ప్రయాణం పాదాలకే తెలుసు
ABN , Publish Date - Jun 22 , 2026 | 01:27 AM
ఇప్పుడు లోకం అద్దాలతో కట్టిన బజారు ఎదురుగా కనిపించే ముఖాలన్నీ వెలుగులో మెరుస్తున్నా...
ఇప్పుడు లోకం
అద్దాలతో కట్టిన బజారు
ఎదురుగా కనిపించే ముఖాలన్నీ
వెలుగులో మెరుస్తున్నా,
లోపల ఎన్ని చీకట్లు
గూళ్ళు కట్టుకున్నాయో
ఎవ్వరూ అడగరు.
తన రాత్రుల్ని నూనెగా కరిగించి
రేపటి దీపంలో వెలుగు నింపినవాడిని
చాలా చూపులు
జ్వాలగా కాదు,
పొగగా మాత్రమే చూస్తాయి.
కూలిపోకుండా ఉండేందుకు
తన నీడనే చేతికర్రగా మార్చుకున్న
మనిషిని చూసి
వాళ్లు నవ్వుతారు కానీ
ప్రవాహం గొంతు పట్టుకున్న వేళ
గడ్డిపోచ కూడా పడవగా కనిపిస్తుందని
మునిగిన కళ్ళకే తెలుసు.
గోడ కూలిన చప్పుడు
వీధి చివరి దాకా వెళ్తుంది;
కానీ అదే గోడ
ఎన్నో వర్షాలను అడ్డుకుని,
ఎన్నో ఎండలను భరించి,
ఒక ఇంటి ఊపిరిని మోసిన కథ
ఎవరికీ గుర్తుండదు.
పది మెట్లు ఎక్కిన వాడు
మొదటి మెట్టును చూసి నవ్వుతాడు.
అతనికి గుర్తుండేది ఎత్తు;
ఆ ఎత్తు కోసం
పాదాలు చెల్లించిన మూల్యం కాదు.
కానీ
పాదాల పగుళ్లలో ఇంకా
దారిధూళి నిద్రిస్తున్నవాడు
ఎవరినీ చిన్నచూపు చూడడు.
అతనికి తెలుసు –
శిఖరం
గాలికి మాత్రమే కనిపిస్తుంది;
ప్రయాణం మాత్రం
పాదాలకే తెలుసు.
ఎత్తుకు చేరడం గొప్ప కాదు...
జారిపడమని పిలిచిన దారిని దాటి,
గాయాల్ని మోస్తూనే పైకి ఎక్కడం –
అదే నిజమైన విజయం.
జ్యోతి మువ్వల
90080 83344
ఈ వార్తలనూ చదవండి:
యూఎస్‌తో డీల్ మాకు అనుకూలం: ఇరాన్ అధ్యక్షుడు
చర్చలు విఫలమైతే మళ్లీ దాడులు చేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక