ఆత్మగౌరవ పోరాట పథ నిర్దేశకుడు
ABN , Publish Date - Aug 06 , 2026 | 03:45 AM
డాక్టర్ కొత్తపల్లి జయశంకర్ పేరు వినగానే తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఆత్మగౌరవం, నిస్వార్థ సేవ, ప్రజా చైతన్యం, ప్రాంతీయ న్యాయం, శాస్త్రీయ ఆలోచన వంటివన్నీ ఒకేసారి గుర్తుకు వస్తాయి. తెలంగాణ రాష్ట్ర..
డాక్టర్ కొత్తపల్లి జయశంకర్ పేరు వినగానే తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఆత్మగౌరవం, నిస్వార్థ సేవ, ప్రజా చైతన్యం, ప్రాంతీయ న్యాయం, శాస్త్రీయ ఆలోచన వంటివన్నీ ఒకేసారి గుర్తుకు వస్తాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పునాది వేసిన భావజాల శిల్పిగా, ఉద్యమానికి సిద్ధాంతకర్తగా, ప్రజలకు దిశానిర్దేశం చేసిన మహోన్నత మేధావిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. అందుకే తెలంగాణ ప్రజలు ఆయనను ప్రేమతో ‘తెలంగాణ జాతిపిత, తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ ఉద్యమ మార్గదర్శి’గా గౌరవిస్తారు.
జయశంకర్ 1934 ఆగస్టు 6న నాటి వరంగల్ జిల్లాలోని అక్కంపేట గ్రామంలో జన్మించారు. బాల్యం నుంచే ఆయనకు సామాజిక సమస్యలపై ఆసక్తి ఉండేది. విద్యార్థి దశలోనే ప్రాంతీయ అసమానతలను గమనించారు. నిజాం పాలన అనంతరం హైదరాబాద్ రాష్ట్ర విలీనం, ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను దగ్గరగా అధ్యయనం చేశారు. విద్య, ఉద్యోగాలు, సాగునీరు, బడ్జెట్ కేటాయింపులు, పరిశ్రమలు వంటి అన్ని రంగాలలో తెలంగాణ వెనుకంజలో ఉన్నదని గణాంకాలతో సహా నిరూపించారు. అందుకే ఆయనను ‘నడిచే విజ్ఞాన సర్వస్వం’గా అనేకమంది అభివర్ణించారు. భావోద్వేగాలతో కాకుండా శాస్త్రీయ విశ్లేషణలతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన అరుదైన మేధావి ఆయన.
1952లో జరిగిన ముల్కీ ఉద్యమంలో పాల్గొన్న జయశంకర్, అప్పుడే తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాటం చేయాలని సంకల్పించుకున్నారు. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత... పెద్దమనుషుల ఒప్పందం, ముల్కీ నిబంధనలు, ప్రాంతీయ హామీలు అమలు కాకపోవడం వల్ల తెలంగాణ ప్రజలు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారని నివేదికలు, గణాంకాలతో నిరూపించారు.
ఆర్థికశాస్త్రంలో ఉన్నత విద్యాభ్యాసం చేసిన జయశంకర్, ఉపాధ్యాయుడిగా తన వృత్తిని ప్రారంభించారు. తరువాత కళాశాల అధ్యాపకుడిగా, ప్రిన్సిపాల్‌గా, విశ్వవిద్యాలయ పరిపాలనలో కీలక బాధ్యతలు నిర్వహించి చివరకు కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా సేవలందించారు. జయశంకర్ రచనలు తెలంగాణ ఉద్యమానికి దిక్సూచిగా నిలిచాయి. 1969 తెలంగాణ ఉద్యమం ఆయన జీవితంలో కీలక మలుపు. వేలాది మంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చిన ఆ ఉద్యమానికి మేధోబలాన్ని అందించిన వ్యక్తుల్లో జయశంకర్ ప్రధానులు. ఉద్య మాన్ని అణచివేసినా ఆయన వెనక్కు తగ్గలేదు. ‘ఉద్యమాలు తాత్కాలికంగా ఆగవచ్చు కానీ ప్రజల ఆకాంక్షలు ఎప్పటికీ చనిపోవు’ అనే నమ్మకంతో తన పరిశోధనలను కొనసాగించారు. ఆయన ఎప్పుడూ ప్రాంతీయ విద్వేషం చూపలేదు. ఇతర ప్రాంతాల ప్రజలపై ద్వేషం చూపకుండా, తెలంగాణకు న్యాయం జరగాలని మాత్రమే కోరారు.
తెలంగాణ ఉద్యమం రెండో దశలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. రాజకీయ నాయకులకు, విద్యార్థి సంఘాలకు, ఉద్యోగ సంఘాలకు, మేధావులకు ఒకే లక్ష్యం చూపిస్తూ ఉద్యమాన్ని సమన్వయం చేశారు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం వ్యక్తుల విజయం కాదు, ప్రజల సంకల్ప విజయం కావాలి’ అని ఆయన చెప్పిన మాటలు ఉద్యమానికి నైతిక బలాన్నిచ్చాయి. జయశంకర్ వ్యక్తిత్వంలో అత్యంత గొప్ప లక్షణం నిస్వార్థం. సాదాసీదా జీవితం గడిపారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం జీవితాన్ని అంకితం చేశారు. ప్రజల మధ్యే జీవించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటమే తన జీవిత లక్ష్యమని ప్రకటించి, చివరి శ్వాస వరకు ఆ ధ్యేయంతో పనిచేశారు.
ఆయన ప్రసంగాలలో ఎప్పుడూ ఒక విషయం స్పష్టంగా కనిపించేది. తెలంగాణ అభివృద్ధి అంటే కేవలం కొత్త రాష్ట్రం ఏర్పడటం మాత్రమే కాదని, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, గ్రామీణాభివృద్ధి, సాగునీటి విస్తరణ, నాణ్యమైన విద్య, యువతకు ఉపాధి, రైతుల సంక్షేమం, మహిళల సాధికారత కలిసివచ్చినప్పుడే నిజమైన తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుందని జయశంకర్ వివరించేవారు. ఆయన ఆలోచనలు రాష్ట్ర ఏర్పాటుతో ముగిసిపోలేదు; తెలంగాణ భవిష్యత్తుకు మార్గదర్శక సూత్రాలుగా నిలిచాయి.
డాక్టర్ కొత్తపల్లి జయశంకర్ జీవితం– ఒక వ్యక్తి ఎంతటి మార్పుకు కారణం కావచ్చో నిరూపించిన మహోన్నత ఉదాహరణ. తెలంగాణ చరిత్రలో ఆయన స్థానం శాశ్వతం. ఆగస్టు 6న ఆయన జయంతిని జరుపుకోవడం అంటే ఒక మహనీయుడిని స్మరించుకోవడం మాత్రమే కాదు; ఆయన ఆశయాలను, ఆలోచనలను, ప్రజాసేవా దృక్పథాన్ని తదుపరి తరాలకు అందించడం కూడా.
డా. రక్కిరెడ్డి ఆదిరెడ్డి
కాకతీయ యూనివర్సిటీ
ఇవీ చదవండి:
'నేను ఎంకే స్టాలిన్ తనయుడిని'.. ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
తమిళనాడు బడ్జెట్: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. జెన్ జీకి రూ.2 వేల కోట్లు