Share News

ఎందరికో స్ఫూర్తి.. మహిళలకు దీప్తి

ABN , Publish Date - Feb 19 , 2026 | 01:28 AM

నాలుగు గోడల మధ్యనే ఉంటూ, నాలుగు దిక్కుల పట్ల అవగాహన కలిగి ఉండటం, నాలుగు దశాబ్దాల కిందట అసాధ్యమే! పోలియో వల్ల కాళ్లు చచ్చుబడి నడవలేని స్థితిలో ఉంటే, చింతిస్తూ కన్నీళ్లతో కాలం గడుపుతారు ఎవ్వరైనా! కానీ ...

ఎందరికో స్ఫూర్తి.. మహిళలకు దీప్తి

నాలుగు గోడల మధ్యనే ఉంటూ, నాలుగు దిక్కుల పట్ల అవగాహన కలిగి ఉండటం, నాలుగు దశాబ్దాల కిందట అసాధ్యమే! పోలియో వల్ల కాళ్లు చచ్చుబడి నడవలేని స్థితిలో ఉంటే, చింతిస్తూ కన్నీళ్లతో కాలం గడుపుతారు ఎవ్వరైనా! కానీ ఎనిమిదేళ్ల వయస్సులో ఒక బాలిక అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. అంగవైకల్యం జీవనయాత్రకు అడ్డుకాదని, సృజనాత్మకతతో ఆలోచించి, జీవితాన్ని రంగులమయం చేసుకోవచ్చని నిరూపించింది ఆ బాలిక. కృషి, పట్టుదల ఉంటే ఎటువంటి క్లిష్ట పరిస్థితులనైనా మనకు అనువుగా మలచుకొని, స్వయంకృషితో సమాజ గుర్తింపు పొందవచ్చునని చాటి చెప్పింది. ఆ బాలికే రాగతి పండరి.

తొలి తెలుగు మహిళా కార్టూనిస్టుగా లక్షలాది పాఠకుల హృదయాల్లో చెదరని ముద్రవేసింది. కార్టూన్‌కు అర్థం తెలియని వయస్సులో ఆమె ఈ రంగంలోకి అడుగుపెట్టింది. కళపై ఉన్న మక్కువతోనే కార్టూన్ కళాకారిణి కాగలిగింది. పుట్టిన ఏడాదికే పోలియో వల్ల ఆమె రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. దాంతో ఆమె ఇంటికే పరిమితమైంది. రాగతికి తన రెండో అక్క రత్నకుమారి రాయడం, చదవడం నేర్పింది. ఇంటికి వచ్చే పుస్తకాలు చదవడం, అందులో వచ్చే కార్టూన్లు అర్థం చేసుకోవడంతో వాటిపై ఆమెకు అభిరుచి పెరిగింది. ఆమెకూ కార్టూన్లు గీయాలన్న కోరిక కలిగింది. తన ఎనిమిదవ ఏట ప్రారంభమైన కార్టూన్ల సృష్టి, ఆమె మరణించే వరకూ కొనసాగించింది.

ప్రముఖ తెలుగు కార్టూనిస్టులు జయదేవ్, బాపు, బాలి, గోపి, బి.ఎస్.రాజు వంటి వారు ఆమెకు తగిన సూచనలు, సలహాలను ఉత్తరాల ద్వారా, స్వయంగా కలిసినప్పుడు తెలిపేవారు. ఆమె ఆ మెళకువలు నేర్చుకుని, అవలీలగా అల్లుకుపోయారు. ప్రతి తెలుగు పత్రికలో ఆమె కార్టూన్లు ప్రచురితమై, విశేష ప్రాచుర్యం పొందాయి. ప్రతి పాఠకుడి మనసునూ మురిపించాయి. మూడున్నర దశాబ్దాల పాటు ఆమె 25వేలకు పైగా కార్టూన్లు గీశారు. అధిక ధరలు, వరకట్నం, ర్యాగింగ్, మంచినీటి కొరత, కాలుష్యం వంటి సామాజిక సమస్యలే కాక, సంక్రాంతి, ఉగాది, వినాయక చవితి, దసరా, దీపావళి వంటి పండుగల పైనా పలు కార్టూన్లు గీశారు. ఆమె మేధస్సులో మెరిసిన మెరుపులు అనేకం!


ప్రముఖ రచయిత ఎల్యూ నారాయణరావుతో కలిసి ‘యవ్వనం పిలిచింది, అయ్యో పాపం అబ్బాయిలు, దెయ్యాలు ఎక్కడ ఉన్నాయి?’ వంటి కార్టూన్ కథలు అల్లారు. సిక‘రాజ’కీయంలో, రాజకీయ‘చెద’రంగం శీర్షిక పదేళ్ళు కొనసాగింది. అదేవిధంగా, పొడుగు–పొట్టి అమ్మాయిలు, నవగ్రహం–అనుగ్రహం, మగాడి చెవిలో పూవు, అంకాలమ్మ– అడవిలో వంటి కార్టూన్ సీరియల్స్ విశేష ఆదరణ పొందాయి. ఆమె చిత్రించిన 200 కార్టూన్లతో ‘నవ్వుల విందు–కార్టూన్ల పసందు’ పేరుతో విశాలాంధ్ర పుస్తకాన్ని ప్రచురించింది. ఆమె ఆత్మకథ ‘నా గురించి నేను’ విశాఖకు చెందిన చిత్రకళా పరిషత్ ప్రచురించింది.

మద్రాసు తెలుగు అకాడమీ ‘ఉగాది’ పురస్కారాన్ని నాటి గవర్నర్ రంగరాజన్ నుంచి, ‘కళారత్న’ ప్రతిభా పురస్కారాన్ని మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి నుంచి రాగతి పండరి అందుకున్నారు. ఆమె మృతి చెందడానికి వారం ముందు ఆసుపత్రి మంచంపై ఉండి కూడా రెండు చక్కని హాస్యకార్టూన్లు గీసి అక్కడి సిబ్బందిని ఆనందపర్చారు. మరణానంతరం తన దేహం సమాజానికి ఉపయోగపడాలని భావిస్తూ, విశాఖలోని ఎస్.ఆర్.వైద్యకళాశాలకు తన దేహాన్ని రాసిచ్చేయడం ఆమెలోని మానవతా విలువలకు నిదర్శనం. నేడు రాగతి పండరి వర్ధంతి. ఆమె భౌతికంగా మృతి చెందినా కార్టూనిస్టుల మనసుల్లో చిరకాలం నిలిచే ఉంటారు.

సుంకర చలపతిరావు

ఈ వార్తలు కూడా చదవండి...

టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం: హోంమంత్రి అనిత

మంత్రి నారా లోకేశ్‌పై ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశంసలు..

Updated Date - Feb 19 , 2026 | 01:28 AM