సామాజికవేత్త, మార్గదర్శకుడు
ABN , Publish Date - Jun 05 , 2026 | 01:13 AM
సుసంపన్నమైన భూస్వామ్య కుటుంబంలో జన్మించినా, విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని అణగారిన వర్గాల కోసం తన ఇరవై ఒకటవ యేట నుంచే ప్రజా జీవితాన్ని ప్రారంభించారు రావి నారాయణరెడ్డి...
సుసంపన్నమైన భూస్వామ్య కుటుంబంలో జన్మించినా, విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని అణగారిన వర్గాల కోసం తన ఇరవై ఒకటవ యేట నుంచే ప్రజా జీవితాన్ని ప్రారంభించారు రావి నారాయణరెడ్డి. కాలినడకన, సైకిల్ మీద సుదూర ప్రయాణాలు చేస్తూ ప్రజలలో చైతన్యాన్ని రగిలించి, బానిస భావం పారద్రోలడానికి కృషి చేసిన గొప్ప సామాజికవేత్త ఆయన.
వెట్టిచాకిరీ, బానిసత్వం, అణచివేత, అంటరానితనం నిర్మూలనకు చేస్తున్న పోరాటంలో భాగంగా అణగారిన వర్గాల వారికి విద్య లేకపోవడమే మూలకారణం అని గ్రహించి, విద్యావ్యాప్తికి కృషి చేశారు నారాయణరెడ్డి. మహాత్మాగాంధీ స్థాపించిన ‘అఖిల భారత హరిజన సేవా సంఘ్’ హైదరాబాద్ సంస్థాన శాఖకు కార్యదర్శిగా, ఆ తరువాత అధ్యక్షునిగా పనిచేశారు. ఇందులో భాగంగా వంద హరిజన పాఠశాలలు ఏర్పాటు చేసి, బోధన ఏర్పాట్లు చేశారు. గాంధీ హైదరాబాదు సంస్థాన పర్యటనకు వచ్చినప్పుడు నారాయణరెడ్డి నడుపుతున్న ప్రత్యేక హరిజన పాఠశాలలను సందర్శించి, అభినందించారు. కీర్తిశేషురాలైన తన మొదటి భార్య మీనమ్మ నగలమ్మి రెండు వేల రూపాయలను హరిజన నిధికి విరాళంగా ఇచ్చారు నారాయణరెడ్డి. ఆ నిధితో తన స్వంత ఊరు బొల్లేపల్లిలోనే హరిజన పాఠశాల నెలకొల్పాలని కోరారు. అందుకు హరిజన సేవా సంఘం వారు అంగీకరించి పాఠశాల నెలకొల్పారు.
ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా, ఒకప్పటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1944లో ‘కాన్గి’ పాఠశాల స్థాపించి, బోధన మొదలుపెట్టారు. మొదటి అధ్యాపకులుగా చెరుకుపల్లి కొండయ్యను నియమించారు. అక్కడ పిల్లలను ఆకర్షించే విధంగా యక్షగానం, వీధిబాగోతం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. విద్యా వ్యాప్తి మీద వారికి ఉన్న అకుంఠిత భావాన్ని ఇది తెలియజేస్తుంది. 1960 దశకంలో బొల్లేపల్లి ప్రభుత్వ పాఠశాలను ఒక్కొక్క తరగతీ పెంచుకుంటూ పదవ తరగతి, హెచ్.యస్.సి వరకూ అభివృద్ధి చేశారు. రావి నారాయణరెడ్డి పార్లమెంటు సమావేశాల నిమిత్తమై ఢిల్లీలో ఉన్నప్పుడు తొమ్మిదవ తరగతికి అనుమతి లేకపోవడంతో బొల్లేపల్లి పాఠశాలలో ఎనిమిదవ తరగతి పూర్తయిన విద్యార్థులకు టీసీలు ఇచ్చి పంపించారు. చదువు మానేసిన విద్యార్థులలో కొందరు వ్యవసాయంలోకి దిగారు. ఇంకొందరు తాలూకా కేంద్రం అయిన భువనగిరి హైస్కూలులో చేరారు. పార్లమెంటు సమావేశాలు ముగిశాక గ్రామానికి వచ్చిన రావి నారాయణరెడ్డి పాఠశాలను సందర్శించారు. ప్రధానోపాధ్యాయుడు చెప్పిన విషయం విని హతాశుడైన ఆయన, వెంటనే జిల్లా కేంద్రం నల్లగొండకు వెళ్లి తగిన రుసుము చెల్లించి తొమ్మిదవ తరగతి బోధనకు ఉత్తర్వులు విడుదల చేయించారు. స్వయంగా తాలూకా కేంద్రంలోని ఉన్నత పాఠశాలకు వెళ్లి, ప్రధానోపాధ్యాయుడికి విషయం వివరించి, తన గ్రామ విద్యార్థులను తిరిగి బొల్లేపల్లికి తీసుకొచ్చి పాఠశాలలో చేర్పించారు. ఇది రావి నారాయణరెడ్డికి విద్యావ్యాప్తి పట్ల ఉన్న మక్కువ, అంకితభావానికి నిదర్శనం.
భారతదేశ మొట్టమొదటి పార్లమెంటు ఎన్నికల్లో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ కంటే అధికంగా ఓట్లు సాధించారు. అంతేగాక దేశవ్యాప్తంగా అత్యధిక ఓట్లు సాధించిన ఎంపీగా మొట్టమొదటి పార్లమెంటులో అడుగుపెట్టారు. పద్మవిభూషణ్ పురస్కృతులు కీ.శే. రావి నారాయణరెడ్డి విశిష్ట జీవిత విధానం భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా అందించే బాధ్యత నేటి తరంపై ఉన్నది.
చెరుకుపల్లి శ్రీనివాసు
అధ్యక్షులు, రావి నారాయణరెడ్డి సేవా సంస్థ
(నేడు రావి నారాయణరెడ్డి జయంతి)
ఇవి కూడా చదవండి...
రెండేళ్లలో ఏం చేశామో ప్రజలకు వివరించండి.. మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశం
బలమైన భారత్ కోసం యువత ఎదురుచూపు: పవన్ కల్యాణ్
Read Latest AP News And Telugu News