Share News

సీమ వ్యవసాయానికి కొత్తగా పెట్టుబడి కోణం!

ABN , Publish Date - Feb 19 , 2026 | 01:30 AM

రాయలసీమను ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్’గా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించడం, అందుకు తగ్గట్టుగా బడ్జెట్‌లో నిధులు కేటాయించడం వ్యవసాయ రంగంలో ముఖ్యమైన మార్పును సూచిస్తుంది. ఎన్నో ఏళ్లు...

సీమ వ్యవసాయానికి కొత్తగా పెట్టుబడి కోణం!

రాయలసీమను ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్’గా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించడం, అందుకు తగ్గట్టుగా బడ్జెట్‌లో నిధులు కేటాయించడం వ్యవసాయ రంగంలో ముఖ్యమైన మార్పును సూచిస్తుంది. ఎన్నో ఏళ్లు కరువుతో ఇబ్బందిపడిన రాయలసీమ నేడు అధిక విలువ కలిగిన ఉద్యాన పంటల ఉత్పత్తి, ప్రాసెసింగ్, ఎగుమతుల కేంద్రంగా మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మన దేశంలోని వ్యవసాయం గురించి చర్చించినప్పుడు, మన దృష్టి పంజాబ్, హర్యానా, కోస్తా ఆంధ్రా లాంటి గ్రీన్ రెవల్యూషన్ విజయవంతమైన ప్రాంతాలపైనే కేంద్రీకృతమై ఉండేది. ఆయా ప్రాంతాలు అధిక దిగుబడి గల గోధుమ, వరి వంటి ధాన్య పంటల ద్వారా దేశ ఆహార భద్రతను స్థిరపరిచాయి. ఫలితంగా, వ్యవసాయం అంటే ధాన్యం ఉత్పత్తి, నీటి పారుదల, ఆహార కొరత నివారణ అనే సంకుచిత అవగాహన పాలకవర్గాల నుంచి మేధావుల వరకు ఉండేది. అయితే, గత మూడు దశాబ్దాలలో దేశ వ్యవసాయ దృశ్యం పూర్తిగా మారిపోయింది. మార్కెట్ ఆధారిత, పెట్టుబడి ఆధారిత, అధిక విలువ గల ఉద్యానవన పంటలపై ఆధారపడిన మూలధన సేకరణ రంగంగా వ్యవసాయ రంగం మార్పు చెందు తోంది. నేడు రాయలసీమలోనూ ఈ పరిస్థితిని గమనించవచ్చు.

గత రెండు మూడు దశాబ్దాలుగా రాయలసీమ వ్యవసాయంలో గణనీయమైన మార్పు చోటుచేసుకుంది. ముఖ్యంగా సాగునీటి వ్యవస్థ (శ్రీశైలం నుంచి ప్రాజెక్టుల ద్వారా వరద నీటి తరలింపు), బోర్‌వెల్స్, సబ్‌మర్సిబుల్ పంపులు, డ్రిప్ ఇరిగేషన్ వంటి సాంకేతికతతో అందుబాటులో ఉన్న భూగర్భ జలాలను విస్తృతంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడింది. పెట్టుబడి లేమి కారణంగా ఈ సాంకేతికత చిన్న సన్నకారు, దిగువ కులాల రైతుల కంటే, ఆర్థికంగా బలమైన రైతులకే ఎక్కువగా ఉపయోగపడింది. అంతేగాక, 2000 సంవత్సరం తర్వాత హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్న కుటుంబ సభ్యుల ఆదాయం కూడా తిరిగి కొంతమేరకు వ్యవసాయ రంగంలో పెట్టుబడిగా మారింది. ఈ పెట్టుబడులు వ్యవసాయాన్ని జీవనాధార రంగం నుంచి పెట్టుబడి ఆధారిత రంగంగా మార్చడంలో కీలక పాత్ర పోషించాయి.


2010 తరువాత ఈ పెట్టుబడులు ప్రధానంగా ఉద్యానవన పంటలపై పెట్టడంతో మామిడి, బత్తాయి, దానిమ్మ, అరటి వంటి అధిక విలువ గల దీర్ఘకాలిక పంటలు రాయలసీమ సంప్రదాయ ధాన్య పంటల స్థానాన్ని క్రమంగా భర్తీ చేశాయి. ఉద్యాన పంటలు మార్కెట్‌లో అధిక ధరలను (2019–2023 మధ్య) అందించడం వల్ల కూడబెట్టిన మిగులు తిరిగి భూమి కొనుగోలు, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు, కార్పొరేట్ విద్య, ఇతర వ్యాపార కార్యకలాపాలలో పెట్టుబడిగా మారింది. ముఖ్యంగా భూస్వామ్య కుటుంబాలు తమ మొదటి తరం పిల్లలను కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదివించడం, పట్టణాలలో నివాస స్థలాలను కొనుగోలు చేయడం, వ్యవసాయాన్ని ఒక మూలధన సేకరణ సాధనంగా ఉపయోగించడం వంటి మార్పులు విస్తరించాయి.

రాయలసీమలో జరుగుతున్న వ్యవసాయ రంగ మార్పును మార్క్సిస్టు వ్యవసాయ సిద్ధాంతం, ముఖ్యంగా కార్ల్‌మార్క్స్ ప్రతిపాదించిన మిగులు కూడబెట్టే విధానం, వర్గ విభజన వంటి భావనల ద్వారా అర్థం చేసుకోవచ్చు. మిగులును తిరిగి పెట్టుబడి చేయడం, మార్కెట్ కోసం ఉత్పత్తి చేయడం, శ్రామిక శక్తిని వినియోగించడం, ఉత్పత్తి సాధనాలపై నియంత్రణను కేంద్రీకరించడం వంటివి పెట్టుబడిదారీ వ్యవసాయరంగ ప్రధాన లక్షణాలు. రాయలసీమలో కూడా మిగులును కూడబెట్టి, తద్వారా వివిధ రంగాలలో తిరిగి పెట్టుబడులు పెట్టే ప్రక్రియ ద్వారా ఒక కొత్త పెట్టుబడిదారీ రైతు వర్గం క్రమంగా నిర్మితమవుతోంది.

అయితే, ఈ పెట్టుబడిదారీ పరివర్తన వల్ల అన్ని వర్గాలకు సమానంగా లబ్ధి చేకూరలేదు. దళితులు, భూమిలేని ఇతర అణగారిన వర్గాలవారు ఇంకా కార్మికులుగానే కొనసాగుతున్నారు. వారు ఉత్పత్తి ప్రక్రియలో కీలకపాత్ర పోషించినప్పటికీ, మిగులు కూడబెట్టే ప్రక్రియలో భాగస్వాములు కాలేకపోయారు. ఫలితంగా, వ్యవసాయంలో వస్తున్న పెట్టుబడిదారీ మార్పు ఇక్కడి సామాజిక అసమానతలను తగ్గించకపోగా, మరింత బలపరిచింది. వ్యవసాయంలోని మిగులు ఒకవైపు పెట్టుబడిదారీ రైతు వర్గాన్ని బలపరుస్తూ, మరోవైపు భూమిలేని వర్గాలను శాశ్వత శ్రామిక వర్గంగా స్థిరపరుస్తున్నది.


ఈ నేపథ్యంలో, రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఉద్యానవన ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రైతాంగానికి సబ్సిడీలు, వివిధ రకాల ప్రోత్సాహకాలను అందిస్తామని చెప్తున్నది. అయితే, వాస్తవంగా లబ్ధి పొందుతున్న కులాలు, వర్గాలు ఎవరు అనేది ముఖ్యమైన ప్రశ్న! ఎందుకంటే, పెట్టుబడి సామర్థ్యం, భూమి యాజమాన్యం, మార్కెట్ అందుబాటు కలిగిన రైతులు మాత్రమే ఈ విధానాల నుంచి ఎక్కువగా ప్రయోజనం పొందే అవకాశముంది.

కాబట్టి, రాయలసీమ వ్యవసాయాన్ని కేవలం కరువు, నీటి కొరత, వెనుకబాటు కోణంలో మాత్రమే అర్థం చేసుకోవడం సరిపోదు. ఒకవైపు ఉన్నత వర్గాల్లోని వారు పెట్టుబడిదారీ రైతులుగా తమ ఆర్థిక, సామాజిక ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకోగలుగుతున్నారు. మరోవైపు భూమిలేని దళితులు, ఇతర అణగారిన వర్గాల వారు ఇప్పటికీ శ్రామిక శక్తిపైనే ఆధారపడి బతుకుతున్నారు. ఈ వర్గ విభజన, మిగులు కూడబెట్టే ప్రక్రియలే రాయలసీమ వ్యవసాయ భవిష్యత్తును, సామాజిక–ఆర్థిక నిర్మాణాన్ని నిర్ణయించే కీలక అంశాలు. కాబట్టి ప్రభుత్వాలు ముందుగా భూమిలేని దళితులకు, ఇతర వర్గాలకు భూ పంపిణీ లాంటివి చేపట్టి వ్యవసాయ రంగంలో వారిని భాగస్వాములను చేసినప్పుడే రాయలసీమ ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్’ కాగలుగుతుంది.

డా. చిన్నరంగయ్య దండు

పరిశోధకులు

ఈ వార్తలు కూడా చదవండి...

టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం: హోంమంత్రి అనిత

మంత్రి నారా లోకేశ్‌పై ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశంసలు..

Updated Date - Feb 19 , 2026 | 01:30 AM