Share News

రాజ్యాంగ నైతికతకు కవిత్వ రూపం!

ABN , Publish Date - Jun 22 , 2026 | 01:31 AM

సంపద సృష్టికర్తలైన దళిత బహుజనులే ఈ దేశ సాంస్కృతిక నిర్మాతలనే, నాగరికతకు మూలమనే ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తూ కోయి కోటేశ్వరరావు ‘నాగస్వరం’ కవితా సంపుటిని తీసుకొచ్చాడు. ఇది దళితతాత్త్వికతను, దళిత ఈస్తటిక్స్‌ని...

రాజ్యాంగ నైతికతకు కవిత్వ రూపం!

‘‘ప్రణవనాదాలెన్ని ప్రతిధ్వనించినా/ ఆదిమస్వరం నాదే/ ధరిత్రికి ఊపిరి నేను/ చరిత్రకు తొలి అక్షరం నేను/ నాగరికతకు నారుపోసి/ నీరు పోసింది నేను/ సంస్కృతికి బొడ్డుకోసి పేరుపెట్టింది నేనే/ సంగీత సాహిత్యాలు/ నాచెమట బొట్టు కన్నబిడ్డలు/... ఉన్మాదంపై/ నాది నిత్యదండయాత్ర/ నేనే నిజమైన దేశభక్తుడిని’’

(‘నాగస్వరం’)

సంపద సృష్టికర్తలైన దళిత బహుజనులే ఈ దేశ సాంస్కృతిక నిర్మాతలనే, నాగరికతకు మూలమనే ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తూ కోయి కోటేశ్వరరావు ‘నాగస్వరం’ కవితా సంపుటిని తీసుకొచ్చాడు. ఇది దళితతాత్త్వికతను, దళిత ఈస్తటిక్స్‌ని వాగ్దానం చేసే అత్యంత శక్తివంతమైన కవిత్వం. సంప్రదాయ సాహిత్యలోని ‘సత్యం, శివం, సుందరం’ అనే భావనలకు భిన్నంగా సమానత్వం, స్వేచ్ఛ, సామాజికన్యాయం అనే రాజ్యాంగ నైతిక సూత్రాలను కళాత్మకంగా కవిత్వీకరించడం కోటేశ్వరరావు ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది.

గత మూడు దశాబ్దాలుగా తాను ప్రత్యక్షంగా గమనిస్తున్న మనువాద సమాజ తీరుతెన్నులను; రాజకీయ, ఆర్థిక స్థితిగతులను; దళిత, బహుజన జీవితాల వేదనలను కోటేశ్వరరావు విమర్శనాత్మకంగా కవిత్వంలో పలికించాడు. దళిత కుటుంబంలో జన్మించిన కోయి, బాల్యంలో ఆకలీ అవమానాలను అనుభవించి, ఆ అనుభవంతో తెలుగు సాహిత్యంలో తనదైన ప్రత్యేక గొంతుతో కవిత్వం రాశాడు. సంప్రదాయ సాహిత్యంతో పాటు ఆధునిక సాహిత్యతత్త్వాన్ని అవగాహన చేసుకున్న సహృదయ కవిపండితుడు, విమర్శకుడు కోయి.


దళిత జీవితంలోని పేదరికం, కులవివక్ష, రోజువారీ అణచివేతల వంటి దళిత వాస్తవికత, సంఘర్షణలను, వారి శ్రమతత్త్వాన్ని కవి సజీవంగా కవిత్వీకరించాడు: ‘‘వేదంలో ఏముందో తెలియదు గానీ/ మా అయ్య స్వేదంలోనే సృష్టి జీవం ఉంది’’ (‘ప్రాణవాయువు’); ‘‘పత్తిచేలో ఇంకిపోయిన నెత్తురంతా/ మట్టిపెదాలమీద తెల్లగా నవ్వితేనే కదా నువ్వు బతికి బట్టకట్టింది’’ (‘లద్దెపురుగు’) తల్లిదండ్రుల శ్రమను కేవలం కష్టానికి ప్రతీకగా మాత్రమే కాకుండా, సృష్టికి మూలంగా చిత్రించడంలో ఎంతో ఔచిత్యాన్ని ప్రదర్శించాడు: ‘‘మట్టిమబ్బుల్లో చెమటచుక్కల్ని నాటి/ ఎండి ఎన్నెల్ని బస్తాలకెత్తే’’ శ్రామికుడైన తండ్రిని ‘‘నల్ల చంద్రుడిగా’’ అభివర్ణించడం దళితకళాతత్త్వానికి నిదర్శనం. శ్రమను వెన్నెలతో పోల్చి దళిత శ్రమను విశ్వవ్యాప్త సృజనాత్మక శక్తిగా ఆవిష్కరించాడు. ‘కొత్త చెప్పులు’ కవితలో, ‘‘వొడ్లగింజల్లో ఇంకిపోయిన/ మా అయ్య వొంటిసత్తువ/ కూటికుండలో/ తుకతుక ఉడక్కపోతే/ ఊరికి కూడెట్టా దొరికేది?’’ అనే ప్రశ్నలు శతాబ్దాలుగా అణచివేయబడిన శ్రమదోపిడీని నిలదీస్తాయి. తాపీమేస్త్రిగా పనిచేస్తున్న తన తమ్ముడు శివ శ్రమ ఔన్నత్యాన్ని ‘నమశ్శివాయ’ కవితలో బొమ్మకట్టించాడు: ‘‘మిట్ట మధ్యాహ్నం వాడు మోస్తున్న/ ఇటుకల కాంతిలో ఎరుపెక్కిన చెమట చుక్కలు/ తనువు నుండి రాలి పడుతుంటే/ నేల తల్లిపై పగడాలవాన కురిసినట్లుండేది/ ఒంటి నిండా సిమెంటు ధూళితో/ తమ్ముడు సాయంత్రం ఇంటికి వస్తున్నప్పుడు/ భస్మాంగరాగయ నమశ్శివాయ అంటూ/ అంటూ పంచభూతాలు జేజేలు పలుకుతాయి’’.

దళిత స్త్రీ జీవితం, కులవ్యవస్థతో పాటు పితృస్వామ్య వ్యవస్థలో కూడా బానిసత్వానికి గురవుతుంది. దీన్ని ‘‘బానిసకు బానిస’’ అనే బలమైన భావనతో ఆవిష్కరించాడు. ‘పత్తి పువ్వు’ కవితలోని ‘‘ఊరందరికీ మా అయ్య బానిసైతే/ పాపం అమ్మ, మా అయ్యక్కూడ బానిస’’ అనే పంక్తులు దళిత స్త్రీ ఎదుర్కొనే అంతర్గత అణచివేతను సూచిస్తాయి. ‘‘మాసిపోయిన వరదగుడి లాంటి/ అమ్మను చూసినప్పుడల్లా గొంతు చిట్లిపోయి/ పెన్ను నెత్తురు కక్కుతుంది/ అక్షరాలు మోయలేని/ ఒక ఏడుపు కొండ/ కనుల కొమ్మలకు వేలాడుతుంది/ ఆడతనం అంటరానితనాల నడుమ/ అమ్మ రోకలి బండ కింద చితికిన దోసబద్దయి రోదిస్తుంది’’ (‘పత్తిపూవు’) వంటి పదచిత్రాలు దళితస్త్రీలు ఎదుర్కొనే బహుముఖీన వివక్షను నిత్యపోరాటంలోని సంఘర్షణని ప్రతిబింబిస్తాయి.


6-viv.jpg

కవిత్వంలో కేవలం బాధను వ్యక్తం చేసి ఊరుకోకూడదు. దాన్ని ఆయుధంగా మలచి తిరుగుబాటు చేసేలా ప్రేరేపించాలి. ‘గుండెడప్పు’ కవితలో రిజర్వేషన్లపై వచ్చిన విమర్శలకు ధీటుగా ‘‘ధాత్రి వేణువు ఊది/ ధాన్యరాగాలు పలికించే హరిత ప్రతిభ నాది’’, ‘‘అగ్ని ప్రతిభ నాది’’ అంటూ దళిత మేధస్సును, శారీరకశక్తిని గర్వంగా, నిలువెత్తు ఆత్మవిశ్వాసంతో ప్రకటించడం దళిత్‌ ఈస్తటిక్స్‌లో భాగమే. దీన్నే దళిత తిరుగుబాటు, అస్తిత్వ ప్రకటన (Dalit Aesthetics of Resistance and Assertion) అంటారు. ‘ఉలిపికట్టె’ కవితలో, మధ్యాహ్న భోజనంలో కుల వివక్షను ప్రశ్నిస్తూ ‘‘నాచేయి తగలగానే పరబ్రహ్మ స్వరూపం కూడా/ పనికి రానిదైపోయింది...?’’ అని అడగడం ద్వారా, కవి ఆ మత, సాంస్కృతిక ఆధిపత్యం యొక్క పవిత్రత (Purity) అనే భావనను ప్రశ్నించి, తద్వారా ప్రత్యామ్నాయ సంస్కృతిని అన్వేషించాలనే ఆలోచనను కలిగిస్తాడు. ‘‘మన సాంకేతిక పరిజ్ఞానం చంద్రుడి మీద రహస్యాలు శోధిస్తుంటే/ మన సంస్కారం మాత్రం ఇంకా కులం మలాన్ని వాసన చూస్తుంది’’ వంటి విమర్శలతో, ఆధునిక సాంకేతిక యుగంలో కూడా కుల అస్తిత్వాన్ని వదలని అమానుషాన్ని ప్రశ్నిస్తాడు.

కులోన్మాదం, మతసామ్రాజ్యవాదం, అమెరికన్ సామ్రాజ్యవాదం, ప్రపంచీకరణ వ్యతిరేకతపై ‘నాగస్వరం’ ద్వారా కవిత యుద్ధం చేశాడు కవి. ‘‘వాడంతే పరమ యుద్ధోన్మాది/ ఒక్క చమురు బొట్టు కోసం/ లెక్కలేని రక్తసముద్రాలను పొంగిస్తాడు’’ అంటూ అమెరికా దురహంకారాన్ని ఎదిరించాడు. ‘‘నాగజాతి రక్తసంతకాన్నినేను/ ధమ్మపథ బాటసారిని నేను/ సత్యజ్యోతి కిరణాన్ని/ నేను భీమపతాకాన్ని’’ అంటూ కవి తన కవితాదృక్పథాన్ని స్పష్టంగా తెలియజేశాడు. బుద్ధుడు, పూలే, ముఖ్యంగా అంబేద్కర్ సైద్ధాంతిక ఎరుకతో తన కవిత్వానికి అపారమైన శక్తిని సమకూర్చుకొని పాఠకుల్ని ఆలోచింపజేస్తాడు కవి. దళితులు, బహుజనులంతా రాజ్యాధికారం కోసం కలిసి ప్రయాణం చేయాలన్న సందేశాన్ని కవిత్వం ద్వారా అందిస్తున్నాడు. ‘కాలసర్పం’, ‘భీమరాజ్యం’ వంటి కవితలు ఇందుకు ఉదాహరణలు. ఈ కవితా సంపుటికి రాసిన ముందుమాటలో శిఖామణి అన్నట్లుగా ‘తీగల వంతెన’ కవిత కోటేశ్వరరావు ఊహాశాలిత్యానికి పరాకాష్ఠగా కనిపిస్తుంది: ‘‘కాలం ఋతు రాగం శ్రుతి చేయగానే/ నింగికీ నేలకు నడుమ/ వెండి తీగల వంతెన రచిస్తుంది మేఘం/ ఆ వెండి తీగల్లో నిజ ప్రతిబింబాలను దర్శించిన వెలుగు కిరణాలు/ దిక్కుల మెడలో/ ఏడు రంగుల పూల హారాన్ని అలంకరిస్తాయి’’. రాజకీయ కవిత్వం తోపాటు ఇలాంటి అభివ్యక్తి సుందరమైన కవితలు కూడా ‘నాగస్వరం’లో ఉన్నాయి.


ప్రధానంగా ఈ కవితల్లో రాజ్యాంగ నైతికతను ప్రబోధించాడు కవి: ‘‘పుట్టిన దేశం ఋణం తీర్చుకోవడమంటే/ నిజాయితీగా నిన్ను అనుసరించడమే/ నీవు పంచిన విలువలను అనునిత్యం ఆచరించడమే ఇప్పుడు దేశభక్తి అంటే (‘ఐ లవ్ యు’) అంటూ దేశభక్తిని పునర్నిర్వచించాడు. మత గ్రంథాల కంటే, సనాతన, అధునాతన ధర్మాల కంటే రాజ్యాంగమే పవిత్రమైనదని ఈ కవి ఉన్నతంగా భావిస్తున్నాడు. నిజమే కదా?

పండితుల సంస్కృత సాహిత్యానికి భిన్నంగా ప్రజలు నిత్య జీవితంలో ఎలా మాట్లాడుకుంటారో ఆ భాషనే ప్రయోగించడం దళిత్ ఈస్తటిక్స్‌లో భాషాపరమైన దృక్పథాన్ని తెలియజేస్తుంది. వ్యంగ్యం (satire), అధిక్షేపం (sarcasm), ఆర్ద్రత (compassion)తో కూడిన కోటేశ్వరరావు కవిత్వ శైలి పాఠకులను ఆకట్టుకుంటుంది. దళితులు అనుభవించే బాధను విశ్వజనీనం చేస్తూనే, వారి అస్తిత్వ చైతన్యాన్ని ఆత్మగౌరవ పోరాటాన్ని కవి ‘నాగస్వరం’లో సముచితంగా చిత్రించాడు. దళిత అనుభవాలను శక్తిమంతమైన కవిత్వ భాషలోకి తీసుకువచ్చాడు. తెలుగు సాహిత్యంలో దళిత వాస్తవికత బలంగా ఎలా చూపించవచ్చో తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఈ మధ్యకాలంలో వచ్చిన దళిత రచనలన్నింటిలో ‘నాగస్వరం’ ప్రథమ స్థానంలో నిలుస్తుంది.

దార్ల వెంకటేశ్వరరావు

99896 28049

ఈ వార్తలనూ చదవండి:

యూఎస్‌తో డీల్ మాకు అనుకూలం: ఇరాన్ అధ్యక్షుడు

చర్చలు విఫలమైతే మళ్లీ దాడులు చేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్‌ హెచ్చరిక

Updated Date - Jun 22 , 2026 | 01:31 AM