Share News

పులిచింతల ఎత్తిపోతలతో ఏపీకి విఘాతం!

ABN , Publish Date - Aug 06 , 2026 | 03:42 AM

కృష్ణానది జలాల వినియోగం విషయంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్–తెలంగాణ మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో పులిచింతల ప్రాజెక్టు పరిధిలో తెలంగాణ ప్రభుత్వం అవసరమైన అనుమతులు...

పులిచింతల ఎత్తిపోతలతో ఏపీకి విఘాతం!

కృష్ణానది జలాల వినియోగం విషయంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్–తెలంగాణ మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో పులిచింతల ప్రాజెక్టు పరిధిలో తెలంగాణ ప్రభుత్వం అవసరమైన అనుమతులు లేకుండా ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు 2,500 క్యూసెక్కుల నీటిని తరలించే ప్రయత్నాలు జరగడం రెండు రాష్ట్రాల మధ్య మరో వివాదానికి దారి తీస్తోంది. పులిచింతల ప్రాజెక్టు పరిధిలో తెలంగాణ భూభాగమైన బుగ్గ మాధారం–దొండపాడు గ్రామాల వద్ద కృష్ణానది ఒడ్డున రూ.394 కోట్లతో రాజీవ్ గాంధీ లిఫ్ట్ పథకానికి శ్రీకారం చుట్టి, రోజుకు 2,500 క్యూసెక్కుల నీటిని తరలించే సామర్థ్యంతో, కృష్ణానది నుంచి తెలంగాణలో కిలోమీటరు పరిధిలో పెద్ద కాల్వ నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ ఎత్తిపోతల పథకం దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు నీటి ముప్పు తెచ్చిపెట్టనున్నది. ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో కృష్ణానదిపై ఉన్న 21 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంతేకాదు, ఆర్.డబ్ల్యూ.ఎస్ స్కీముల ద్వారా అందే తాగునీటికి కూడా తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలతో కలిపి మొత్తం 51 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు మూలనపడే ప్రమాదం ఉంది. దీనివల్ల దాదాపు 50 వేల ఎకరాలకు సాగునీరు అందక రైతులు తీవ్రంగా నష్టపోతారు.

అసలు పులిచింతల ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యం నదీప్రవాహాన్ని నియంత్రించి, దిగువ ప్రాంతానికి సాగునీరు అందించడం, తాగునీటి అవసరాలను తీర్చడం. పులిచింతల ప్రాజెక్టు నీటిపైనే కృష్ణా డెల్టా, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, బాపట్ల, కృష్ణా జిల్లాల రైతులు ఆధారపడి ఉన్నారు. నీటి లభ్యత లేకపోతే ఆ ప్రాంత పంటలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణం చట్టబద్ధమైన అనుమతులతోనే చేపట్టారా? లేక ఏకపక్షంగా నిర్మిస్తున్నారా? పులిచింతల ఎత్తిపోతలపై వస్తున్న ఆరోపణల మీద సంబంధిత అధికారులు వెంటనే విచారణ జరిపి, అనుమతులు, నీటి వినియోగం, నిర్మాణాల చట్టబద్ధతపై పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాలి. అనుమతులు లేకుండా ఎత్తిపోతల నిర్మాణం జరిగితే అది తీవ్రమైన విషయంగా పరిగణించాలి. ఎగువ రాష్ట్రం చేపట్టే ప్రతి నీటి ప్రాజెక్టు, దిగువ రాష్ట్ర ప్రజల జీవనాధారాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కనుక ఆంధ్రప్రదేశ్ వ్యక్తం చేస్తున్న ఆందోళన లక్షలాది రైతుల భవిష్యత్తు, తాగునీటి భద్రత, సాగునీటి హక్కులకు సంబంధించినది.


పులిచింతల దిగువన నీటిపై తెలంగాణకు ఎలాంటి అధికారిక హక్కులూ లేవు. అయినా తమ భూభాగంలో నిర్మించుకుంటున్నామని, వరద నీటినే వాడుకుంటామనే వాదనతో ఏకపక్షంగా తెలంగాణ ముందుకు వెళ్లడం వల్ల దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలగనున్నది. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 84, 85 ప్రకారం కృష్ణా బేసిన్‌లో చేపట్టే ఏ కొత్త ఎత్తిపోతల పథకానికైనా కఠినమైన నిబంధనలు ఉన్నాయి. కేంద్ర జలశక్తి మంత్రి అధ్యక్షతన ఉండే అపెక్స్ కౌన్సిల్ ఆమోదంతో కృష్ణా బోర్డు (కెఆర్‌ఎంబి) అనుమతి తప్పనిసరి. అటవీ శాఖ క్లియరెన్సులు, నిపుణుల కమిటీ నుంచి ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ పొందాలి. పొరుగు రాష్ట్రానికి 10 కిలోమీటర్ల దూరంలో నిర్మించే ఏ ప్రాజెక్టుకైనా ఆ రాష్ట్ర అనుమతి తీసుకోవాలి. ఈ నిబంధనలన్నింటినీ విస్మరించి, కనీస అనుమతులు కూడా లేకుండా తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టడం బాధ్యతారహితం. పులిచింతల దిగువన నీటిపై తెలంగాణ నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకంపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, సంబంధిత నదీ నిర్వహణ సంస్థలు, అవసరమైతే కృష్ణానది జలాల నిర్వహణకు సంబంధించిన సంస్థలు వాస్తవ పరిస్థితిని పరిశీలించి, చట్టబద్ధతపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ రైతులకు సాగునీరు, తాగునీటి భద్రత, డెల్టా ప్రాంతాల భవిష్యత్తు దృష్ట్యా కృష్ణా జలాల వినియోగంపై ప్రతి నిర్ణయం రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా, పరస్పర అంగీకారంతోనే అమలు కావాలి.

నీరుకొండ ప్రసాద్

ఇవీ చదవండి:

'నేను ఎంకే స్టాలిన్ తనయుడిని'.. ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు

తమిళనాడు బడ్జెట్: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. జెన్‌ జీకి రూ.2 వేల కోట్లు

Updated Date - Aug 06 , 2026 | 03:42 AM