అధికారం శాశ్వతం అనుకుంటే..
ABN , Publish Date - Aug 04 , 2026 | 02:13 AM
బొద్దింకల జనతా పార్టీ–పేరు వ్యంగ్యంగా ఉన్నా దాని ఆశయం, పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. బొద్దింకల పార్లమెంటు ముట్టడి గర్జనకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే సాక్ష్యం...
బొద్దింకల జనతా పార్టీ–పేరు వ్యంగ్యంగా ఉన్నా దాని ఆశయం, పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. బొద్దింకల పార్లమెంటు ముట్టడి గర్జనకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే సాక్ష్యం. తాము ఎన్నుకున్న ప్రభుత్వాలే తమ భవిష్యత్తును నట్టేట ముంచుతుంటే ఓపిక, సహనం నశించి తీవ్రమైన ఆవేదన, ఆవేశం, ఆక్రోశంతో యువత మనసులు రగిలి చేసిన పోరాటం ఇది. ప్రారంభంలో విద్యార్థుల పోరాటాన్ని బేఖాతరు చేసిన ప్రధాన మీడియా చానెళ్లు కూడా తదనంతరం తప్పనిసరి పరిస్థితుల్లో చూపించాల్సి వచ్చింది. విద్యార్థులు చేసిన ఏ ఉద్యమం కూడా విఫలమైనట్టు ప్రపంచ చరిత్రలో లేదు. అది వివిధ దేశాల స్వాతంత్ర్య ఉద్యమాల నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో పాటు ఇప్పుడు కాక్రోచ్‌ల ఉద్యమం వరకు రుజువైంది. విద్యార్థులు, యువతతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలూ, పార్టీలూ మనుగడ సాగించలేవు. ఎంతటి బలమైన నియంతృత్వ ప్రభుత్వమైనా విద్యార్థుల పోరాటానికి తారుమారైన చరిత్ర ఉంది. విద్యార్థులే కదా అని అలుసుగా తీసుకుంటే అధికారం గల్లంతవుతుంది. బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, ఇతర ఆఫ్రికా దేశాల్లో జరిగిన అనేక ప్రజా ఉద్యమాలను చూసి ఉన్నాం. అలాంటి పరిస్థితి ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే సమస్యలను పక్షపాత ధోరణితో సాగదీయకుండా పాలకులు, ప్రభుత్వాలు పరిష్కరించాలి. అధికారం శాశ్వతం అనుకుంటే... వారి రాజకీయ మనుగడకు ప్రమాదం వాటిల్లుతుంది. భవిష్యత్తులో ఇంతకంటే తీవ్ర స్థాయిలో విద్య, ఉద్యోగ, రాజకీయంగా అణచివేయబడ్డ అనేక సామాజిక వర్గాల నుంచి ప్రతిఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
మండ్ల రవి
ఇవి కూడా చదవండి..
విద్యార్థులపై కేసులు ఉండవు.. హామీపై కట్టుబడి ఉన్నాం: సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ
బరువు తగ్గడం కోసం ప్రమాదకర ప్రయత్నం.. టీలో ఆ ద్రవాన్ని కలిపి తాగితే..