరిహద్దులలో బంధించబడిన వ్యవస్థ కాదు. మతసంప్రదాయాలు, వలసలు, విద్యా కేంద్రాలు, సాహిత్య సంబంధాలు వంటి అనేక చారిత్రక ప్రక్రియల ద్వారా భాషలు పరస్పరం ప్రభావితం అవుతూంటాయి. కాబట్టి భాష స్థానికతను అర్థం చేసుకోవడానికి ఒక ముఖ్యమైన సూచిక అయినప్పటికీ, దానిని పూర్తిగా నిర్ణయించే అంతిమ ప్రమాణంగా స్వీకరించలేం.


మరి ఈ ప్రమాణాలేవీ సరిపోనప్పుడు అసలు ఇంతగా స్థానికత గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? కవి తనను తాను ఒక ప్రాంతానికి పరిమితం చేసుకోవాలా? అనే ప్రశ్నలు ఎవరికైనా తలెత్తినపుడు, జాషువా కవిత్వం అందుకు ఆసక్తికరమైన సమాధానాన్ని ఇస్తుంది: ‘‘నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగులేదు విశ్వనరుడ నేను’’ అని చెప్పినప్పుడు ఆయన మనిషిని సంకుచిత గుర్తింపుల్లో బంధించే ప్రయత్నాలను ప్రశ్నిస్తున్నాడు. అయితే దీనిని స్థానికతను నిరాకరించడంగా అర్థం చేసుకోవడం సరైంది కాదు. జాషువా విశ్వనరుడే. కానీ ఆయన కవిత్వానికి ఒక నేల ఉంది. ఒక భాష ఉంది. ఒక సామాజిక అనుభవం ఉంది. ఒక దళిత జీవన వాస్తవికత ఉంది. ఆయన విశ్వజనీనత కూడా అక్కడి నుంచే పుట్టుకొచ్చింది. నిజానికి గొప్ప సాహిత్యం అంతా ఇలాగే ఏర్పడుతుంది. అది స్థానికతను విడిచిపెట్టి సార్వత్రికతను చేరదు. స్థానిక అనుభవాన్ని లోతుగా వ్యక్తీకరించడం ద్వారా సార్వత్రికతను అందుకుంటుంది.

ఈ నేపథ్యంలో రచయిత/కవి ఎవరివారో నిర్ణయించడానికి సాహిత్యాన్నే ప్రధాన ప్రమాణంగా తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే రచయిత తనకు తెలిసిన ప్రపంచాన్నే రాస్తాడు. అతని పాత్రలు, వారి భాష, వారి సంఘర్షణలు, వారి ఆశలు, వారి చరిత్ర ఇవన్నీ కలిసి ఒక సామాజిక ప్రపంచాన్ని నిర్మిస్తాయి. ఆ ప్రపంచమే రచయితకు సంబంధించిన అత్యంత విశ్వసనీయమైన ఆధారం.

కాళోజీని తెలంగాణ కవిగా నిలబెట్టింది కేవలం ఆయన జన్మస్థలం కాదు. తెలంగాణ సమాజంతో ఆయనకు ఉన్న చారిత్రక అనుబంధం. తెలంగాణ ప్రజల జీవితం పట్ల ఆయనకున్న నిబద్ధత, ఆయన భాష, ఆయన సాహిత్యం, ఆయన రాజకీయ చైతన్యం... ఈ అంశాలన్నీ కలిసినప్పుడు మాత్రమే ఆయన స్థానికతకు అర్థం వస్తుంది.


ఎండ్లూరి సుధాకర్ విషయంలో కూడా ఇదే సంక్లిష్టత కనిపిస్తుంది. పూర్వీకుల మూలాలు ఒక ప్రాంతంలో ఉండవచ్చు. జీవితం మరో ప్రాంతంలో వికసించి ఉండవచ్చు. రచనల్లో రెండింటి ఆనవాళ్లు కనిపించవచ్చు. అలాంటి సందర్భాల్లో ఒకే ప్రమాణంతో స్థానికతను నిర్ణయించడం సాధ్యం కాదు.

ఇక్కడ సాహిత్య సమాజం పాత్ర కూడా ఉంటుందని గమనించాలి. కవుల చరిత్రను కవులు మాత్రమే నిర్మించరు. విమర్శకులు, పరిశోధకులు, సంపాదకులు, పాఠ్యపుస్తకాలు, విశ్వవిద్యాలయాలు కూడా నిర్మిస్తాయి. అందువల్ల వారు ఒక కవిని ఏ ప్రాంతానికి చెందినవాడిగా గుర్తిస్తున్నారన్నది కూడా పరిశీలనకు వస్తుంది. ఈ ప్రక్రియ ఎప్పుడూ తటస్థంగా ఉండదు. సమాజంలో ఉన్న శక్తి సంబంధాలు, సాంస్కృతిక ఆధిపత్యాలు ఇక్కడ కూడా పని చేస్తాయి. అందుకే బమ్మెర పోతన, పాల్కురికి సోమన, వేములవాడ భీమకవి వంటి కవుల స్థానికత గురించి జరిగే చర్చలను కేవలం ప్రాంతీయ వివాదాలుగా చూడలేం. అవి తెలుగు సాహిత్య చరిత్ర నిర్మాణానికి సంబంధించిన ప్రశ్నలు.

అందువల్ల కవి స్థానికతను ఒక ఊరి పేరుకు కుదించలేం. అది జన్మస్థలం కంటే పెద్దది. నివాసం కంటే విస్తృతమైనది. భాష కంటే సంక్లిష్టమైనది. ఒక కవి తన రచనల ద్వారా ఏ సమాజంతో సంబంధం ఏర్పరచుకున్నాడో, ఏ జీవితాన్ని తన సాహిత్యంలో నిలబెట్టాడో, ఏ ప్రజల అనుభవాలకు స్వరమ య్యాడో అక్కడే అతని స్థానికతను వెతకాలి. చివరికి కవిని గుర్తించేది అతని జనన ధ్రువీకరణ పత్రం కాదు. అతని సాహిత్యమే. అదే అతని నిజమైన చిరునామా.

- సందీప్ వొటారికారి

93902 80093

Updated Date - Jun 29 , 2026 | 04:28 AM