ప్రశ్నే నేరమైతే... ఇంకెక్కడి ప్రజాస్వామ్యం?
ABN , Publish Date - Aug 01 , 2026 | 12:54 AM
ప్రజాస్వామ్యంలో అధికారానికి అతిపెద్ద శత్రువు ప్రతిపక్షం కాదు, ప్రశ్న. ఎందుకంటే ప్రతిపక్షాన్ని ఎన్నికల్లో ఓడించవచ్చు. కానీ ప్రశ్నను ఓడించడం అసాధ్యం. ప్రశ్నకు సమాధానం చెప్పవచ్చు, తప్పును..
ప్రజాస్వామ్యంలో అధికారానికి అతిపెద్ద శత్రువు ప్రతిపక్షం కాదు, ప్రశ్న. ఎందుకంటే ప్రతిపక్షాన్ని ఎన్నికల్లో ఓడించవచ్చు. కానీ ప్రశ్నను ఓడించడం అసాధ్యం. ప్రశ్నకు సమాధానం చెప్పవచ్చు, తప్పును సరిదిద్దవచ్చు, విధానాన్ని మార్చవచ్చు. కానీ ప్రశ్ననే నేరంగా మార్చే ప్రయత్నం మొదలైన క్షణం నుంచే ప్రజాస్వామ్యం తన ఆత్మను కోల్పోవడం ప్రారంభిస్తుంది.
ఒక ప్రభుత్వం రాజ్యాంగం కంటే గొప్పది కాదు. ఒక ప్రధానమంత్రి దేశం కంటే గొప్పవాడు కాదు. ఏ రాజకీయ పార్టీ కూడా దేశభక్తికి ఏకైక నిర్వచనం కాదు. అయినా, అధికారాన్ని ప్రశ్నించే ప్రతి స్వరాన్నీ దేశద్రోహంతో ముడిపెట్టే రాజకీయ వాతావరణం ఏర్పడుతోందనే భావన సమాజంలో పెరుగుతోంది. ప్రభుత్వ పనితీరు నిజంగా బలంగా ఉంటే ప్రశ్నలకు ఎందుకు భయపడాలి? ఆధారాలు, గణాంకాలు, ఫలితాలు తమవైపు ఉంటే విమర్శకులను దేశ వ్యతిరేకులు, విదేశీ ప్రభావితులు, రాజకీయ కుట్రదారులుగా చిత్రీకరించాల్సిన అవసరం ఏముంది? ప్రజాస్వామ్యంలో బలమైన ప్రభుత్వం తన విజయాలను ఆధారాలతో నిరూపిస్తుంది; విమర్శకుల వ్యక్తిత్వాన్ని లక్ష్యంగా చేసుకోదు.
దేశభక్తి అంటే అధికారాన్ని ప్రశంసించడం మాత్రమే కాదు. తప్పు జరిగితే ప్రశ్నించడం కూడా దేశభక్తే. వంతెన కూలిపోతే కారణం అడగడం దేశద్రోహం కాదు. పరీక్షల నిర్వహణలో వైఫల్యం జరిగితే బాధ్యులను నిలదీయడం కుట్ర కాదు. నిరుద్యోగ యువత ఉద్యోగాలు ఎక్కడ అని అడగడం దేశ వ్యతిరేకత కాదు. మహిళల భద్రతపై ప్రశ్నించడం మత వ్యతిరేకత కాదు. ఇవన్నీ రాజ్యాంగం ప్రతి పౌరుడికీ ఇచ్చిన హక్కులు. ప్రతి విమర్శకుడినీ శత్రువుగా చిత్రీకరిస్తూ పోతే, చివరకు దేశభక్తి కూడా ఒక రాజకీయ పార్టీకి పరిమితమైన భావనగా మారిపోతుంది. మిగతా ప్రజలంతా అనుమానితులుగా మిగిలిపోతారు. ఇది రాజకీయ అతిశయోక్తి కాదు; ప్రజాస్వామ్యానికి నిజమైన ప్రమాదం. ఎందుకంటే దేశం అంటే ప్రభుత్వం కాదు. ప్రభుత్వం అంటే దేశం కాదు. అధికార పార్టీ అంటే భారతదేశం కాదు. ఈ తేడా చెరిగిపోతే ప్రజాస్వామ్యం బలహీనపడటం ప్రారంభమవుతుంది.
చరిత్ర స్పష్టంగా చెబుతోంది... ప్రశ్నలను గౌరవించిన దేశాలు అభివృద్ధి చెందాయి; విమర్శలను అణచివేసిన వ్యవస్థలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయి. అధికారాన్ని ప్రశ్నించిన వారిని దేశద్రోహులుగా ముద్రించిన పాలకులు చరిత్రలో గుర్తుండిపోయింది వారి అసహనం వల్లే తప్ప, వారి విజయాల వల్ల కాదు.
శ్రీనివాస్‌గౌడ్ ముద్దం
ఈ వార్తలనూ చదవండి:
పీఓకేలో దాడులపై తీవ్రంగా స్పందించిన భారత్
కరాచీలో ‘ధురంధర్’ సీన్ రిపీట్.. ఉజైర్ బలోచ్ సోదరుడిపై కాల్పులు