Share News

‘పిల్‌’ ఎప్పటికీ అవసరమే!

ABN , Publish Date - Jun 05 , 2026 | 01:18 AM

ఇటీవల సుప్రీంకోర్టు ఒక రివ్యూ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దురుపయోగం అవుతున్నాయనీ, వాటికి స్వస్తిపలకాలనీ..

‘పిల్‌’ ఎప్పటికీ అవసరమే!

ఇటీవల సుప్రీంకోర్టు ఒక రివ్యూ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దురుపయోగం అవుతున్నాయనీ, వాటికి స్వస్తిపలకాలనీ భారత సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టును కోరగా, దానిపై ప్రతిస్పందించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకరు– ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పబ్లిక్‌ ఇంటరెస్ట్‌ లిటిగేషన్స్) ఇప్పుడు ‘‘ప్రైవేట్‌ ఇంటరెస్ట్‌ లిటిగేషన్లు’’ గానూ, ‘‘పైసా ఇంటరెస్ట్‌ లిటిగేషన్లు’’ గానూ, ‘‘పొలిటికల్‌ ఇంటరెస్ట్‌ లిటిగేషన్లు’’ గానూ మారాయని వ్యాఖ్యానించారు.

సాధారణంగా ఏ వ్యక్తి అయినా కోర్టులో కేసు వేయాలంటే స్వయంగా తనే బాధితుడు/ బాధితురాలు అయ్యుండాలి. అంటే, తనకు వ్యక్తిగతంగా ఏదైనా చట్టపరమైన లేదా రాజ్యాంగపరమైన హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ఆ వ్యక్తి కేసు వేయవచ్చు. ఆ వ్యక్తి తరఫున మరెవరూ కేసు వేయటానికి వీల్లేదు. దీన్నే ‘‘లోకస్ స్టాండయి’’ అంటారు. అంటే ఏదైనా కేసు విచారించే ముందు, ఆ కేసులో పిటిషనర్ ఏ విధంగా బాధితుడో/ బాధితురాలో కోర్టులు తప్పనిసరిగా పరిశీలిస్తాయి. ఒకవేళ, పిటిషనర్‌కు ఆ కేసుతో వ్యక్తిగతంగా ఏ విధంగానూ సంబంధం లేకపోతే ఆ కేసును కొట్టివేస్తాయి. దీనికి భిన్నంగా వచ్చిందే ప్రజా ప్రయోజన వ్యాజ్యం.

ఒక వ్యక్తికి గానీ, ఒక సమూహానికి గానీ హక్కుల భంగం జరిగినప్పటికీ వారు పేదరికం వల్ల కానీ, సామాజిక వెనుకబాటుతనం వల్ల గానీ న్యాయస్థానాలను ఆశ్రయించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారి హక్కులను కాపాడేందుకు ప్రజాహితం కోరే ఏ నాగరికుడైనా ముందుకు వచ్చి ప్రజా ప్రయోజన వ్యాజ్యం ద్వారా న్యాయస్థానానికి రావచ్చును. ఇంకా ముందుకు వెళ్లి, పోస్టుకార్డు రాసినా దానిని పిటిషన్‌గా స్వీకరించి ఎన్నో కేసుల్లో న్యాయం జరిపారు. అప్పటి నుంచి సుప్రీంకోర్టు, హైకోర్టులలో ఎంతోమంది ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేసి సమాజంలో మార్పు కోసం, చట్టాల్లో మార్పు కోసం శ్రమించారు.


కపిల హింగోరాని అనే మహిళా న్యాయవాది ప్రజా ప్రయోజన వ్యాజ్యాలకు ఆద్యురాలు. ఆమె 1979లో మొదటిసారిగా సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. ఆ కేసు ద్వారా ఎన్నో ఏళ్లుగా జైళ్లలో దయనీయమైన స్థితిలో మగ్గుతున్న స్త్రీ, బాల, వృద్ధులతో సహా వేల సంఖ్యలో ‘‘అండర్ ట్రయల్‌ ఖైదీ’’లను విడుదల చేయించారు. ఆ విధంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు మొదలై దాదాపు యాభై ఏళ్లు కావస్తున్నది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.ఆర్.కృష్ణ అయ్యర్, జస్టిస్ పి.ఎన్.భగవతి చొరవతో ‘‘లోకస్ స్టాండయి’’ నియమాన్ని పక్కన పెట్టి న్యాయం వైపు నిలబడ్డారు. తరువాత మరెన్నో కేసుల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను జస్టిస్ పి.ఎన్.భగవతి అనుమతించారు.

ప్రముఖ రాజకీయ నాయకుడు, అరుణ్ శౌరి తండ్రి, హరిదేవ్‌ శౌరి ‘కామన్ కాస్’ అనే సంస్థ ద్వారా ఎన్నో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను సుప్రీంకోర్టులో వేసి అవినీతి నిర్మూలనకు పాటుపడ్డారు. అట్లాగే, ఎమ్.సి.మెహతా అనే న్యాయవాది, పర్యావరణం, కాలుష్యంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యాల ద్వారా పోరాడి యమునా నది కాలుష్యం, తమిళనాడు శివకాశి టపాకాయల పరిశ్రమలో బాల కార్మికుల మరణాలు... ఇంకా మరెన్నో అంశాలను ప్రభుత్వం దృష్టికి వచ్చేలా చేశారు. అలాగే, సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా ఎన్నో ప్రజా ప్రయోజన వ్యాజ్యాల ద్వారా సమాజ సేవ చేశారు.

అధికారుల కార్ల మీద ఉపయోగించే ఎర్ర లైట్ నుంచి, పబ్లిక్ స్థలాల్లో మైకులు, సినిమా హాళ్లలో జాతీయ గీతం ఆలపించడం, దీపావళి టపాకాయల నియంత్రణ, వాహనాల్లో ప్రయాణికులకు తప్పనిసరి సీట్ బెల్ట్, పారిశ్రామిక కాలుష్యం, వీధి కుక్కల బెడద, పనిచేసే ప్రదేశాలల్లో లైంగిక హింస, రహదారి ప్రమాదాలు... మొదలైన ఎన్నో అంశాలపై ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. అట్లాగే, 2జీ స్కామ్, బొగ్గు స్కామ్ కేసుల్లో కూడా లైసెన్సులను రద్దు చేసింది. ట్రిపుల్ తలాక్, స్వలింగ సంపర్కుల హక్కులు, కారుణ్య మరణం మొదలైన ఎన్నో బహుళ సాంఘిక ప్రయోజనాలున్న కేసులను ప్రజా ప్రయోజన వ్యాజ్యాల ద్వారా పరిష్కరించింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు లేకుంటే ఎన్నో విస్తృత ప్రజా ప్రయోజనాలు చేకూరేవి కాదు.

అయితే, కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం లేదా కీర్తి కాంక్షతో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేస్తున్నమాట నిజం. అటువంటి విచారణార్హం కాని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను సుప్రీంకోర్టు, హై కోర్టులు ఎలాగూ జరిమానాలు సైతం విధించి తిరస్కరిస్తున్నాయి. కాబట్టి, ఎవరో కొందరు దురుపయోగం చేస్తున్నారన్న కారణంతో, ఎన్నో రకాలుగా ఉపయోగపడే ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకోవడం సరికాదు.

హరీశ్‌కుమార్‌ కొలిచాల

ఇవి కూడా చదవండి...

రెండేళ్లలో ఏం చేశామో ప్రజలకు వివరించండి.. మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశం

బలమైన భారత్‌ కోసం యువత ఎదురుచూపు: పవన్ కల్యాణ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 05 , 2026 | 01:18 AM