Share News

విభజన కాలంలో పృథ్వీరాజ్‌ నాటకోద్యమం

ABN , Publish Date - Nov 03 , 2026 | 04:09 AM

స్వాతంత్ర్యోద్యమం ఉధృతంగా సాగుతున్న 1940ల కాలంలో, విభజన పరిస్థితుల మధ్య దేశం అట్టుడుకుతున్న సమయంలో, ఒక నటుడు జాతిని మేల్కొలిపే బాధ్యతను...

విభజన కాలంలో పృథ్వీరాజ్‌ నాటకోద్యమం

స్వాతంత్ర్యోద్యమం ఉధృతంగా సాగుతున్న 1940ల కాలంలో, విభజన పరిస్థితుల మధ్య దేశం అట్టుడుకుతున్న సమయంలో, ఒక నటుడు జాతిని మేల్కొలిపే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. బ్రిటిష్ నిషేధాలను బద్దలుకొట్టి నాటకాలను ప్రదర్శించి దేశభక్తిని చాటుకున్నాడు. ఆయనే భారత సినీ, నాటక రంగాలను నాలుగు దశాబ్దాల పాటు ప్రభావితం చేసిన పృథ్వీరాజ్ కపూర్.

పృథ్వీరాజ్ కపూర్ 1906 నవంబరు 3న లయల్‌పూర్‌లో (నేటి పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్‌లో) జమీందారీ కుటుంబంలో జన్మించాడు. నటనా రంగంలోకి రావాలన్న ఆకాంక్షతో న్యాయశాస్త్ర అధ్యయనాన్ని మధ్యలోనే ఆపేశాడు. నటన కోసమే 1928లో పెషావర్ నుంచి కలకత్తాలోకి అడుగుపెట్టాడు. అక్కడి ‘న్యూ థియేటర్స్‌’లో పనిచేశాడు. ఆ తరువాత బొంబాయికి మారాడు. 21 ఏళ్ల యువకుడిగా బొంబాయిలో అడుగుపెట్టినప్పటి నుంచి నాటకరంగం పట్ల తనకున్న తపనను మనసులో సజీవంగా దాచుకున్నాడు. ఆయన బలమైన కళాతృష్ణ ‘గ్రాంట్ అండర్సన్ థియేటర్‌’తో తీరింది. ఆంగ్ల నాటకాలు ప్రదర్శించే ఈ కంపెనీలో షేక్‌స్పియర్ నాటకాలు ప్రదర్శించాడు. తర్వాత సినిమాలు తీస్తూ బిజీగా ఉన్నప్పటికీ నాటకాల పట్ల ప్రత్యేక ఆసక్తితో 1944 జనవరి 15న ‘పృథ్వీ థియేటర్స్‌’ అనే నాటక సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ తమ నాటకాలను బొంబాయికే పరిమితం చేయకుండా దేశం నలుమూలలా పర్యటించింది. ఆ ప్రదర్శనలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

మొదటి నాటకంగా కాళిదాసు ‘శకుంతల’ నాటకాన్ని అరవై మందితో కూడిన పెద్ద బృందంతో 1944 మార్చి 15న ప్రదర్శించాడు. ఈ నాటక ప్రదర్శన రెండు నెలల పాటు నిరంతరం సాగింది. నాటి బ్రిటిష్ ప్రభుత్వం సెన్సార్‌షిప్‌ను ఎదుర్కొని పృథ్వీరాజ్ 1945లో ‘దీవార్’ నాటకాన్ని ప్రదర్శించాడు. అవిభాజ్య భారతదేశం ఒక సంధి దశలో నిలబడిన చారిత్రక సందర్భంలో... దేశం విభజన జరిగితే కలిగే విషాదాన్ని గురించి హెచ్చరిస్తూ, విభజన పూర్వమే ఈ నాటకాన్ని ప్రదర్శించాడు. తొలుత ఈ నాటకం పట్ల ముస్లిం లీగ్‌కు, ముఖ్యంగా జిన్నాకు అభ్యంతరాలు ఉండడంతో నాటి బ్రిటిష్ ప్రభుత్వం ప్రదర్శనకు నిరాకరించింది. భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం పోరాడి పృథ్వీరాజ్ అనుమతి పొందాడు. నిబ్బరంగా కనిపించే సర్దార్ పటేల్ సైతం ఈ నాటకం చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఈ ప్రదర్శన భారతీయ నాటక రంగంలో ఒక చారిత్రక ఘట్టం.


స్వాతంత్ర్యం తర్వాత 1948లో ‘గద్దార్’ నాటక ప్రదర్శనకు పూనుకున్నాడు. దేశంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం దృష్ట్యా ‘గద్దార్’ నాటకానికి బొంబాయి సెన్సార్ అనుమతి ఇవ్వడానికి వెనుకాడింది. పృథ్వీరాజ్ నాటి ప్రధాని నెహ్రూను కలిసి ఆయన సూచన మేరకు మౌలానా ఆజాద్ ముందు నాటకాన్ని ప్రదర్శించాడు. నాటక ప్రాధాన్యాన్ని గుర్తించిన ఆజాద్... పృథ్వీ థియేటర్ ప్రదర్శనలన్నింటికీ అనుమతిని ఇప్పించి, బృంద ప్రదర్శనల రైల్వే రాయితీ కల్పించాడు. భారత స్వాతంత్ర్య తొలి వార్షికోత్సవం సందర్భంగా 1948 ఆగస్టు 15న ‘గద్దార్’ నాటకాన్ని బొంబాయిలో ప్రదర్శించారు. దక్షిణాది పర్యటనలో 1949 జూన్‌లో హైదరాబాద్‌లో ఈ నాటకాన్ని ప్రదర్శించారు. దేశ విభజనకు దారితీసిన పరిస్థితులు, శరణార్థుల ఆక్రందనలు, బిడ్డలను కోల్పోయిన తల్లుల విషాదానికి గద్దార్ నాటకం అద్దం పడుతుంది.

పృథ్వీరాజ్ కపూర్ ‘ఆహూతి’ (1949) నాటకం దేశ విభజన అల్లర్లలో అపహరణకు గురైన మహిళలు ఎదుర్కొన్న అవమానాన్ని ఆవిష్కరించింది. ‘పఠాన్’ (1947) నాటకంలో సరిహద్దు ప్రాంతంలో హిందూ, ముస్లింల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలను మానవీయ కోణంతో ఆవిష్కరించాడు.

సినిమా రంగం దేశ విభజనను ప్రస్తావించడానికి వెనుకాడిన సమయంలో, పృథ్వీరాజ్ నాటకాల రూపంలో ఆ అంశాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాడు. అందుకే 1951 నాటికి పృథ్వీరాజ్ కపూర్, ఆయన కుమారుడు రాజ్‌కపూర్ చిత్రాలపై పాకిస్థాన్‌ ఒక అనధికారిక నిషేధాన్ని అమలు చేసిందని రచయిత సల్మా సిద్ధిఖీ ‘ఎవాక్యుయీ సినిమా’ పుస్తకంలో రాశాడు.

16 సంవత్సరాల (1944–1960) పాటు పృథ్వీరాజ్ తన బృందంతో భారతదేశం అంతటా విస్తృతంగా పర్యటిస్తూ థియేటర్లు, సినిమా హాళ్ల నుంచి పాఠశాలలు, బహిరంగ మైదానాల వరకు వివిధ వేదికలపై ప్రదర్శనలు ఇచ్చాడు. అయితే ‘పృథ్వీ థియేటర్స్’ ఎన్నడూ నిజమైన ఆర్థిక స్థిరత్వాన్ని సాధించలేదు. పృథ్వీరాజ్ సినీ నటుడిగా సంపాదించిన డబ్బుతో దాని అప్పులను తీర్చవలసి వచ్చేది. అయినా ఆ విధంగానే ఆ సంస్థ దేశ సాంస్కృతిక స్వరూపానికి గణనీయంగా దోహదపడింది. దాని ప్రభావం ఈనాటికీ స్పష్టంగా కనిపిస్తుంది. ‘పృథ్వీ థియేటర్స్‌’ ద్వారా చిత్ర పరిశ్రమకు వచ్చిన అసంఖ్యాక నటులు, సంగీతకారులు, స్వరకర్తలు, రచయితలు, సాంకేతిక నిపుణుల ద్వారా కూడా ఈ విజయం ఎంతటిదో మనం అంచనా వేయవచ్చు. ఆ జాబితా గత అరవై ఏళ్ల హిందీ సినిమాలోని ప్రముఖులందరి పేర్ల సమాహారంలా ఉంటుంది.


1960 నాటికి పృథ్వీరాజ్ తన బృందంతో 112 నగరాల్లో 5,982 రోజుల్లో 2,662 ప్రదర్శనలు ఇచ్చాడు. నటుడిగా, నాటక సంస్థ నిర్వాహకుడిగా, పృథ్వీరాజ్ తన నాటక రంగ ప్రస్థానాన్ని ‘దేశ సేవలో ఒక కళ’గా మలుచుకున్నాడు. 1972 మే 29న కన్నుమూశాడు. ఆధునిక భారతీయ రంగస్థలం, సినిమా చరిత్రలో పృథ్వీరాజ్ కపూర్ స్థానం చెరిగిపోనిది.

జె. విజయ్ కుమార్‌జీ

అధ్యక్షులు, తెలంగాణ థియేటర్ రీసెర్చ్ సెంటర్

(నేడు పృథ్వీరాజ్‌ కపూర్‌ 120వ జయంతి)

ఈ వార్తలూ చదవండి

మురసు తుఫాన్ ఎఫెక్ట్.. విజయవాడ డివిజన్‌లో పలు రైళ్ల రద్దు

మురసు తుఫాన్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్‌డీఎంఏ

Updated Date - Nov 03 , 2026 | 04:09 AM